Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: సుందర నగరంగా కరీంనగర్

Karimnagar: సుందర నగరంగా కరీంనగర్


కరీంనగర్ నగరం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ఒక సుందరమైన నగరంగా రూపుదిద్దుకుంటోందని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా ఇంజనీరింగ్, ఆర్.వి. అధికారులతో కలిసి మేయర్ సునీల్ రావు నగరంలోని 10, 50 డివిజన్ల పరిధిలోని గణేష్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. గతంలో స్థానిక ప్రజలకు ప్రధాన సమస్యగా మారి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా నిర్మాణం చేస్తున్న గణేష్ నగర్ 60 ఫీట్ల బైపాస్ రోడ్డు, డ్రైనేజీ పనులతో పాటు డివిజన్ల పరిధిలో నిర్మాణం చేస్తున్న వివిధ అభివృద్ధి పనులను కూడా తనిఖీ చేసి పరిశీలించారు. గణేష్ నగర్ ప్రధాన స్టాం వాటర్ డ్రైనేజీ పనుల వేగవంతంపై నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, ఆర్.వి. అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ కు మేయర్ పలు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో గత 3 సంవత్సరాలుగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులన్నీ తుది దశకు చేరాయన్నారు. వర్షాకాలం వచ్చేలోగా చేపట్టిన పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా వర్షాకాలంలో వరద నీటితో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్లపైకి, ఇండ్లలోకి నీరు చేరకుండా నగరంలో స్టాం వాటర్ డ్రైనేజీ నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా గణేష్ నగర్ బైపాస్ రోడ్డు, డ్రైనేజీ పనులు కూడా చివరి దశకు చేరాయని, వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నగరంలో ఎక్కడ కూడా వర్షాకాలంలో ఇబ్బందులు, సమస్యలు కలుగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు జరుగుతున్నాయన్నారు.

గతంలో గణేష్ నగర్ డ్రైనేజీ సమస్యతో హనుమాన్ నగర్, తిరుమల నగర్, కట్టా రాంపూర్, కోతిరాంపూర్, గణేష్ నగర్ ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అంబేద్కర్ స్టేడియం ముందు నుండి హైదరాబాద్ ప్రధాన రహదారి వరకు 60 ఫీట్ల స్మార్ట్ రోడ్డును పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం డ్రైనేజీ స్లాబ్ కల్వర్టు పనులు చివరి దశకు చేరాయని స్పష్టం చేశారు. వర్షాకాలంలోగా స్టాం వాటర్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. కరీంనగర్ నగరంలోని 80, 60, 50, 40 ఫీట్ల ప్రధాన రోడ్లను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇంకా మిగిలిన రోడ్లను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

స్మార్ట్ సిటీకి సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రభుత్వం సంవత్సరం వరకు గడువు పొడగించారు కనుక రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో మిగతా పనులు చేపట్టేందుకు తగిన ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇంజినీరింగ్ అధికారుల సమన్వయం కార్పొరేటర్ల సహకారంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ వచ్చామన్నారు.

రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరం ఒక సుందరమైన నగరం కాబోతుందన్నారు. మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ల సహకారంతో నగరంలో వివిధ గ్రాంట్లు, స్మార్ట్ సిటీ నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా సీఎం అస్యూరెన్స్, స్మార్ట్ సిటీ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరీంనగర్ కు ఇతర ప్రాంతాల నుండి వచ్చి పోయే వారు కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందని ప్రశంసిస్తుంటే చాలా ఆనందం వేస్తోందన్నారు. ఇదే సూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి అన్ని రకాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నగరంలో ఇప్పటి వరకు రోడ్లు, డ్రైనేజీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడంతో సానిటేషన్ కు కూడా ఎలాంటి సమస్య లేదన్నారు.

అంతే కాకుండా ప్రజల మంచినీటి సమస్యలు కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యాయని తెలిపారు. నగరంలో చాలా అద్భుతంగా వీధి దీపాలను ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధి పనులను ఒక ప్రణాళిక ప్రకారం సకాలంలో పూర్తి చేస్తూ నగరానికి కొత్తరూపు తెచ్చామన్నారు. కరీంనగర్ ను ఒక అద్బుత నగరంగా తీర్చిదిద్దడంలో తమ పాలకవర్గం ఎల్లప్పుడు పనిచేస్తుందన్నారు. గణేష్ నగర్ బైపాస్ రోడ్డును మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నారు. గణేష్ నగర్ బైపాస్ రోడ్డులో డ్రైనేజీ స్లాబ్ వర్క్, కల్వర్ట్ పనులు పూర్తి చేసి చక్కటి లైటింగ్ వ్యవస్థను అమర్చి త్వరలోనే ఈ రోడ్డును ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు.

కరీంనగర్ నగరంలో డ్రైనేజీ సమస్యతో ముంపు ప్రాంతాల ప్రజలు గతంలో చాలా ఇబ్బందులు పడే వారని, ప్రస్తుతం ఆ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వచ్చే వర్షాకాలంలో వర్షాలతో ఎక్కడా ఇబ్బందులు రావన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అంజయ్య, కాసర్ల ఆనంద , ఎస్.ఈ. నాగమల్లేశ్వర్ రావు, ఈఈ కిష్టప్ప, ఆర్.వి. అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News