ఆరోగ్యమైన శిరోజాల కోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని పాటిస్తే మీ జుట్టు నల్లగా నిగ నిగలాడుతూ ఉంటుంది. అవేమిటంటే..
సూర్యరశ్మి బారిన వెంట్రుకలు పడకుండా సంరక్షించుకోవాలి. అలాగే గాలి, వర్షం వంటి వాటి బారిన కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. బాగా వేడి, కాలుష్యం, మురికి బారిన పడకుండా శిరోజాలను సంరక్షించుకోవాలి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో శిరోజాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా మాడు పొడిబారడం, తలలో మురికి చేరడం, అలాగే మాడుపై ఇన్ఫెక్షన్లు తలెత్తడం వంటివి ఎదురవుతాయి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు, లేదా హ్యట్
వంటి వాటిని దగ్గర పెట్టుకోవాలి.
తడి జుట్టుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే తడి జుట్టు బలహీనంగా ఉంటుంది. తొందరగా చిట్లుతుంది. పాయలు, వెంట్రుకలు తొందరగా దెబ్బతింటాయి. తలకు షాంపు పెట్టుకునేటప్పుడు శిరోజాలను సున్నితంగా రుద్దుకోవాలి. తలస్నానం చేసిన వెంటనే జుట్టును ఆరనీకుండా బ్రషింగ్ చేసుకోవద్దు.
తలస్నానం తర్వాత మాయిశ్చరైజింగ్ కండిషనర్ వెంట్రుకలకు వాడాలి. దీన్ని మిస్ చేస్తే జుట్టు పీచులా కనిపిస్తుంది.
వెంట్రుకలకు సరైన పద్దతిలో కండిషనింగ్ పెట్టుకోవాలి. మాడుకు రెండు అంగుళాల పై నుంచి కండిషనింగ్ చేసుకోవాలి. ఎక్కువ కండిషనర్ పెట్టుకుంటే మాడు బాగా జిడ్డుగా తయారవుతుంది.
ఒకే ప్రాడక్టులో షాంపు, కండిషనర్ రెండూ ఉండేలా చూసుకోవాలి. షాంపు ఒక ప్రాడక్టు, కండిషనర్ ఇంకొక ప్రొడక్టుగా విడి విడిగా ఉపయోగించడం వెంట్రుకలకు మంచిది కాదు.
వెంట్రుకలపై హీట్ ను ఎక్కువ అప్లై చేయొద్దు. వేడి వల్ల వెంట్రుకల్లోని మాయిశ్చరైజర్ పోతుంది. జుట్టు పొడిబారి పీచులా కనిపిస్తుంది. వేడి ఎక్కువ అప్లై చేస్తే వెంట్రుకలను కాలినట్టు చేస్తుంది. మరీ అవసరమైతే తప్ప హెయిర్ స్ట్రైట్నర్స్ ను వాడకూడదు. వేడి నుంచి రక్షణకు హెయిర్ హీట్ ప్రొటెక్షన్ సిరమ్ వాడితే మంచిది.
జుట్టును బిగుతుగా అల్లుకోవద్దు. ఇలా చేస్తే జుట్టు చిట్లే అవకాశం ఉంది. అలాగే నిద్రపోయేటప్పుడు కూడా జుట్టును గట్టిగా ముడి వేయొద్దు. పడుకునేటప్పుడు శాటిన్ దిండు కవర్లు వాడితే మంచిది. ఇవి జుట్టు బ్రేక్ అవకుండా సంరక్షిస్తాయి.
జుట్టును ఆరబెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. తువ్వాలుతో జుట్టును గట్టిగా రుద్దినట్టు తుడవద్దు. ఇలా చేస్తే జుట్టు తొందరగా పొడిబారుతుంది. వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతాయి.
మాడుకు తరచూ నూనె పెట్టాలి. ఆ ఆయిల్ పోవడానికి జంటిల్ షాంపుతో తలరుద్దుకోవాలి. మాడుకు ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మాడుకు ఆయిల్ ఎక్కువ పెడితే దాన్ని పోగొట్టుకోవడానికి షాంపు కూడా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో మాడులో ఉండే సహజమైన
నూనెగుణాలు పోతాయి.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆయిల్ మసాజ్ చేసుకుంటే మంచిది. ఇందుకు ఆలివ్ నూనె, కొబ్బరినూనె లేదా బాదం నూనె చాలా మంచివి. మీరు వాడే నూనెను కాస్త గోరువెచ్చగా చేసి దానితో మాడును మసాజ్ చేసుకొని గంటపాటు జుట్టును అలాగే వదిలేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. మంచి ఫలితాలు కావలనుకుంటే జుట్టు కండిషనింగ్ కోసం వెంట్రుకలను రాత్రంతా అలాగే వదిలేయొచ్చు కూడా.
మీ వెంట్రుకల స్వభావాన్ని బట్టి హెయిర్ మాస్కులు వాడితే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మీకు సరిపడే హెయిర్ మాస్కును మాత్రమే జుట్టుకు అప్లై చేసుకోవాలని మరవొద్దు.
జుట్టుకు చన్నీళ్ల స్నానం అంటే రూమ్ టెంపరేచర్ ఉండే నీళ్లతో స్నానం చేస్తే మంచిది. లేదా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయొచ్చు. అంతేతప్ప మరీ వేడిగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయొద్దు. నీళ్లు బాగా వేడిగా ఉంటే అది జుట్టు టెక్స్చెర్ ని దెబ్బతీస్తుంది. తలకు షాంపు పెట్టుకున్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు ఉపయోగించాలి. వెంట్రుకలకు కండిషనింగ్ అప్లై చేసుకున్న తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి.
నెలకొకసారి క్లారిఫైయింగ్ షాంపు వాడితే మంచిది. ఇది వెంట్రుకల్లో చేరిన ప్రాడక్టుల పదార్థాలను పోగొడతాయి. లేకపోతే మీరు వాడే షాంపు లేదా కండిషనర్ శిరోజాలపై శక్తివంతంగా పనిచేయవు.
జుట్టును బ్రషింగ్ చేసుకోవడం వల్ల సహజమైన నూనె గుణాలు వెంట్రుకలంతటికీ చేరే అవకాశం ఉంది. అలా అని బ్రషింగ్ అతిగా చేస్తే అసలుకే మోసం వస్తుంది. జుట్టు చిట్లుతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన ఆహారాన్ని కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పోషకాలు, హెయిర్ విటమిన్స్, ఐరన్, ప్రొటీన్లు జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యం. అవి డైట్ ద్వారా శరీరానికి అందకపోతే వైద్యుని సంప్రదించి తగిన హెయిర్ సప్లిమెంట్లను వాడాల్సి ఉంటుంది. హెల్తీ డైట్ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే పండ్లు, కూరగాయలు, ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి జుట్టును సహజసిద్ధమైన కండిషనింగ్ తో ఉండేలా చేస్తాయి. జుట్టులో పోషకాలు ఉండేలా చూస్తాయి.
వెంట్రుకలు అందంగా కనిపించాలని కొందరు రకరకాల హెయిర్ ఉత్పత్తులు వాడుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. షాంపు, కండిషనర్, సిరమ్ వంటివి జుట్టుకు తప్పనిసరిగా వాడాలి. అయితే బాటిల్డ్ హెయిర్ ప్రాడక్టులకు దూరంగా ఉంటే మంచిది. అలాగే కెమికల్ షాంపులను, కండిషనర్లను
వాడకూడదు. ఇవి జుట్టును కాంతివిహీనం చేస్తాయి. వెంట్రుకలను పొడిబారేట్టు చేస్తాయి. అందుకే నేచురల్ ఉత్పత్తులతో హెయిర్ కేర్ పాటిస్తే మంచిది.
వెంట్రుకలు దువ్వుకోవడానికి ఉపయోగించే దువ్వెన్నలు, బ్రష్ ల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. నాణ్యమైన బ్రష్ లు, దువ్వెన్నలు వాడడం వల్ల మాడుకు తగిన సాంత్వన లభిస్తుంది. ఉంగరాల జుట్టు ఉన్నవాళ్లు నైలాన్ పళ్లు ఉన్న బ్రష్ వాడితే మంచిది. మీరు వాడే దువ్వెన్నలు, బ్రష్ లు
ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీరు వాడే బ్రష్ లు, దువ్వెన్నలు ఇతరులకు అస్సలు ఇవ్వొద్దు. అలా చేస్తే చుండ్రు, చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు మీకు సోకే అవకాశం ఉంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి జుట్టు పాయలను, కుదుళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
అరటిపండ్లు జుట్టును ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. జుట్టు ఎలాస్టిసిటీని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే గుడ్లు కూడా వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టును సిల్కీగా కనిపించేలా చేస్తాయి. గుడ్డు సోనను నేరుగా తలకు అప్లై చేసుకోవచ్చు. గుడ్డుతో చేసే హెయిర్ మాస్కులు కూడా ఉన్నాయి. వెంట్రుకల కండిషనింగ్ కు తేనె ఎంతో తోడ్పడతుంది. జుట్టు రాలిపోకుండా సంరక్షిస్తుంది. వెంట్రుకలు కూడా దెబ్బతినవు. మెంతుల్లో యాంటి ఫంగల్ సుగుణాలు
ఉన్నాయి. అంతేకాదు జుట్టును మ్రుదువుగా ఉంచే సుగుణాలు కూడా వీటిల్లో ఉన్నాయి. ఉసిరి జుట్టును ఆరోగ్యంగా, ద్రుఢంగా ఉంచుతుంది. యాపిల్ సిడార్ వెనిగర్ వెంట్రుకలను మెరిసేలా చేస్తుంది. స్ట్రాబెర్రీలు నేచురల్ హెయిర్ కండిషనర్స్. సో..ఇలాంటి నేచురల్ రెమిడీలను జుట్టుకు వాడితే శిరోజాలు చూడడానికి ఎంతో ఆరోగ్యంగా, మరింత అందంగా ఉంటాయి.