Tuesday, May 21, 2024
Homeఫీచర్స్weight loss-Chena: శనగలతో సన్నగా..

weight loss-Chena: శనగలతో సన్నగా..

ప్లాంట్ ఆధారిత ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల తొందరగా ఆకలి వేయదు. అంతేకాదు ఎక్కువ కాలరీలు తీసుకోకుండా కూడా చెన్నా నియంత్రిస్తాయి

చెన్నాతో బరువు తగ్గుతారు…

- Advertisement -

మన వంటల్లో చెన్నాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా కాబూలీ చెన్నా పోషకాల నిధి. ఆరోగ్యానికి ఇవి తో మంచివి. బరువు తగ్గడంలో కూడా చెన్నా ఎంతో సహకరిస్తాయి. బరువును తగ్గించడంలో చెన్నాకు ఎంతో ప్రాధాన్యం ఉందని పోషకాహారనిపుణులు సైతం అంటారు. అయితే చెన్నాతో చేసే వంటకాల్లో మనం ఎక్కువ నూనె ఉపయోగించి వాటిలోని పోషకాలను చంపేస్తుంటాం. ఇది మంచిది కాదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యానికి మంచిదని అపరిమితంగా వీటిని తిన్నా అనారోగ్యం చేస్తుందని కూడా వీళ్లు హెచ్చరిస్తున్నారు. చెన్నా తినడం వల్ల పొందే లాభాలు ఎన్నో. చెన్నాలో పీచుపదార్థాలు బాగా ఉన్నాయి. ఇవి బరువును తగ్గించడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. చెన్నా కొద్దిగా తింటే కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఆకలి తొందరగా వేయదు. దీంతో బరువు కూడా తొందరగా తగ్గుతాం. పైగా చెన్నా లో ప్లాంట్ ఆధారిత ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల తొందరగా ఆకలి వేయదు. అంతేకాదు ఎక్కువ కాలరీలు తీసుకోకుండా కూడా చెన్నా నియంత్రిస్తాయి. చెన్నాలోని సొల్యూబుల్ ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది. దీంతో పోషకాలు శరీరానికి సరిగా అందుతాయి.
ఇది కూడా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. చెన్నా బ్లడ్ షుగర్ ప్రమాణాలను నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాదు గుండె, కండరాలు, మెదడు ఆరోగ్యానికి కూడా చెన్నా ఎంతో మంచిచేస్తాయి. వీటిల్లో మాంగనీసు, ఫొలేట్ లతోపాటు ఐరన్, జింక్, కాపర్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గడంలో చెన్నా కీలకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గించే చెన్నా రెసిపీలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హమ్మస్ ను తయారుచేయడానికి చెన్నాను బాగా ఉపయోగిస్తారు. చెన్నాను వాసన, రుచుల కోసం వాడతారు. హమ్మాస్ లో చెన్నా, వెల్లుల్లి, నువ్వులు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వాడతారు. బ్రెడ్, ఫింగర్స్, క్రాకర్స్ లేదా ఆరోగ్యకరమైన స్నాక్ తో కలిపి హమ్మాస్ తింటారు. బీట్ రూట్ హమ్మాస్ అలాంటిదే.


చెన్నా చాట్ బరువు తగ్గించే మరో రెసిపీ. చాట్ ఆరోగ్యకరమైన ఆహారం. సరైన పదార్థాలతో ఈ చాట్ చేస్తే దానంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. నూనె, ఉప్పు, షుగర్ వంటివి పరిమితంగా వాడుతూ ఇంట్లో తయారుచేసిన ఈ చాట్ తింటే వంటికి చాలా మంచిది. ఈ చాట్ లో చెన్నా చేరిస్తే శరీరానికి బోలెడు పోషకాలు అందుతాయి. ఆకలి కూడా తొందరగా వేయదు. రకరకాల కూరగాయముక్కలు, మసాలాలు, నిమ్మరసం కలిపి చేసిన చెన్నా చాట్ ను గ్రీన్ చట్నీతో తింటే ఆ రుచే వేరు. నల్ల శెనగలతో కూడా ఈ చాట్ చేయొచ్చు. చెన్నా సూప్ కూడా వంటికి చాలా మంచిది. ఇందుకు కాలా చెన్నా ఉపయోగించాలి. ఇది డయాబెటిస్ నియంత్రణకు ఎంతో మంచిది. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా ఈ సూప్ ఎంతో తోడ్పడుతుంది. ఈ సూప్ లో వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, బీన్స్, కూరగాయముక్కలు వేసి తయారుచేస్తే చాలా బాగుంటుంది. డిన్నర్ టైములో దీన్ని తీసుకుంటే చాలా మంచిది.

చెన్నాతో సలాడ్ కూడా తయారుచేసుకోవచ్చు. ఈ సలాడ్ కూడా బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉడకబెట్టిన చెన్నాలో కారట్, యాపిల్, టొమాటోలు, కొత్తిమీర, పుదీనా వంటివి వేసి లైట్ గా స్పైసీ హనీ-లైమ్ తో డ్రస్సింగ్ చేయాలి. ఇవి కాకుండా చెన్నాతో స్నాక్ కూడా చేసుకుని తినొచ్చు.ఇది కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే నూనెలో శెనగలను వేసి స్నాక్ చేయడం కాదు. చాలా ఆరోగ్యకరరీతిలో చెన్నా ట్రీట్స్ బోలెడు చేసుకోవచ్చు. అలాంటిదే చెన్నా కట్లెట్. దీన్ని పాన్ ఫ్రైడ్ చేయొచ్చు. లేదా బేక్ చేయడం ద్వారా తయారుచేయొచ్చు. కాబూలీ చెన్నాతో చాక్ లెటీ డెజర్ట్ కూడా చేయొచ్చు. ఈ డెజర్టు ఎంతో రుచిగా ఉంటుంది. నాలుగు పదార్థాలు కలిపి చేసే ఈ డెజర్టును చాలా సులువుగా చేయొచ్చు.

రెండు చెన్నా హెల్దీ రెసిపీలు మీకోసం:
బీట్రూట్ హమ్మాస్: ఇది తయారు చేయడానికి కొత్తిమీర, ఉడబెట్టిన రెండు కప్పుల చెన్నా, తొక్కతీసిన ఒక బీట్ రూట్, నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు ఆలివ్ ఆయిల్ (టాపింగ్ కు అదనంగా), ఒక టీస్పూను నువ్వులు, ఒక టేబుల్ స్పూను పెరుగు, ఒక టీస్పూను జీలకర్ర పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రుచికి సరిపడినంత ఉప్పు రెడీ పెట్టుకోవాలి. కొద్దిగా నూనెను బాండిలో వేసి బీట్రూట్ ముక్కలను వేగించాలి. అవి చల్లారిన తర్వాత వాటిని చిన్న ముక్కలుగా తరగాలి. బాండిలో నువ్వుల గింజలు వేసి వాటిని సువాసన వచ్చే వరకూ వేగించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. తర్వాత ఒక బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టిన శెనగలు, వెల్లుల్లిరెబ్బలు, పప్పులు వేసి మెత్తగా పొడి చేయాలి. అవసరమైతే కొద్దిగా నీటిని అందులోకలపొచ్చు. ఆ తర్వాత బీట్రూట్ ముక్కలు, నువ్వుల పొడి, పెరగు, ఆలివ్ నూనె, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు అన్నింటినీ బ్లెండర్లో వేసి మెత్తగా అయ్యే వరకూ గ్రైండ్ చేయాలి. ఆ మొత్తాన్ని ఒక బౌల్ లో వేసి అందులో రెడీ పెట్టుకున్న నిమ్మరసం వేసి బాగా కలపాలి. దానిపై తాజా కొత్తిమీర, ఆలివ్ నూనె వేసి సీజనింగ్ చేయాలి. బీట్రూట్ హమ్మాస్ రెడీ. దీన్ని పీటా బ్రెడ్ తో కలిపి తింటే ఆ మజానే వేరు.


చెన్నా చాట్: ఇది చాలా సింపుల్. చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు. చెన్నా చాట్ తయారీకి 50 గ్రాముల చెన్నా, 50 గ్రాముల నల్ల శెనగలు తీసుకోవాలి. సగం టొమాటో ముక్కను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అరచెక్క బంగాళాదుంపను ఉడకబెట్టి ముక్కలు చేయాలి. 50 గ్రాముల పచ్చి బటాణీ ఉడకబెట్టాలి. సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయను ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. రెండు టేబుల్ స్సూన్ల కారం, ఒక పచ్చిమిరపకాయ, ఒక టీస్పూన్ ఛాట్ మసాలా, వేగించిన రెండు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూను పుదీనా చట్నీ, అరకప్పు దానిమ్మ గింజలు, రెండు టీస్పూన్ల నువ్వులు, ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసం, రెండు టీస్పూన్ల చింతపండు రసం రెడీ పెట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో చెన్నా, నల్లశెనగలు వేయాలి. టొమాటో, ఉల్లిపాయ, ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కలను కూడా ఆ బౌల్ లో వేయాలి. అందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. ఉడకబెట్టిన పచ్చి బటాణీ గింజలు కూడా అందులో కలపాలి. ఆ మొత్తం మిశ్రమంలో రెండుచెంచాల
కారం, ఛాట్ మసాలా వేసి బాగా కలపాలి. అందులోనే వేగించిన వెల్లుల్లి రెబ్బలు, దానిమ్మ గింజలు, నువ్వల గింజలు, నిమ్మరసం, పుదీనా పచ్చడి, చింతపండు రసం కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని మరింత బాగా కలపాలి. చెన్నా చాట్ రెడీ. ఈ రెసిపీ శరీరానికి ఎంతో మంచిది. ఎంతో బలాన్ని ఇస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News