రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా డి. పురంధేశ్వరిని నియమించడం ఆశ్చర్యం కలిగించిన మాట నిజం. అయితే, ఈ పదవి కోసం పోటీపడ్డ నాయకులతో సహా ఎవరి నుంచీ ఈ నియామకం మీద అసంతృప్తి వ్యక్తం కాకపోవడం మాత్రం విశేషమే. పాలక వై.ఎస్.ఆర్.సి.పిని విమర్శించడంలో మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కంటే పురంధేశ్వరే చాలా నయమని పలువురు రాష్ట్ర నాయకులు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. ’’మేం ఇతర పార్టీలలాంటి వాళ్లం కాదు. మా పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది. మేం వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అసంతృప్తికి ఇక్కడ అవకాశం లేదు‘‘ అని సీనియర్ నాయకులు సైతం
వ్యాఖ్యానిస్తున్నారు.
సోము వీర్రాజు పదవీ కాలం ముగిసినందు వల్ల , నాయకత్వంలో మార్పు రాబోతోందనే విషయం పార్టీ శ్రేణులందరికీ తెలుసు. అధ్యక్ష పదవి విషయంలో పి.ఎన్.వి. మాధవ్, సూర్యకుమార్ వంటి నాయకుల పేర్లు వినవచ్చాయి కానీ, జాతీయ నాయకత్వం చివరికి పురంధేశ్వరి వైపే మొగ్గు చూపింది. అధ్యక్ష పదవికి మాధవ్ ఎంపిక అయితే బాగుంటుందని కొందరు భావించకపోలేదు. ప్రముఖ రాజకీయ నాయకుడు చలపతిరావు కుమారుడైన మాధవ్ యువకుడు, విద్యావంతుడు, వక్త, చురుకైన నాయకుడైనందు వల్ల ఆయనను అధ్యక్ష పదవికి ఎంపిక చేసి ఉండాల్సిందనే వాదన వినిపించింది.
మరి కొందరు నాయకుల ఉద్దేశంలో పురంధేశ్వరి నియామకం అన్ని విధాలా సమంజసమైన నిర్ణయం. ఇప్పుడు ఇతర ప్రతిపక్షాల కంటే బీజేపీయే వైఎస్ఆర్సీపీని ఎక్కువగా విమర్శించ గల స్థితిలో ఉందని, ఆమె అపార రాజకీయానుభవం ఇందుకు ఎంతగానో దోహదం చేస్తుందని వారు భావిస్తున్నారు. అంతేకాదు, మాధవ్ సైతం ఆమె ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని విస్తరించడానికి ఆమెకు ఉన్న అవకాశాలు మరెవరికీ లేవని ఆయనతో పాటు ఇతర నాయకులు కూడా భావిస్తున్నారు. పురంధేశ్వరి ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీ ఇన్ ఛార్జిగా పనిచేశారని, ఆమె నాయకత్వంలో పార్టీ ముందు దూసుకుపోవడం ఖాయమని మాధవ్ వ్యాఖ్యానించారు. ఆమె కేంద్ర మంత్రిగా కూడా పని చేసినందువల్ల ఆమె ఇక్కడి పార్టీ వ్యవహారాల నిర్వహణలో తప్పకుండా తన ముద్ర వేయడం జరుగుతుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఆమె తనకున్న రాజకీయానుభవంతో ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకువచ్చే అవకాశం ఉందని, పార్టీ బలోపేతం కావడానికి అనేక అవకాశాలను అన్వేషిస్తారని నాయకులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవలసి వచ్చినప్పటికీ, ఆ పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు లేకపోవడమనేది అడ్డంకి కాబోదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ‘‘జాతీయ స్థాయిలో మాత్రమే పొత్తుల గురించి ఆలోచించడం, నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఇందులో రాష్ట్ర నాయకత్వం పాత్రేమీ ఉండదు’’ అని సీనియర్ నాయకుడొకరు స్పష్టం చేశారు.
సోము వీర్రాజు హయాంలో కూడా జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తో సంబంధాలు సరిగ్గా లేవు. అనేక సందర్బాలలో పవన్ కల్యాణ్ దీనిపై విమర్శలు, ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. ఈ సంగతి నిజమే అయినప్పటికీ జనసేన పార్టీని బీజేపీ తన మిత్రపక్షంగానే భావిస్తున్నందువల్ల ఈ రెండు పార్టీలు ఒకే తాటి మీద నడవడం జరుగుతుందని ఆ సీనియర్ నాయకుడు తేల్చి చెప్పారు.