అర్హులైన నిరుపేదలందరికీ 75 గజాల ఇళ్ల స్థలం అందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, అతి త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండలం కాజిపల్లి గ్రామ పరిధిలో నిరుపేదలకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ఎంపిక చేసిన స్థలాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఇప్పటివరకు ఇళ్లస్థలం లేని నిరుపేదలకు 75 గజాల స్థలం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాటు, ఖాళీ స్థలాల సేకరణ చేపట్టామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అతి త్వరలో ఇళ్ల స్థలాలు అందించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.