Sunday, November 24, 2024
Homeఓపన్ పేజ్Third Front: నితీష్ 'మహా అస్త్రం' మామూలుగా లేదు

Third Front: నితీష్ ‘మహా అస్త్రం’ మామూలుగా లేదు

నితీష్ కుమార్ రాజకీయాల్లో తలపండిన మేధావి. సైలెంట్ గా తన పని తాను తన స్టైల్లో చేసుకుని పోవటంలో నితీష్ తరువాతే ఎవరైనా. లేకపోతే గత 15 ఏళ్లుగా ఏమాత్రం మెజార్టీ లేని జేడీయూని ఆయన అధికారంలో కొనసాగిస్తున్నారంటే మాటలా. అయితే బీజేపీతో లేదంటే జేడీయూతో జత కట్టడం ముఖ్యమంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న జేడీయూ అధినేత వివాదాలకు వీలైనంత దూరంగానే ఉంటారు. కానీ ప్రజాజీవితంలో కొన్నిసార్లు తప్పదు కదా అలా అప్పుడప్పుడూ ఆయన మాటలు సంచలనం సృష్టిస్తుంటాయి. ఎన్నికల వ్యూహకర్త, బిహార్ కు చెందిన ప్రశాంత్ కిశోర్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించి, కేబినెట్ హోదా కూడా ఇచ్చినా ఆయన నితీష్ ను కాదని అన్ని పదవులు వదులుకుని సొంతంగా పార్టీ ప్రకటించి, పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. పీకే నోరుతెరిస్తే నితీష్ పై అన్నీవివాదాస్పద వ్యాఖ్యలు చేసేస్తూ ఉంటారు. కానీ పీకే వ్యాఖ్యలపై నితీష్ అస్సలు స్పందించరు.

- Advertisement -

అయితే ఉన్నట్టుండి ఆయన లాలూ కుమారుడు, తన క్యాబినెట్ లో డిప్యుటీ సీఎంగా ఉన్న తేజస్వికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేస్తూపోతున్నారు. ఆఖరుకి వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి నేతృత్వంలోనే ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నట్టు నితీష్ చేసిన ప్రకటన బిహారీలకు పెద్ద షాక్ ఇచ్చింది. 2025లో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఇంత త్వరగా నితీష్ చాలా స్పష్టమైన ప్రకటన చేసి తన మనసులోని మాటను చెప్పకనే చెప్పారు. ‘థర్డ్ ఫ్రంట్’ నితీష్ భాషలో చెప్పాలంటే ‘మెయిన్ ఫ్రంట్’ ను ఏర్పాటు చేసి ప్రధాని కావాలన్నదే నితీష్ కలగా ఉంది. కేంద్ర మంత్రిగా పలు దఫాలుగా పనిచేసిన నితీష్ కు ఇది తీరని కోరికగా ఉండిపోయింది. అందుకే 2024 సాధారణ ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేసి తాను ప్రధానమంత్రి కావాలని నితీష్ చాలా భారీ ప్రణాళికను సిద్ధం చేసి దాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది.

బిహార్ లోని సంకీర్ణ కూటమిని తేజస్వి నడిపిస్తారని నితీష్ వివరిస్తున్నారు. ఏడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలోని అన్ని పార్టీలకు, ముఖ్యంగా తన సొంత పార్టీ జేడీయూలోనూ ఈమేరకు పలు వేదికలపై ఇప్పటికే తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై అధికారికంగా నితీష్ స్పష్టత ఇచ్చేలా ప్రకటన చేసేశారు. నితీష్ మాటలు ఈమధ్య చాలా సీరియస్ గా ఉంటున్నాయి. ఆయన చేతలే కాదు మాటలు కూడా శృతి తప్పుతున్నట్టు కనిపిస్తున్నాయి. సాధారణంగా పెద్దగా అరవడం, ఆగ్రహాన్ని ప్రదర్శించటం వంటివాటికి నితీష్ దూరంగా ఉంటారు. అలాంటిది ఈమధ్య పదేపదే ఆయన ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ పరుష పదాలను ప్రయోగించటం వంటివి చేస్తున్నారు. “తాగొచ్చారా” అంటూ బిహార్ ప్రతిపక్షం బీజేపీ నేతలపై మండిపడ్డ నితీష్ ఆ మరుసటి రోజే.. “మద్యం తాగితే ఛస్తారు, అయినా రాష్ట్రంలో 2016 నుంచి మద్యనిషేధం అమల్లో ఉంది కల్తీ మద్యం తాగి, ఛస్తే ప్రభుత్వం నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రశ్నే లేద”ని తెగేసి చెప్పడం వంటి వ్యాఖ్యలు చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలా నిప్పులు చెరిగేలా మాట్లాడని నితీష్ కు ఏమైందని సొంత పార్టీ జేడీయూ నేతలతోపాటు ప్రతిపక్షాలు, అధికారులు, రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసహనంతో ఈమధ్య నితీష్ ఊగిపోతున్నారు, పైగా “వయసు మీద పడుతోంది కదా అందుకే ఈ తిప్పలు” అంటూ ఈయనపై ఈసడింపులు మొదలయ్యాయి.

ఎలాగైనా ప్రధాని పదవిలో కూర్చున్నాకే రాజకీయాల నుంచి రిటైర్ కావాలని డిసైడ్ అయినట్టున్నారు నితీష్. అందుకే 2024లో బీజేపీని గద్దె దించాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆశిస్తున్నాయని, కానీ విపక్షాల మధ్య ఐక్యత లోపించిందని, అందరూ కలసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా థర్డ్ ఫ్రంట్ కాదు ఏకంగా మెయిన్ ఫ్రంట్ ఏర్పడుతుందని మహా అస్త్రాన్ని వెలికి తీశారు. ఈమేరకు తనకు ప్రధాని పదవిపై ఆశలేకున్నా అన్ని పార్టీలను కలుపుకుని పోతూ, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్టు కానీ దీనికి సరైన స్పందన రావటం లేదని నిరాశ వ్యక్తం చేశారు నితీష్. మహాఘటబందన్ సర్కారు విజయవంతంగా నడుపుతున్న తాను దేశంలోని బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యత తీసుకువచ్చేందుకు తపిస్తున్నారు. అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు మంత్రాంగం రచిస్తున్న నితీష్ పాచికలు పవార్, దీదీ, కేజ్రీవాల్, కేసీఆర్ వంటి వారి వల్ల ముందుకు సాగటం లేదు.

తేజస్విని భవిష్యత్ లీడర్ గా పదేపదే పేర్కొంటున్న నితీష్, తేజస్వీ యాదవ్ కు చాలా భవిష్యత్ ఉందని చెబుతున్నారు. దీనిపై స్పందించిన తేజస్వి..” అప్పటి మాట అప్పుడుచూసుకుందాం ప్రస్తుతానికైతే మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం, నితీష్ గైడెన్స్ లో దూసుకుపోతున్నాం”అన్నారు. కానీ నితీష్ మాత్రం ప్రతి వేదికపైనా ఇదే మాట పునరుద్ఘాటిస్తున్నారు. తన సొంత జిల్లాలో మాట్లాడుతూ “నేను నలంద అభివృద్ధి కోసం చాలా కృషి చేశా ఇంకా ఏమైనా మిగిలి ఉంటే తేజస్వి వాటిని పూర్తి చేస్తా”డంటూ నితీష్ పేర్కొనటం హైలైట్. అయితే నితీష్ సన్నిహితులు మాత్రం ఆయన రాత్రికి రాత్రి ఇలాంటి ప్రస్తావనలు, ప్రకటనలు చేయటం లేదని తేజస్వి వంటి చురుకైన యువకుల గురించి ఆయన తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నారని చెబుతున్నారు.

అయితే ఇదంతా నితీష్ రాజనీతి అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తన తరువాత రాజకీయ వారసుడి గురించి ప్రకటన చేసేప్పుడు జేడీయూలో ఎవరి పేరైనా ప్రస్తావిస్తే అది అంతర్గత తిరుగుబాటుకు దారి తీయవచ్చని, భవిష్యత్ కార్యచరణను దృష్టిలో పెట్టుకుని తేజస్వి పేరును ఆయన వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు. జేడీయూ నేత ఆర్జేడీ రాజకీయ వారసుడిని ప్రమోట్ చేయటంలో ఆంతర్యం ఇంకేముంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాజకీయాలను తేజస్వి హైజాక్ చేశాడని, పైగా జేడీయూపై తేజస్వి పెత్తనం ఏంటని జేడీయూ నేతలు తేజస్విపై చాలా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈనేపథ్యంలో నితీష్ చేస్తున్నఈ ప్రకటన పదేపదే జేడీయూ వర్గాల్లో మరింత అసహనాన్ని పుట్టిస్తోంది.

“2014లో అధికారం చేపట్టిన వారి పప్పులు 2024 తరువాత ఉడకవ”ని హెచ్చరించిన నితీష్ మోడీని ప్రత్యక్షంగా మాటలతో టార్గెట్ చేస్తూ తనకు జాతీయ రాజకీయాలు అందునా ప్రధాని పీఠంపై ఆసక్తి ఉందని కుండబద్ధలు కొట్టారు. దీంతో బిహార్ రాజకీయాలపై నితీష్ ఆసక్తి సన్నగిల్లిందని, దేశ రాజకీయాలపై ఆయన లోతైన దృష్టిసారిస్తున్నారని ఆగస్టు 10వ తేదీనుంచి రాష్ట్రంలో ఒకటే చర్చోపచర్చలు ప్రారంభమయ్యాయి. అయితే నితీష్ మాటల వెనుక రాజకీయ-సామాజిక సమీకరణాలున్నాయనంటున్నారు. ఎం-వై అంటే ముస్లిం-యాదవ్ మద్దతుపై ఆధారపడ్డ పార్టీగా ఆర్జేడీకి ఇమేజ్ ఉంది. ఆర్జేడీకి 16శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉంటే యాదవుల్లో 14శాతం ఓటు బ్యాంకుంది. జేడీయూ విషయానికి వస్తే అత్యంత వెనుకబడ్డ (ఈబీసీ), మహా దళితుల ఓటు బ్యాంకే పునాదులుగా ఉంది. ఈ రెండు సామాజిక సమీకరణాలు కలిసి వస్తే దేశవ్యాప్తంగా తనకు మంచి ఇమేజ్ వస్తుందని నితీష్ లెక్కలేస్తున్నట్టు తెలుస్తోంది. గతనెల్లో రాష్ట్రంలో జరిగిన మూడు ఉపఎన్నికల్లో మహాఘటబంధన్ అభ్యర్థులు రెండు చోట్ల ఓటమిపాలయ్యారు. దీంతో ఆర్జేడీ, జేడీయూ ఇద్దరూ చేతులు కలిపినా క్షేత్రస్థాయిలో ఈ కూటమిపై ప్రజల విశ్వాసం పొందలేకపోతోందనే అనుమానం నితీష్ ను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో తేజస్వి లీడర్ షిప్ గురించి నితీష్ వరుస ప్రకటనలు చేస్తున్న వ్యూహం ధ్వనిస్తోంది.

నితీష్ ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చలు జరిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నితీష్ చేతి కింద పనిచేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపటం లేదు. కానీ ఒక ఆసక్తికరమైన అంశంపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలు యోచిస్తున్నాయి అదేంటంటే 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో మోడీ ఇమేజ్ ఘనంగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం 38శాతం ఓటు షేర్ మాత్రమే. అంటే 62 శాతం ఓట్ షేర్ ను సంఘటితంగా వీరంతా కలిసి చేజిక్కించుకుని, బీజేపీని గద్దె దించే అవకాశాలున్నట్టు లెక్క. ఇదే నితీష్ చెబుతున్న “2024 సూత్రం” కూడానూ. కానీ ఈ విషయంలో నితీష్ పెత్తనాన్ని అంగీకరించేందుకు ఆదిత్యా ఠాక్రే, తేజస్వి యాదవ్ వంటి పిల్ల లీడర్లు తప్పా మరెవ్వరూ మాటవరుసకు కూడా ఆసక్తి కనబరచటం లేదు. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ జేడీయూను బలహీనపరచే చర్యలను బీజేపీ అనుసరించిందన్న పక్కా సమాచారంతోనే కమలం పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్టు తాజాగా నితీష్ చేసిన ప్రకటన ఆసక్తిగొలుపుతోంది.

నిజానికి తేజస్విని పొగడటం, పైకెత్తటం వంటివి చేయకుండా సైలెంట్ గా నితీష్ ఉండలేరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో, రాష్ట్రంలో దినదిన ప్రవర్థమానమవుతున్న తేజస్వి ఇమేజ్ నేపథ్యంలోనే నితీష్ తెలివిగా ఈ ప్రకటన చేస్తున్నారు. దానికి బలమైన రాజకీయ పరిస్థితులే కారణం. నితీష్ అంటే జేడీయూ (45మంది ఎమ్మెల్యేలు) లేకుండానే తేజస్వి సీఎం కావచ్చు. మహాఘటబంధన్ కు తేజస్వి నాయకత్వం వహించి సర్కారు ఏర్పాటు చేయవచ్చుకూడా. ఇదే జరిగితే సభలో బలాబలాల నిరూపణ సమయంలో బీజేపీ గైర్హాజరై మైనారిటీలో విజయవంతంగా తేజస్వి సర్కారు కొనసాగేలా బీజేపీ కాపాడగలదుకూడా. ఇలా అటు నితీష్ సర్కారును కూల్చిన అపప్రత ప్రజల్లో బీజేపీకి రాకుండా, నితీష్ పై పైచేయి సాధించేందుకు కూడా బీజేపీకి అవకాశం దక్కుతుంది. ఇక ప్రస్తుతం ఎంజీబీలో ఉన్న పార్టీల బలాబలాలు చూస్తే ఆర్జేడీకు 79, కాంగ్రెస్ కు 19, లెఫ్ట్ కు 16, హెచ్ఏఎం కు 4, ఏఐఎంఐఎంకు ఒకటి ఉంది. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేతో కలిపితే వీరి సంఖ్యాబలం 120కి చేరుతుంది. అంటే మహాఘటబంధన్ లో జేడీయూని పక్కనపెట్టి, తేజస్వి సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ముందే అంచనా వేసిన నితీష్ ముందు నుంచీ తేజస్వికి సముచిత ప్రాధాన్యత, ఫ్రీ హ్యాండ్ ఇస్తూనే తాజాగా ఈ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News