గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంతు నాయక్ తెలిపారు. చాగలమర్రి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పలు రికార్డులను సీఐ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూరల్ పరిధిలో నాటు సారా, పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో కులాలకు, మతాలకు, వర్గాలకు, రాజకీయాలకు అతీతంగా గౌరవప్రదంగా జీవించాలని ఆయన కోరారు. చిన్నపాటి గొడవలకు గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీటర్లు గ్రామాలలో ఎటువంటి గొడవలకు పాల్పడకుండా, మార్పు చెందుతూ ఉంటే వారిపై ఉన్న కేసులను కూడా పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అటువంటి వారిపై ఏ కేసులు లేకుండా సమాజంలో స్వేచ్ఛగా జీవించొచ్చు అన్నారు.
చాగలమర్రి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు. శాంతియుత గ్రామాలలో అలజడులు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. చాగలమర్రి స్టేషన్ లోని, పలు కేసుల రికార్డులను పరిశీలించి వాటి వివరాలను ఎస్ఐ రమణయ్య ద్వారా తెలుసుకున్నారు.