Mandous: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ఉదయం తుఫాన్ గా మారింది. గంటకు 10 కిమీ వేగంతో ఇది తమిళనాడు వైపు దూసుకొస్తోంది. మాండస్ తుఫాను.. రోజురోజుకూ పరిధి పెంచుకుంటూ.. మరింత బలంగా దూసుకొస్తోంది. దీనిపై వాతావరణ అధికారులు వేస్తున్న అంచనాలు మాటిమాటికీ మారిపోతున్నాయి. ముందుగా బుధవారం తీరం దాటుతుందని అధికారులు అంచనా వెయ్యగా.. తాజాగా ఈ లెక్క మారింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గర్లో ఉన్న మాండస్ శుక్రవారం రాత్రికి లేదా శనివారం ఉదయం శ్రీహరికోట – పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
దీని ప్రభావంతో గురువారం నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. శుక్రవారం ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, బాపట్ల, వైఎస్ఆర్ జిల్లా, సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. శనివారం కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపూర్. సత్యసాయి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ శుక్రవారం రాత్రికి తీరం దాటితే మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉండగా ఈ సమయంలో దక్షణ కోస్తాలో భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తుఫాన్ ప్రభావం ఉత్తర తమిళనాడుతోపాటూ.. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉంటుందని అధికారులు చెబుతుండగా.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయనీ, సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని చెబుతున్నారు. గురువారం నుండి శనివారం వరకూ వర్షాలు ఉంటాయని అంచనా వేస్తుండగా.. తీరం దాటాక మాండస్ తుఫాను జోరు తగ్గి.. వాయుగుండంగా మారి ఆ తర్వాత మరింత బలహీనపడుతుందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కోరగా.. ఇప్పటికే పలు జిల్లాలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు.