Bulldozer dowry : తనకు ఉన్నదాంట్లో కూతురి పెళ్లి ఘనంగా చేయాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. అత్తగారింట్లో కుమార్తె ఆనందంగా ఉండేందుకు కట్నం రూపంలో అల్లుడు ఏం అడిగినా కాదనకుండా ఇస్తుంటాడు. ఇందుకోసం అప్పులు చేయాల్సి వచ్చినా వెనక్కి తగ్గడు. కొందరు కార్లు, బైక్‌లు, నగలు కట్నంగా ఇస్తుంటే మరొకొందరు ఇంట్లో ఉపయోగించే సామాగ్రి ఇచ్చి పంపిస్తుంటారు. అయితే.. ఓ తండ్రి తన అల్లుడికి కట్నంగా బుల్డోజర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే పెళ్లి కొడుకు పేరు యోగి కావడం
సుమేర్‌పూర్‌లోని దేవ్‌గావ్ గ్రామానికి చెందిన రిటైర్డ్ సైనికుడు పరశురామ్ కుమార్తె నేహాను నౌకాదళంలో పనిచేస్తున్న సౌఖర్ గ్రామానికి చెందిన యోగేంద్ర అలియాస్ యోగికి ఇచ్చి డిసెంబర్ 15న ఘనంగా పెళ్లి చేశాడు. సుమేర్‌పూర్‌లోని అతిథి గృహంలో ఈ వివాహ వేడుక జరిగింది. తన అల్లుడికి కట్నంగా బుల్డోజర్‌ను ఇచ్చాడు పరశురామ్. ఇది చూసిన అక్కడి వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
దీనిపై యోగి మాట్లాడుతూ.. తనది వ్యవసాయ కుటుంబమని చెప్పాడు. తాను కట్నం తీసుకోవడానికి నిరాకరించానని, ఎలాంటి డిమాండ్ చేయలేదని, అయితే మామగారు బుల్‌డోజర్‌ను సర్‌ప్రైజ్‌గా బహుమతిగా ఇచ్చారన్నారు.
కట్నంగా బుల్డోజర్ ఇచ్చారని తెలుసుకున్న ఆ ప్రాంతంలోని జనం దాన్ని చూసేందుకు యోగి ఇంటికి వెలుతున్నారు. దానితో సెల్పీలు దిగుతున్నారు.