సకల మానవాళికి ఆదర్శ పురుషుడైన శ్రీరాముడు గొప్పవాడా .. రామనామం గొప్పదా అన్న సంశయం ఏర్పడినప్పుడు .. రాముడి కన్నా … రామనామం గొప్పదని నిరూపించారు రామ భక్తుడు హనుమంతుడు. త్రేతాయుగం నుండి నేటికీ, హనుమంతుడు చిరంజీవిగా ఉన్నారని భక్తుల విశ్వాసం. ఇండియాలో రాముడి ఆలయం .. హనుమంతుడి విగ్రహం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. సీతారాములను కలిపిన ఈ ఆజన్మ బ్రహ్మచారికి భక్తులు ఎక్కువ. రామనామ సంకీర్తనకు అంకితమైన ఆ శ్రీరామభక్తుడు మనమధ్యే తిరుగుతున్నాడని వారి విశ్వాసం. అందుకే ఆంజనేయస్వామికి భక్తితో ఆకుమాల .. వడమాల సమర్పించి కోరిన కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. దేశవ్యాప్తంగా ఆంజనేయస్వామి ఆలయాలు, విగ్రహాలు ఉన్నా .. కొండగట్టు ఆంజనేయస్వామి ప్రత్యేకత వేరు. నరసింహస్వామిగాను, ఆంజనేయస్వామిగానూ రెండు ముఖాలు కలిగి ఉండడం కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రత్యేకత.
కొండగట్టు ఆలయ కథ
సీతాదేవిని అపహరించిన రావణబ్రహ్మతో .. వానరసైన్యం సహాయంతో రామలక్ష్మణులు యుద్ధం చేస్తున్నారు. రావణాసురుడి కుమారుడు మేఘనాథ్ వేసిన బాణాల ధాటికి లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయారు. వారిని తిరిగి స్పృహలోకి తీసుకు రావడానికి హనుమంతుడు సంజీవని పర్వతాన్ని లంకకు తీసుకెళుతుండగా .. ఆ పర్వతంలో కొంతభాగం కరీంనగర్‌లోని జగిత్యాలకు ఓ 15 కిలోమీటర్ల దూరంలో ముత్యంపేట అనే ఊర్లో పడిందట. అదే కొండగట్టు అనే పర్వతంగా మారిందని, ఆ పర్వతంపై హనుమంతుడు స్వయంభువుగా వెలిశారని స్థల కథనం. అయితే .. ఆ స్వామి గురించి ఎవరికీ తెలియదు. ఓ అయిదు వందల ఏళ్ల క్రితం సంజీవుడు అనే పశువుల కాపరికి ఆంజనేయస్వామి కలలో కనిపించి… తన విగ్రహం ఫలానా చోట ఉందనీ, దానికి ఓ గుడి కట్టించమనీ చెప్పారని . అప్పటి నుంచీ ఇక్కడి స్వామి గురించి ప్రపంచానికి తెలియడం ప్రారంభమైందని స్థల కథనం.
కొంగడట్టు ఆంజనేయస్వామి విగ్రహానికి రెండు ముఖాలు ఉండటం మరో అద్భతం. అందులో ఒక ముఖం హనుమంతునిది కాగా, మరొకటి నరసింహస్వామిది. అలాగే ఈ స్వామి భుజాల మీద శంఖుచక్రాలు, ఛాతీ మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. స్వామివారి ఆలయంలోనే ఆండాళ్ తల్లి విగ్రహం, శివలింగాలు కూడా ఉండటం మరో విశేషం. స్వామి గుడి వెనకాల బేతాళస్వామి గుడి ఉంటుంది. అక్కడి బేతాళస్వామికి జంతుబలులు, కల్లు నైవేద్యం అర్పించడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. స్వామి గుడి ముందు సీతమ్మవారి కన్నీట చారలు కనిపిస్తాయి. అరణ్యవాసంలో రాముడి కష్టాలు చూసి బాధపడిన సీతమ్మ ఇక్కడే కన్నీరు కార్చిందని అంటారు.
ఉత్సవాలు
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్ర, వైశాఖ మాసాల్లో రెండుసార్లు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ పర్వదినం సందర్భంగా ఆంజనేయస్వామి దీక్ష తీసుకున్న లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనార్ధం తరలి వస్తుంటారు. ఉగాది పండుగ రోజు స్వామి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. చైత్ర శుద్ధనవమి రోజున అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా జరుపుతారు. శ్రావణమాసంలో సప్తాహ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం నెల రోజులపాటు ధనుర్మాసోత్సవాలు, తిరుప్పావై, గోదారంగనాయకుల కళ్యాణం జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు ఉత్తరద్వారం ద్వారా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆలయ పవిత్రత కొరకు ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు జరుగుతాయి. అంతే కాకుండా ప్రపంచ శాంతి కొరకు, లోక కల్యాణార్ధం ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహించడం విశేషం
సంతానం కోసం 40 రోజుల దీక్ష
సంతానం లేని దంపతులు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటే సంతానవతులు అవుతారని భక్తుల నమ్మకం. వేలాది మంది భక్తులు కొండగట్టు ఆంజనేయస్వామని దర్శించుకుని సంతానం కోసం 40 రోజుల దీక్ష తీసుకుంటారు. స్వామివారిని నమ్మి శ్రద్ధగా .. దీక్షగా 40 రోజుల పాటు సంతానదీక్షను ఆచరిస్తే వారి కోర్కె ఫలిస్తుందని విశ్వసిస్తారు. చక్కని సంతానం కలిగి తల్లిదండ్రులుగా మారతామని భక్తులు నమ్మకం. అంతేకాదు భక్తులు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి వారి ఎదుట 11 రోజులు, 21 రోజులు 41 రోజుల దీక్షలను తీసుకుంటారు.. స్వామి వారి ఎడమ చేతి గిన్నె నుండి తీసిన శ్రీ స్వామి వేరి చందనం మంచి మహాత్మ్యం కలిగి ఉంటుందని భక్తుల విశ్వాసం. అందుకే, తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి సైతం వేలాది మంది భక్తులు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటున్నారు.