శ్రీశైలంలో ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి శాకాంబరీ ఉత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. శాకాంబరీ ఉత్సవంలో భాగంగా శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు. అలాగే దేవాలయ ప్రాంగణాన్ని సుమారు 2,500 కేజీల పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ ఫలాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. ఆలయంలోని రాజరాజేశ్వరిదేవికి, ఆలయం ఎదురుగా ఉన్న గ్రామదేవత అంకాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి శాకాలంకరణ చేశారు.
అమ్మవారిని శాకలతో అర్చించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని పురాణాల్లో పేర్కొన్నారని అర్చకులు స్వాములు తెలిపారు. ప్రతి ఆషాడ మాసం పౌర్ణమిలో లోక కళ్యాణార్ధం భ్రమరాంబికా దేవి అమ్మవారికి ఈ శాకాంబరీ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శాకాంబరీ అలంకారంలో ఉన్న భ్రమరాంబికా దేవిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.