Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: నగర పరిశుభ్రత మెరుగుపరుద్దాం

Karimnagar: నగర పరిశుభ్రత మెరుగుపరుద్దాం

శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ద్వారా కరీంనగర్ నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరుస్తామని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పురపాలక శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు నగరంలోని 60 డివిజన్ లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 33వ డివిజన్ భగత్ నగర్ లో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను లాంఛనంగా ప్రారంభించారు.

- Advertisement -

మొదటగా డివిజన్ లో డివిజన్ కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, కార్మికులు, ఎస్.హెచ్.జీ. సభ్యులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డివిజన్ లో వివిధ రకాల సమస్యల పై చర్చించుకొని చేపట్టాల్సిన పారిశుధ్య డ్రైవ్ పనులపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకున్నారు. 8 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ లో చేయాల్సిన పనులపై ప్రత్యేక అధికారితో పాటు ఇంజనీరింగ్, సానిటేషన్ అధికారులు, సిబ్బందికి మేయర్ ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ లోని వివిధ సమస్యలపై సలహాలు సూచనలు చేశారు. అనంతరం డివిజన్ లో మహిళా సంఘ సభ్యులు, పారిశుధ్య సిబ్బంది, కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అనంతరం మేయర్ యాదగిరి సునీల్ రావు స్వయంగా పారిశుధ్య కార్మికులతో కలిసి డివిజన్ లోని రోడ్లు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు డ్రైనేజీలలో పేరుకు పోయిన సిల్ట్ ను తొలగించారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో మాట్లాడి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలను విజయవంతంగా చేయాలని, నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని కోరారు. కార్మికులతో కలిసి టీ తాగారు. నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో కూడా పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ పనులు మొదటి రోజు ముమ్మరంగా కొనసాగాయి. డివిజన్ లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక డివిజన్ సమావేశాలు జరిగాయి. డివిజన్ లలో సమస్యలను చర్చించుకొని ప్రత్యేక ప్రణాళికలతో స్పెషల్ డ్రైవ్ పనులు చేపట్టారు. పరిశుభ్రత పనులు, డిబ్రీస్ తొలగింపు పనులు, ఖాళీ స్థలాల పరిశుభ్రత పనులు, వర్షకాలం వస్తే నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలు తదితర పనులు కొనసాగాయి.

8 రోజుల పాటు ప్రతి డివిజన్ లో కొనసాగే సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో ప్రజల చాలా సమస్యలు పరిష్కారం అవడంతో పాటు డివిజన్ల పారిశుధ్యం మరింత మెరుగు పడనుంది. అంతే కాకుండా వచ్చే వర్షాకాలం దృష్ట్యా ప్రణాళికలు రూపొందించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరో వైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో స్వచ్చతా కార్యక్రమైన మేరీ లైఫ్.. మేరా స్వచ్చతా షెహార్.. కార్యక్రమం పనులు కూడా డివిజన్ల వారీగా కొనసాగాయి. రెడ్యూజ్ రీయూజ్ రీసైకిల్ అయ్యే వస్తుల సేకరణలో భాగంగా ఆర్.ఆర్.ఆర్. ( త్రిబులార్) సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ పనులు కూడా డివిజన్ల వారీగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్డ్ ప్రకారం 8 రోజుల పాటు 60 డివిజన్ లలో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను విజయవంతం చేస్తామన్నారు. డివిజన్ లో ఉన్న సమస్యల ప్రకారం పక్కా ప్రణాళికలు రూపొందించి నగరంలోని అన్ని డివిజన్లు కవర్ అయ్యేలా ఇంఛార్జి అధికారులను నియమించుకొని స్పెషల్ డ్రైవ్ పనులను నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు అన్ని డివిజన్ లో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయన్నారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, సానిటేషన్ అధికారులు, సిబ్బంది, కార్మికులు , మెప్మా, మహిళా సంఘాలు సమిష్టిగా ఒక గ్యాంగ్ వర్క్ తో చేశామన్నారు. 8 రోజుల్లో పారిశుధ్య పరంగా ఉన్న అన్ని సమస్యలను తీర్చుకునే పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు. పారిశుధ్య పనుల్లో ఎక్కడా లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మికులతో పాటు అవసరమున్న చోట యంత్రాలను కూడా వాడుతున్నామని తెలిపారు.

నగరంలోని డివిజన్ల వారీగా ఖాళీ స్థలాలన్నింటినీ గుర్తించి శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రోజూ చేసే పారిశుధ్య పనుల కంటే ఇంకా మెరుగ్గా పనులు చేయడం జరుగుతుందన్నారు. కాలనీల్లో రోడ్లపై చెత్తను క్లీన్ చేయడం, ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను 100 శాతం వేరు చేసి సేకరించడం, భవనాల డిబ్రీలను తొలగించడం, డ్రైనేజీల్లో దోమల లార్వాలు పెరగకుండా స్ప్రే లు చేయడం, సిల్టు తోలగించడం, తడి చెత్త ద్వారా ఇంట్లో వర్మి కంపోస్ట్ తయారు చేసేలా చూడటం, రోడ్లపై చెట్ల కొమ్మలు తొలగించడం లాంటి ఇతర పనులన్నీ చేపట్టి కరీంనగర్ ను పరిశుభ్రమైన నగరంగా మార్చుతున్నామని తెలిపారు. 8 రోజులే కాకుండా నగరపాలక సంస్థ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వర్షాకాలం ముగిసే వరకు ముందస్తు చర్యగా స్పెషల్ డ్రైవ్ ను కొనసాగిస్తామన్నారు. సానిటేషన్ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించి ప్రజలు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీరు నిలిచే ప్రాంతాలను గత అనుభవంతో గుర్తించి అలాంటి ప్రదేశాల్లో ముందుస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా దోమలు పుట్టకుండా, కుట్టకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్టు వివరించారు.

వర్షాకాలంలో డిలాపరేటేడ్ భవనాలను గుర్తించి ముందస్తుగానే అందులో నివసించే వారిని అలర్ట్ చేసి వారు ఎక్కడైనా అవాసం ఉండాలని కోరడం జరుగుతుందన్నారు. బాగా శిథిలమైన భవనాలకు నోటీసులు ఇచ్చి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే టౌన్ ప్లానింగ్ సిబ్బంది సహాయంతో తొలగించడం జరుగుతుందన్నారు. పురపాలక శాఖ ఆదేశాలు అన్నీ పాటించి పరిశుభ్రమైన నగరంగా కరీంనగర్ ను మార్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో వర్షాకాలంలో ఒకేసారి పెద్ద మొత్తంలో వర్షం పడి రోడ్లపైకి నీరు వస్తే ఒక అరగంట పాటు ఇబ్బందులు వస్తాయని, ప్రజలు ఎవరు భయపడాల్సిన పని లేదన్నారు. అలా జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో వర్షాకాలంలో ఎప్పుడూ ఇబ్బంది రాకుండా దీర్ఘకాలిక కార్యచరణ చేపడుతున్నట్లు తెలిపారు. డీ.ఆర్.ఎఫ్. బృందం కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలుగకుండా 24 గంటలు సహాయక చర్యలు చేపడుతుందన్నారు. నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా మార్చడం తమ ప్రధాన బాధ్యత అన్నారు. ఆ దిశగా నగరపాలక సంస్థ ముందుకు సాగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదికారులు, మెప్మా, మహిళ సంఘాలు, కార్మికులు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News