ఈ మసాలాలు జుట్టుకెంతో మేలు…
మాన్సూన్ సీజన్ వచ్చిందంటే శరీరారోగ్యం, చర్మ సంరక్షణ గురించే కాదు శిరోజాల రక్షణ గురించి కూడా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మాన్సూన్ సీజన్ లో చాలామంది రకరకాల శిరోజాల సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సీజన్ లో చాలామందికి జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది. వెంట్రుకలు కాంతివిహీనంగా కనిపిస్తాయి. జుట్టు బలహీనంగా ఉంటుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు నిత్యం మీరు తీసుకునే డైట్ లో కొన్ని రకాల మసలా దినుసులు తప్పనిసరిగా వాడాలంటున్నారు పోషకాహార నిపుణులు.
ఈ సీజన్ లో గాలిలో తేమ, మాయిశ్చరైజర్ బాగా ఉంటాయి. ఇవి శిరోజాల టెక్స్చెర్ ను దెబ్బతీస్తాయి. అందుకే ఈ టైములో శిరోజాల సంరక్షణకు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీరు తీసుకునే ఆహారం కూడా ఎంతో ప్రధానమైందని శిరోజాల నిపుణులు సైతం చెపుతున్నారు. తలకు నాణ్యమైన షాంపులను, ఆయిల్స్ ను, ట్రీట్మెంట్లను, తగిన హెయిర్ కేర్ ను పాటించడంతో పాటు మీరు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారన్నది కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు. మీరు తీసుకునే డైట్ ద్వారా వెంట్రుకల కణజాలానికి పోషక పదార్థాలు అందేలా చూసుకోవాలి. అప్పుడు శిరోజాలు ద్రుఢంగా తయారవుతాయి. ఈ విషయంలో మన నిత్యం వాడే రకరకాల మసాలా దినుసులు సైతం ఎంతో ఉపయోగపడతాయి.
మాన్సూన్ సీజన్ లో తేమ ఎక్కువగా ఉండటంతో జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. మాడులో ఉండే సహజ నూనె గుణాలను ఇవి హరిస్తాయి. దీంతో జుట్టు చిట్లడం, బలహీనంగా అవడం జరుగుతుంది. దాంతో జుట్టు బాగా ఊడడం మొదలవుతుంది. ఈ సీజన్ లో జుట్టును బలంగా ఉంచడంలో మనం వాడే నల్ల మిరియాలు ఎంతో బాగా సహకరిస్తాయి. నల్లమిరియాల్లో విటమిన్ ఎ, సి, కెరటనాయిడ్స్, ఫ్లెవనాయిడ్స్, మరెన్నో ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి రక్త కణాల్లోని వాపును తగ్గించి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. కణజాలాన్ని ద్రుఢంగా చేస్తాయి. జుట్టు పెరిగేలా తోడ్పడతాయి. ఇది శరీరానికి అందాలంటే మీరు తినే ఆహార పదార్థాల్లో మిరియాలను వాడాలి. లేదా కొన్ని మిరియాలను ఒక గ్లాసుడు నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగినా మంచిదే. ఇది మంచి డిటాక్స్ డ్రింకులా పనిచేస్తుంది.
ఇంకొకటి నువ్వులు. ఇవి కూడా వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమ్రుద్ధిగా ఉన్నాయి. ఇవి మాడులోని సహజ నూనె గుణాలను సంరక్షించడంతో పాటు మీ జుట్టును నిగ నిగలాడేట్టు చేస్తాయి. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల శరీరమంతా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శిరోజాల కణజాలానికి కూడా రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, బాగా పొడుగ్గా పెరుగుతుంది. అయితే జుట్టుకు మంచిది కదా అని విపరీతంగా నువ్వులను వాడొద్దు. మోడరేట్ గా మాత్రమే వీటిని ఉపయోగించాలి. లేకపోతే సమతుల్యత దెబ్బతింటుంది. పెరుగులో కొన్ని నువ్వులు వేసుకుని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరగకుండా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు, నువ్వులతో చేసిన స్మూదీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. వెంట్రుకల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మంచిది.
ఇక మనందరికీ తెలుసు జీలకర్ర బరువును తగ్గిస్తుందని. జీర్ణక్రియ బాగా అయ్యేలా చేస్తుందని. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సైతం జీలకర్ర ఎంతో సహకరిస్తుంది. అలాగే వెంట్రుకల ఆరోగ్యానికి కూడా జీలకర్ర బాగా పనిచేస్తుంది. వీటిల్లో ప్రొటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నాయి. ఇవి జుట్టును పెరిగేలా చేయడమే కాదు శిరోజాలకు సంబంధించిన కణజాలాన్ని బాగా బలోపేతం చేస్తాయి. మాడులో ఉన్న సహజ నూనె గుణాలను సైతం జీలకర్ర కాపాడుతుంది. తేమ వల్ల వెంట్రుకలు పీచుగా అవడం చూస్తాం. దీన్ని సైతం జీలకర్ర నిరోధిస్తుంది. ఈ గింజలను మీరు తినే పదార్థాల్లో వాడొచ్చు. లేదా దీంతో డిటాక్స్ డ్రింకు చేసుకుని తాగొచ్చు.
కలోంజి గింజలు (నల్ల జీలకర్ర) కూడా శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని థైమోక్వినోన్ అనే కాంపౌండ్ జుట్టు కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. జుట్టు రాలిపోకుండా అడ్డుకుంటుంది. మాడుపై వెంట్రుకలు ద్రుఢంగా ఉండేలా చేస్తుంది. వీటిని మీరు తినే ఆహార పదార్థాల్లో వేసుకోవడం ద్వారా మీ శిరోజాల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఇవి కాకుండా దాల్చినచెక్క కూడా జుట్టుకు ఎంతో మంచిది. ఇందులో యాంటాక్సిడెంట్లు విటమిన్లు ఎ, సి, ఇ, కెలు బాగా ఉన్నాయి. ఇవి జుట్టు కణజాలాన్ని పటిష్టం చేస్తాయి. శిరోజాలు వేగంగా పెరిగేలా తోడ్పడతాయి. మీరు చేయాల్సిందల్లా నీటిలో కొద్దిగా దాల్చినచెక్క వేసి ఉడికించి టీలా తయారుచేసుకుని తాగితే శరీరానికే కాదు శిరోజాల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఈ మసాలా దినుసులను వాడేముందు వైద్యుల సలహాను కూడా తీసుకోవడం అస్సలు మరవొద్దు. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి వైద్యుని సలహాలతో ఈ విషయంలో ముందుకు వెళ్లాలి…