IND vs BAN 1ST ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియం వేదికగా నేడు(ఆదివారం) భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. కివీస్ పర్యటనకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వడంతో భారత బ్యాటింగ్ లైనప్ బలం పెరుగుతుంది అనడంలో సందేహాం లేదు. అయితే.. జట్టు కూర్పు ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తున్న అంశం.
గత కొంతకాలంగా సీనియర్ ఆటగాడు అయిన ధావన్‌ను టీ20ల్లో ఆడించకుండా కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం చేశారు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో ధావన్ కీలక పాత్ర పోషిస్తాడని జట్టు మేనేజ్‌మెంట్ బావిస్తున్న నేపథ్యంలో అతడు రోహిత్ తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయం. అయితే.. రెగ్యులర్ ఓపెనర్ అయిన కేఎల్ రాహుల్‌ను పక్కన బెడతారా లేక మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తారా అని చూడాల్సిందే.
వన్ డౌన్‌లో కోహ్లీ రానుండగా, వన్డేల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడనున్నాడు. వరుసగా విఫలం అవుతున్న పంత్‌ను తప్పిస్తారా..? లేక విమర్శలను పట్టించుకోకుండా ఎప్పటిలాగే అతడిని తుది జట్టులోకి తీసుకుంటారా..? అన్నది ఆసక్తికరం. సీనియర్ బౌలర్లు షమీ, బుమ్రా లేకపోవడంతో శార్దూల్, సిరాజ్, దీపక్ చాహర్ లు వారి స్థానాలను ఏ మేరకు భర్తీ చేస్తారో. న్యూజిలాండ్ పర్యటనలో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్‌కు తోడు అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలం అయిన రోహిత్, రాహుల్ కనీసం ఈ సిరీస్‌తోనైనా ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
పసికూన ముద్రను చెరిపివేసుకుంటూ బంగ్లాదేశ్ క్రమంగా ఎదుగుతోంది. గత కొంతకాలంగా వరుసగా పెద్ద జట్లను ఓడిస్తూ వస్తోంది. సొంత గడ్డపై ఆడుతున్న బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం రావొచ్చు. ఇందుకు 2015 సిరీస్ చక్కటి ఉదహారణ. ధోని కెప్టెన్సీలో భారత జట్టు ఆ సిరీస్‌లో 1-2 తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. కెప్టెన్ తమీమ్‌తో పాటు పేసర్ తస్కిన్ గాయాలతో దూరం అవడం ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. అయినప్పటికీ లిటన్ దాస్, షకీబ్, మహ్మదుల్లా, ముష్పికర్ వంటి అనుభవజ్ఞులు ఆ జట్టులో ఉన్నారు.