Telangana Congress: కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై నిన్న పోలీసులు రైడ్ చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సోదాలు చేసిన సైబరాబాద్ పోలీసులు.. కార్యాలయంలో కంప్యూటర్లు, లాప్ టాప్‌లను సీజ్ చేశారు. సీఎం కేసిఆర్ కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారనే ఆరోపణలతో పోలీసులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ముందుగా కార్యాలయంలోని సిబ్బంది సెల్ ఫోన్ లు ఆఫ్ చేయించిన పోలీసులు సోదాలు చేసినట్లు తెలుస్తుంది.
ఎస్కే టీం గత కొంత కాలంగా కాంగ్రెస్ కోసం పనిచేస్తోంది. తమని అణిచివేసేందుకు ప్రభుత్వం తమ పార్టీ వ్యూహకర్త ఆఫీసుపై దాడులు నిర్వహించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మంగళవారం సోదాల సమయంలోనే పోలీసులు – కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసుల చర్యలను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కాం గ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి.. ఎలాంటి ఎఫ్ఆర్ఐ లేకుండా ఎలా కార్యాలయాన్ని తనిఖీ చేస్తారని కాంగ్రెస్ నేతలు నిలదీశారు.
దీంతో.. కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సునీల్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్యాలయంపై పోలీసుల దాడి, సీజ్ చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ఫేస్‌బుక్‌తో పాటు పలు సోషల్ మీడియాలో మీమ్స్ తయారుచేసి పెడుతున్నారని గుర్తించారు పోలీసులు. అయితే, ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించిన టీపీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నేడు నిరసనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి, మండలాల్లో నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.