నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద అర్హత కల ప్రతి పేదవాడికి ఇంటి పట్టా మంజూరు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. టిడ్కో గృహ సముదాయం, కర్నూలు హైవే సమీపంలో 108 ఎకరాల్లోని జగనన్న లేఔట్లో నిరుపేదలకు పట్టాలిచ్చే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సునీతా అమృత్ రాజ్, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ నూతనంగా నంద్యాల జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్ట మొదటిసారిగా పెద్ద ఎత్తున 3006 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేస్తున్నామన్నారు. టిడ్కో గృహ సముదాయం, కర్నూలు హైవే సమీపంలో 108 ఎకరాల్లోని జగనన్న లేఔట్ ఏర్పాటుకు ఎన్నో సమస్యలను, అడ్డంకులను ఎదుర్కొని చట్టపరంగా కోర్టు కేసుల్లో న్యాయం సాధించి ఇంటి స్థల పట్టాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి కృషిచేసిన లాయర్లు, రెవిన్యూ సిబ్బంది, కాలుష్య నియంత్రణ మండలి తదితర అధికారులందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నాయని విడతల వారీగా అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేస్తామన్నారు. అవసరమైతే భూసేకరణ జరిపి ప్రతి పేదవాడికి నిబంధనల ప్రకారం పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కంప్యూటర్ లాటరీ సిస్టం ద్వారా పారదర్శకంగా ప్లాట్లు కేటాయించమన్నారు. లేఔట్ లో డిటిసిపి నార్మ్స్ ప్రకారం రోడ్లు, పార్కులు, భవిష్యత్తు అవసరాల కోసం బహిరంగ ప్రదేశాలు ఉంచుకోవడం జరుగుతుందన్నారు.
పట్టాలు పొందిన అల్లబ్ధిదారులందరూ గృహాలు నిర్మించుకునేందుకు ఉత్సాహం చూపాలన్నారు. ప్రభుత్వం లక్షల విలువైన భూమి పేదలకు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన నిధులు 1.80 లక్షలు మంజూరు చేస్తోందన్నారు. అలాగే పొదుపు గ్రూపు సభ్యులకు అదనంగా మరో 35 వేల రూపాయలు వడ్డీ లేని రుణం అందిస్తోందన్నారు. ఈ మేరకు గృహాలు కట్టుకుంటే స్థలాలు కబ్జా కావడమే కాకుండా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంటుందన్నారు. కుందూ నదిపై బ్రిడ్జి ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం వివిధ పథకాల ప్రవేశపెట్టి అమలుపరస్తోందన్నారు. పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమ అభ్యున్నతే అభివృద్ధి అంటారని ఈ సందర్భంగా అన్నారు.స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న లేఔట్ లో 3006 మంది నిరుపేదలకు సెంటు స్థలం చొప్పున ప్లాట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సెంటు 8 లక్షల విలువ చేసే ప్లాట్లలో లబ్ధిదారులు గృహాలు నిర్మించుకుంటే జగనన్న కాలనీ ప్రాంతంలో శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయిస్తానన్నారు. ప్లాట్ల కేటాయింపు పారదర్శకంగా ఉండేలా, అర్హత ప్రామాణికంగా కుల, మత, రాజకీయాలకు తావు లేకుండా ప్లాట్ల కేటాయింపు చేశామన్నారు. రెండో విడుదల మరో వెయ్యి మందికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దశాబ్దాల కాలం నాటి మెడికల్ కాలేజీ కలను ప్రభుత్వం నెరవేస్తుందన్నారు. ఈ ఏడాది 150 మంది మెడికల్ విద్యార్థులు సీట్లు పొంది విద్యనభ్యసిస్తారన్నారు.