Friday, October 18, 2024
Homeట్రేడింగ్Dreaming of Own house: మోసాలుంటాయి .. బీకేర్‌ఫుల్

Dreaming of Own house: మోసాలుంటాయి .. బీకేర్‌ఫుల్

హైదరాబాద్‌ మహానగరంలో సొంత ఇల్లు ఉందంటే ఆ కిక్కే వేరు…సమాజంలో సామాన్య, మధ్య తరగతి .. ఉన్నత, సంపన్నుల వంటి ఎన్ని వర్గాల ప్రజలున్నా .. ప్రతి ఒక్కరూ కోరుకునేది మాత్రం సొంతిల్లే. వ్యక్తులు, హోదాలు, స్థాయిలను బట్టి కొనుగోలుశక్తిలో మార్పుంటుంది. తప్ప కొనుక్కోవాలనే కోరికలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. అందుకే .. దేశ రాజధాని ఢిల్లీ .. ఆర్థిక రాజధాని ముంబై .. క్లాస్ సిటీ బెంగళూరు కంటే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ రంగం అగ్రస్థానంలో ఉంది. అయితే .. విశ్వనగరంలో ఎక్కడో ఒక చోట ఇల్లో .. బంగళానో సొంతం చేసుకోవాలన్న తొందరలో మోసపోయే ప్రమాదం ఉంది. పూర్తిగా అనుమతులు రాని లే అవుట్‌లు, ఇన్‌స్టంట్ అనుమతులతో రిజిస్ట్రేష్టన్ల మోసాలు జరిగే అవకాశం ఉంది. మరి అటువంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
గత కొంతకాలంగా హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ జోరందుకుంటోంది. నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి వంటి జిల్లాల పరిధిలో ఈ స్థిరాస్తి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలోనే అక్కడ ఇన్‌స్టంట్ అనుమతులతో రిజిస్ట్రేషన్‌లో మోసాలు జరుగుతున్నాయట. మరి మీరు కూడా ఏం ఆలోచించకుండా ప్లాట్స్ కోసం అలా చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. ఏం జరుగుతుందో తెలుసుకోండి.
కోవిడ్ ఎఫెక్ట్ పూర్తిగా కనుమరుగవడంతో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ మళ్లీ పుంజుకుంటోంది. ఏడాది నుంచి మళ్లీ స్థిరాస్తి వ్యాపారం భారీగానే జరుగుతోంది. అందులోనూ హైదరాబాద్‌ రియల్ రంగం అభివృద్ధిపథంలో దూసుకెళుతోంది.తెలంగాణలోని హైదరాబాద్‌ మహానగరం చుట్టూ ఉన్న ప్రధాన జిల్లాల పరిధిలో రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, మెదక్, మేడ్చల్ వంటి చోట్ల రియల్ ఎస్టేట్ రంగం జోరుందుకుంది. ఇక ఇదే అదనుగా చూసుకొని.. కొంతమంది భూయజమానులు నిషేధిత స్థలాలను కూడా ప్లాట్లుగా విక్రయిస్తున్నారు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు.. అఫీషియల్, అన్‌అఫీషియల్ లేఅవుట్స్‌లో ఇళ్ల స్థలాలను విక్రయించి.. అడ్డగోలుగా అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాయి. ఇక్కడే కొనేవారికి సమస్య మొదలవుతోంది. ఇక ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌కు ప్రామాణికంగా తీసుకున్న నిర్మాణ అనుమతి 15 రోజుల్లో రద్దవుతుంది. దీంతో ఇక భవిష్యత్తులో సదరు స్థలాన్ని.. వేరేవారికి విక్రయించడం కూడా కష్టంగా మారుతుంది.
ఇక ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై బాధితుల నుంచి కొద్దికాలంగా ఫిర్యాదులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఇతర స్థానిక సంస్థలు రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాసి ఆ మోసాల గురించి వెల్లడించాయి
లేఅవుట్స్ విషయానికి వస్తే.. ఇవి అధికారిక, అనధికారిక అనే రెండు రకాలుంటాయి. అఫీషియల్ లేఅవుట్స్‌లో ప్రతి ప్లాట్‌కు ఒక సంఖ్య ఉంటుంది, ఈ నంబర్ ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. బై నంబర్స్‌తో అమ్మే ప్లాట్స్ విషయంలో కొనేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇక అనధికారిక లేఅవుట్స్ ప్లాట్ల అమ్మకాలకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలి. అనుమతి లేకున్నా ఇంటి స్థలం కొనుగోలు చేసి, ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకొని ఇళ్లు కట్టుకోవచ్చు. ఇంటి అనుమతికి అర్హత లేని లేఅవుట్ల అమ్మకాలే సమస్యకు కారణమవుతున్నాయి. దీంతో కొనుగోలుదార్లకు అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. అవేంటంటే..
జాగ్రత్తలు
టీఎస్‌బీపాస్ చట్టం ప్రకారం 600 గజాల లోపు విస్తీర్ణంలో, 10 మీటర్ల ఎత్తు వరకు చేపట్టే నిర్మాణాలకు దరఖాస్తు చేస్తే వెంటనే అనుమతి మంజూరు అవుతుంది. దీనినే ఇన్‌స్టంట్ అప్రూవల్ అని అంటారు. 15 రోజుల్లోగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.తుది నిర్ణయం తీసుకుంటారు. అంతా నిబంధనలకు అనుగుణంగా ఉందని అధికారులు భావిస్తే .. అప్పుడు తుది ఆమోద పత్రం జారీచేస్తారు
అనధికారిక లేఅవుట్స్‌లో ప్లాట్ కొనాలనుకుంటే.. జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ,హెచ్‌ఎండీఏ ఆమోదించిన తుది లేఅవుట్‌ను అనుసరించాలి. అందులో నంబర్స్ వేసిన వాటినే కొనాలి. ఇక ఇలాంటి సమయంలోనే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యాపారులు .. లేఅవుట్‌లోని ఖాళీ స్థలాలు, ఇతర అవసరాలకు కేటాయించిన స్థలాలు, పార్కు వంటి వాటిని అమాయకులకు విక్రయిస్తుంటారు ఇది మొదటి తరహా మోసం.ఇక అనధికారిక లేఅవుట్‌లో ఇంకొందరు.. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లో, నిషేధించిన భూముల్లో, గ్రీన్ జోన్‌, మాస్టర్ ప్లాన్‌లోనో రోడ్డు కోసం కేటాయించిన స్థలం కూడా లేఅవుట్ వేసి అమ్ముతుంటారు. ఇది రెండో రకం మోసమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇన్‌స్టంట్ అప్రూవల్ వద్దు..
ఇంటి స్థలాలకు ముందు బయానా తీసుకుంటున్నారని, ఆ తర్వాతే ఇంటి అనుమతికి టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని.. ఇన్‌స్టంట్ అప్రూవల్ తీసుకుంటున్నట్లు ప్రణాళిక విభాగం చెబుతోంది. ఇదే అప్రూవల్‌తో కొనేవారికి ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని, ఆ తర్వాత ఇంటి అనుమతి తిరస్కరణకు గురికావడం, ఫలితంగా కొనుగోలుదారు నష్టపోతున్నట్లు చెబుతున్నారు అధికారులు. దీంతోనే ఇన్‌స్టంట్ అప్రూవల్ ప్రాతిపదికన ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ వేర్వేరు స్థానిక సంస్థలు.. రిజిస్ట్రేషన్ శాఖకు లేఖలు రాశాయి. ఇంటి నిర్మాణానికి తుది ఆమోద పత్రం జారీ అయిన తర్వాత.. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని కోరాయి.ఇన్‌స్టంట్ అప్రూవల్ డాక్యుమెంట్‌పై క్యూఆర్‌ కోడ్ ఉంటుంది. దానిని స్కాన్ చేస్తే.. సంబంధిత ప్లాట్‌లో నిర్మాణం చేపట్టేందుకు తుది ఆమోదం మంజూరు అయిందా లేదా .. నిర్మాణ అనుమతి తిరస్కరణకు గురైంది అన్న విషయం కూడా తెలుస్తుందంట. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News