Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Pakistan: సమస్యల వలయంలో పాకిస్థాన్‌

Pakistan: సమస్యల వలయంలో పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ను ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌రాజకీయ నాయకులు పరస్పరం కలహించుకుంటూ సైన్యం ఉచ్చులో బిగుసుకుపోతున్నారు. అసలే అనేక సమస్యలు, సంక్షోభాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ దేశం ఇప్పుడు సరికొత్త సమస్యలో చిక్కుకుంది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఆయన ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న సైనిక వ్యవస్థకు ఇదొక పెద్ద అశనిపాతమని చెప్పక తప్పదు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన కొన్ని కేసులలో బెయిలు కోసం ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ ఖాన్‌ను అవినీతి నిరోధక శాఖగా ఉన్న నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో ఆదేశాలతో భద్రతా దళాలు గత మంగళవారం నాడు అరెస్టు చేయడం జరిగింది. 2022 నవంబర్‌లో ఒక ఉన్నత సైనికాధికారి తనను హత్య చేయడానికి కుట్ర చేశారంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించగా, నిరాధార ఆరోపణలు చేయవద్దని సైన్యాధికారులు గట్టిగా హెచ్చరించడం జరిగింది.
ఇది ఇలా ఉండగా, గత 2022 ఏప్రిల్‌లో పదవీచ్యుతుడు అయినప్పటి నుంచి ఆయన షరీఫ్‌ నాయకత్వంలోని 13 పార్టీలసంకీర్ణ ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉన్నారు. అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిని ముందుగానే నిర్వహించాలని డిమాండ్‌ చేయడంతో పాటు, దేశంలో అనేక ప్రాంతాలలో ర్యాలీలు నిర్వహించడం ప్రారంభించారు. వీటి కారణంగా ఆయనకు ప్రజల్లో మద్దతు పెరిగింది. అందుకు సూచనగా ఆయన కొన్ని ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం కూడా జరిగింది. సంకీర్ణ ప్రభుత్వ రేటింగ్‌ క్రమక్రమంగా పడిపోతోందని కూడా అనేక సర్వేలలో వెల్లడైంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ, షరీఫ్‌ ప్రభుత్వం తన పంథాను మార్చుకోవడానికి మాత్రం ససేమిరా అంటోంది. ఇమ్రాన్‌ ఖాన్‌ డిమాండ్లలో ఒక్కదాన్ని కూడా అంగీకరించేది లేదని తేల్చి చెబుతోంది. ఒకప్పుడు క్రికెటర్‌గా అనేక దేశాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మారి 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ప్రధానమంత్రిగా ఆయన మూడేళ్ల పాటు సైన్యంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అధికారంలో ఉన్నంత కాలం ఆయన ప్రతిపక్షాలను వేధించి వెంటాడారు. తనకు రాజకీయంగా ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ సైన్యం తనకు అండగా నిలబడిందని ఆయన బాహాటంగానే చెప్పుకున్నారు. ఆయన వేధించిన ప్రతిపక్షాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కూడా ఉంది.
కాగా, కొన్ని నియామకాల విషయంలో సైనికాధికారులకు, ఆయనకు మధ్య విభేదాలు తలెత్తడంతో వారంతా ఆయనకు దూరమైపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌ మీద ఇప్పుడు పాలక సంకీర్ణం వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తూ, ఒక దాని తర్వాత ఒకటిగా కేసులు పెడుతూ వస్తోంది. మొదటి నుంచీ కుట్రలు, కుతంత్రాల ద్వారానే బలం పెంచుకుంటూ వస్తున్న పాకిస్థాన్‌ సైన్యం ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద కూడా పట్టు కొనసాగిస్తోంది. సాధారణంగా పాకిస్థాన్‌లో పాలక పక్షాలు తమ ప్రత్యర్థులను అదుపులో ఉంచడానికి సైన్యాన్నే ఆశ్రయిస్తుంటాయి. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం కూడా అదే పొరపాటు చేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాల్సింది పోయి, ఆయనను భద్రతా దళాలతో అరెస్టు చేయించడం, ఆయన మద్దతుదార్లపై కేసులు పెట్టి కటకటాల్లో పెట్టడం వగైరా చర్యలు సైనిక ప్రోద్బలంతో చేసినవే. చివరికి సుప్రీంకోర్టు కల్పించుకుని ఆయనను విడుదల చేయాల్సి వచ్చింది.
పాకిస్థాన్‌ అతి దుర్భరమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఇటువంటి రాజకీయ సంక్షోభం చోటు చేసుకోవడం దురదృష్టకర విషయం. పాకిస్థాన్‌ విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ద్రవ్యోల్బణం కూడా దాదాపు 35 శాతం పెరిగిపోయింది.రూపాయి మారకం విలువ కూడా దారుణంగా పడిపోయింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ వీరి కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటూ వస్తున్న పాకిస్థానే చివరికి ఉగ్రవాదుల దాడులకు గురవుతోంది. అఫ్ఘానిస్థాన్‌లో బలం పుంజుకున్న తాలిబాన్ల అండదండలతో పాకిస్థాన్‌లో తెహ్రీక్‌-ఇ- తాలిబాన్‌ ఇప్పుడు పాకిస్థాన్‌ మీదే పోరాటం సాగిస్తోంది. ఇటువంటి సమస్యల మీద వెనువెంటనే దృష్టి పెట్టాల్సిన పాకిస్థాన్‌ రాజకీయ నాయకులు తమలో తాము కలహించుకోవడంతో కాలక్షేపం చేస్తున్నారు. దీనివల్ల ఈ దేశం మరింతగా బలహీనపడుతోంది. అరాచక, అసాంఘిక శక్తులు బలపడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News