రైతుబంధు పథకం ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయిన సంధర్భంగా వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రైతులతో కేక్ కట్ చేసి రైతుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతుబంధుకు ఐదేళ్లు
వర్ధిల్లాలి వెయ్యేళ్లు అంటూ, రైతును గుర్తించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని నిరంజన్ రెడ్డి అన్నారు. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేస్తూ, ఈ యాసంగిలో 63.97 లక్షల మంది రైతులకు 144.35 లక్షల ఎకరాలకు 7217.54 కోట్ల సాయం అందనున్నట్టు ఆయన తెలిపారు.
ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రపంచ ఆహార సంస్థ (FAO) 2018 – 19లో ప్రపంచంలో రైతులకు ఉపయోగపడే మేటి 20 పథకాలలో రైతుబంధు, రైతుభీమాను గుర్తించడం దీనికి నిదర్శనమని, ఏటా రూ.10,500 కోట్ల రూపాయలతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్టు మంత్రి వివరించారు. రూ.32,700 కోట్లతో విద్యుత్ మౌళిక సదుపాయాల కల్పన, ఇప్పటి వరకు రూ.17,351.17 కోట్ల రుణమాఫీ, రైతుబీమా పథకం కింద ఇప్పటి వరకు 99,297 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4964.85 కోట్ల భీమా పరిహారం, రూ.5349 కోట్లతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్దరణ, రూ.572 కోట్లతో 2601 రైతువేదికల నిర్మాణం, లక్ష 21 వేల కోట్లతో 671.22 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ, రూ.10,719 కోట్లతో ఇతర పంటల సేకరణ, రూ.1.59 లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటివన్నీ తెలంగాణలోనే సాధ్యమయ్యాయన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్దఎత్తున చేదోడు, వాదోడుగా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ ఆయన వెల్లడించారు.
ఈ పథకాల మూలంగా సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయని, ఒకప్పుడు ధీనంగా ఉన్న రైతన్న నేడు ఎవ్వరికీ బెదరకుండా గుండె ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నాడన్నారు. కష్టం చేసుకునే రైతు ఎంత కరంటు వాడినా, ఎంత భూమి సాగుచేసిన అడిగేవారు లేరని, తెలంగాణ వ్యవసాయ పథకాల మూలంగా వచ్చిన మార్పేంటి ? సమాజానికి జరిగిన మేలేంటి ? అని మహారాష్ట్ర నుండి వచ్చిన బృందం అధ్యయనం చేస్తున్నదన్నారు. తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా ఇక్కడి సమాజంలో శాంతి నెలకొన్నదని, ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న గొప్పగా బతికినప్పుడే సమాజం బాగుంటుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. వ్యవసాయరంగం పట్ల కేంద్రం తిరోగమన విధానంలో ముందుకుసాగుతుంటే తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో పురోగమన విధానంలో ముందుకుపోతున్నదన్నారు.
అత్యధిక శాతం మంది ఆధారపడిన వ్యవసాయరంగానికి చేయూత ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచన, అందుకే అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ నినాదంతో బీఅర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ముందుకుపోతున్నదన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, జాతీయ నినాదం దేశవ్యాప్తంగా రైతాంగాన్ని, మేధావులను, బుద్దిజీవులను ఆలోచింపచేస్తున్నదని, తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఅర్ఎస్ జెండా ఎగురుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. నల్ల వ్యవసాయ చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్న చరిత్ర బీజేపీదని, రాబోయే ఎన్నికల్లో ప్రజాగ్రహంలో దేశవ్యాప్తంగా బీజేపీ పతనం ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు. మోడీ అనాలోచిత విధానాలు దేశాన్ని సంక్షోభం వైపు నెడుతున్నదని, రైతులను, రైతుకు అండగా నిలిచే కేసీఆర్ పార్టీని కాపాడుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. కొన్ని నిర్ణయాలు సమాజంలో మార్పుకు ఎలా నాంది పలుకుతాయో తెలంగాణ ప్రభుత్వ పథకాలు దానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
2018 మే 10న కరీంనగర్ జిల్లా శాలపల్లి బహిరంగసభలో ధర్మరాజుపల్లి రైతులకు చెక్కులు, పట్టాదార్ పాసుపుస్తకాలు ఇచ్చి రైతుబంధు ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయిన సంధర్భంగా వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రైతులతో కేక్ కట్ చేసి రైతుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.