వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్ష భగ్నమైంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో.. హైదరాబాద్ పోలీసులు గత అర్థరాత్రి దీక్షను భగ్నం చేసి.. బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలో తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్టీపీ కార్యాలయంలో షర్మిల రెండు రోజుల నుంచి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. పాదయాత్రకు ప్రభుత్వం అనుమతిచ్చే వరకు దీక్ష విరమించబోనని చెప్పారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతినిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు.
రెండ్రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణిస్తోందని, మంచినీరు కూడా తాగకపోవడం వల్ల కిడ్నీలకు ప్రమాదం ఏర్పడవచ్చని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత లోటస్‌పాండ్ చేరుకున్న పోలీసులు బలవంతంగా షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని జూబ్లీహిల్స్, అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సెలైన్ల ద్వారా షర్మిలకు చికిత్స అందిస్తున్నారు.