తెల్ల జుట్టుతో ఇటీవల చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే తెల్ల వెంట్రుకలను నల్లగా చేసే కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తే ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
వాటిల్లో ఒక చిట్కా ఏమిటంటే ఉసిరిపొడి తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును రోజూ తలకు రాసుకుని రెండు గంటలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా నిత్యం చేయడం వల్ల తెల్ల జుట్టు మెల్లగా నల్లగా అవుతుంది. తెల్ల వెంట్రుకలు నల్లగా మారేలా చేసే మరో వంటింటి చిట్కా ఏమిటంటే కొన్ని ఉల్లిగడ్డలను తీసుకుని వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఆ పేస్టును తెల్ల జుట్టు ఉన్న ప్రదేశంలో పూయాలి. రెండు గంటల పాటు దాన్ని అలాగే ఉంచుకుని ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే తెల్లవెంట్రుకలు మెల్లగా నల్లరంగులోకి వస్తాయి.
అలాగే కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని రోజూ తలకు పూసుకుంటే కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాదు తెల్ల జుట్టు రాదు కూడా. ఇంకో సహజసిద్ధమైన చిట్కా ఏమిటంటే నువ్వులను మిక్సీలో వేసి పేస్టు చేయాలి. అందులో బాదం నూనెను వేసి బాగా కలపి ఆ మిశ్రమాన్ని తరచూ తలకు రాసుకుంటుండాలి. ఇలా చేయడం వల్ల కూడా తెల్ల జుట్టు తగ్గుతుంది. ఇవే కాకుండా రోజూ కారట్ జ్యూసును క్రమం తప్పకుండా తాగడం వల్ల కూడా జుట్టు నల్లబడుతుంది. కరివేపాకు పేస్టు లేదా కరివేపాకు వేసి బాగా మరిగించిన నూనెను బాగా చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే తెల్లజుట్టు పోతుంది.
15 ఎంఎల్ నిమ్మరసం, 20 గ్రాముల జామకాయ పొడిని తీసుకుని ఆ రెండింటినీ కలిపి పేస్టులా చేసి తలకు పట్టించాలి. ఇలా కొన్ని రోజులు వరుసగా చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అలాగే తులసి ఆకులను పేస్టులా చేసి తలకు రాసుకుంటే కూడా తెల్ల జుట్టు తగ్గుతుంది. తులసి ఆకులలోని యాంటాక్సిడెంట్లు తెల్లజుట్టును నల్లగా మారేలా తోడ్పడతాయి. ఇంకొక చిట్కా ఏమిటంటే వెల్లుల్లి పొట్టును తీసుకుని ఒక పాత్రలో వేసి అవి నల్లగా అయ్యేదాకా గరిటెతో తిప్పుతూ సన్నని మంటపై వేగించాలి. అవి నల్లగా అయిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత దానిని మిక్సీలో వేసి తగినంత కొబ్బరినూనె వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటలపాటు నాననిస్తే తెల్ల జుట్టుపై మరింత బాగా పనిచేస్తుంది. సమయం లేకపోతే ఈ పేస్టును వెంటనే కూడా తలకు రాసుకోవచ్చు. రాత్రి ఈ పేస్టును తయారుచేసుకుని ఉదయం నిద్ర లేచిన వెంటనే దాన్ని బ్రష్ తో తలకు అప్లై చేసుకోవాలి. తర్వాత గంటసేపు అలాగే తలను ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. తెల్లవెంట్రుకలతో బాధపడుతున్న వారు ఇరవై రోజులకు ఒకమారు ఈ పేస్టును తలకు పట్టించుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అంతేకాదు మీరు తినే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. వీటితో కూడిన పోషకాహారం తినడం వల్ల కూడా నిగ నిగలాడే జుట్టు మీ సొంతమవతుందంటున్నారు పోషకాహారనిపుణులు.
ఒత్తిడి, నిద్రలేమి వల్ల కూడా జుట్టు తొందరగా నెరుస్తుంది. ఆరోగ్యకరమైన నల్లజుట్టు కావాలంటే ఒత్తిడిని బాగా తగ్గించుకోవాలి. వేళకు నిద్రపోవాలి. ధ్యానం, వ్యాయామాలు వంటివి జుట్టు తెల్లబడకుండా అదుపులో ఉంచుతాయి. ఈ మధ్యకాలంలో యువత తలకు నూనె పెట్టుకోవడం లేదు. జుట్టుకు కూడా సరైన పోషణ అవసరం. వారంలో కనీసం రెండు రోజులైనా నూనెతో తలను తప్పనిసరిగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారదు. తెల్లబడదు. రసాయనాలతో కూడిన షాంపులను అతిగా వాడడం వల్ల కూడా జుట్టు తొందరగా తెల్లబడుతుంది. అందుకే వీటిని ఎంత పరిమితంగా వాడితే అంత మంచిదని శిరోజాల నిపుణులు కూడా సూచిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి6, బి12, బయోటిన్, డి, ఈ విటమిన్లు లోపించినా కూడా జుట్టు నెరుస్తుంది. అందుకే జుట్టు నిగ నిగలాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం కూడా అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఈ సింపుల్ చిట్కాలు పాటించి అందమైన నల్లని జుట్టును పొందండి…నిత్యం యంగ్ గా మెరిసిపోండి…