అభివృద్దిలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చేశామని, ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే అవసరమైన చర్యలు చేపడతామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం మంత్రి శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహించి ముఖ్యమంత్రి, మంత్రిగా పని చేసిన వారు కూడా చేయని అభివృద్దిని 9 సంవత్సరాలలో ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ సహకారంతో చేసినట్లు వివరించారు. గతంలో నియోజకవర్గ పరిధిలో రోడ్లపై మురుగునీరు ప్రవహించి, రోడ్లు మొత్తం అద్వాన్నంగా ఉండేవని గుర్తుచేశారు.తెలంగాణ వచ్చిన తర్వాత లీకేజీ సమస్యలు అత్యధిక శాతం నివారించామన్నారు, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను కూడా ఎంతో అభివృద్ధి చేసినట్లు వివరించారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అద్యక్షులు, ముఖ్య నాయకులు తమ ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే మున్సిపల్ వార్డు ఆఫీసులను ప్రారంభిస్తామన్నారు. జిహెచ్ఎంసి పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా వార్డు ఆఫీసులోనే పిర్యాదు చేయవచ్చని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక దేవాలయాలకు నూతనంగా కమిటీలను నియమించామని, మిగిలిన దేవాలయాలకు కూడా కమిటీలను నియమిస్తామన్నారు.
ఈకార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, హేమలత,మహేశ్వరి, పిఎల్ శ్రీనివాస్,మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి,అత్తిలి అరుణ గౌడ్,ఆకుల రూప,ఉప్పల తరుణి, డివిజన్ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి,అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు,శ్రీనివాస్ గౌడ్,వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.