Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Indo-Egypt relations: ఈజిప్టుతో భారత్‌ సరికొత్త బంధం

Indo-Egypt relations: ఈజిప్టుతో భారత్‌ సరికొత్త బంధం

భారత, ఈజిప్టు దేశాల వైఖరులు దాదాపు ఒకే పంథాలో ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో భారత్‌, ఈజిప్టు మైత్రీ బంధం ఒక చరిత్రాత్మక మలుపు తిరిగింది. ఇటీవలి వరకు స్నేహ సంబంధాలకే పరిమితమైన ఈ రెండు దేశాల బంధం ప్రస్తుతం వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకుంది. ఈ మేరకు నరేంద్ర మోదీ ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌ సిసితో కుదర్చుకున్న ఒప్పందం పశ్చిమాసియా-ఉత్తర ఆఫ్రికా (డబ్ల్యుఏఎన్‌ఏ) సంబంధాలలో చరిత్ర సృష్టించింది. ఈజిప్టుతో భారతదేశానికి మొట్టమొదటిసారిగా 1955లో మైత్రీ ఒప్పందం కుదిరింది. 1956లో సూయెజ్‌ కెనాల్‌ సంక్షోభ సమయంలో కూడా ఈజిప్టుకు భారత్‌ మద్దతుగా నిలిచి, అండదండలను అందించింది. చివరికి ఇదే 1961లో అలీన ఉద్యమానికి దారితీసింది. ఈ అలీన దేశాల కూటమికి భారత, ఈజిప్టు దేశాలు వ్యవస్థాపక సభ్య దేశాలు. అంతేకాదు, జి-77 దేశాల కూటమి ఏర్పడడంలో కూడా ఈ రెండు దేశాలు కీలక పాత్ర పోషించాయి. వర్ధమాన దేశాల మధ్య సహకారం కూడా ఈ రెండు దేశాల కారణంగానే సాధ్యమైంది. ప్రచ్ఛన్న యుద్ద సమయంలో కూడా ఈ రెండు దేశాలు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల వైపు మొగ్గు చూపకుండా సొంత పంథాను అనుసరించాయి.
అంతేకాక, ఇటీవలి ఉక్రెయిన్‌ యుద్ధ సందర్భంగా కూడా భారత, ఈజిప్టు దేశాల వైఖరులు దాదాపు ఒకే పంథాలో ముందుకు వెళ్లాయి. ఈ విషయంలో అవి రష్యాను విమర్శించడానికి ఒప్పుకోలేదు. ఈ యుద్ధాన్ని ఖండించడం కూడా జరగలేదు. రష్యా, ఉక్రెయిన్‌లు దౌత్యపరమైన చర్చల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకోవాలని ప్రకటించడం కూడా జరిగింది. రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధం కారణంగా గత ఏడాది ఈజిప్టుకు రష్యా నుంచి సరఫరాలు ఆగిపోయినప్పుడు, భారత్‌ భారీయెత్తున ఈజిప్టుకు గోదుమలు సరఫరా చేసింది. హరిత ఇంధనం, ఔషధాలు, రక్షణ వంటి రంగాలలో సన్నిహిత సహకారాన్ని పెంపొందించుకోవడానికి, వ్యవసాయం, పురాతత్వ విజ్ఞానం వంటి రంగాలలో ఒప్పందాలు కుదర్చుకోవడానికి ఈ రెండు దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మోదీ అక్కడ అల్‌-హకీం మసీదును, గ్రాండ్‌ ముఫ్తీని సందర్శించడం స్వదేశంలోని ముస్లింల పట్ల తమ ప్రభుత్వ విధానాలపై ఉన్న అపోహలను తొలగించడానికేనన్నది సుస్పష్టం.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్‌ సిసి భారత ప్రధానికి ఈజిప్టులోని అత్యున్నత గౌరవ పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ను అందజేశారు. ఈ పురస్కారాన్ని ప్రపంచ స్థాయి నాయకులకు, ఈజిప్టుకు సహాయ సహకారాలు అందజేసిన వారికి బహూకరించడం జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశానికి ముఖ్య అతిథిగా వస్తున్న అల్‌ సిసితో మోదీ మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. కైరోలో ఈ రెండు దేశాల అధినేతలు అనేక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఆహార భద్రత, వర్ధమాన దేశాలతో సన్నిహిత సంబంధాలు, ఆఫ్రికన్‌ యూనియన్‌తో సంబంధాల మెరుగుదల వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈజిప్టుకు పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ దేశాలతో సంబంధాల గురించి కూడా వీరు చర్చించడం జరిగింది. ‘బ్రిక్స్‌’ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి) దేశాలు గత మార్చిలో ఏర్పాటు చేసిన ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌’లో ఈజిప్టు కూడా చేరింది. ఈ కూటమిలో ఈజిప్టు చేరే విషయాన్ని ఆగస్టులో కేప్‌ టౌన్‌లో జరిగే సమావేశంలో పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ ఈజిప్టుకు భారత్‌ మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ చరిత్రాత్మక ఒప్పందాలతో ఉత్సాహం తెచ్చుకున్న భారత్‌, ఈజిప్టు దేశాలు భవిష్యత్‌ ఆర్థిక అవసరాలు, స్వతంత్ర విదేశీ విధానాలను దృష్టిలో పెట్టుకుని మరింతగా సంబంధాలను దృఢం చేసుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News