కందుకూరి వీరేశలింగం 1878లో రాసిన ‘రాజశేఖర చరిత్రము’ అనే నవలను తెలుగు భాషలో మొట్ట మొదటి నవలగా పరిగణిస్తుంటారు. ఇది ఎంతగానో ఆదరణ పొందిన నవల. గత శతాబ్దంలో ఈ నవలను చదవని సాహితీవేత్త లేరంటే అందులో అతిశయోక్తేమీ లేదు. ఆయన ఈ నవలను ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ నవలకు ప్రేరణగా కొందరు ప్రచారం చేయడం జరిగింది కానీ, నిజానికి ఆ నవలకు దీనికి ఎక్కడా పోలిక లేదని ఆ తర్వాత చాలామందికి అర్థమైంది. ఈ రెండింటికీ ఎక్కడా ఏమాత్రం పోలికే లేదని, రాజశేఖర చరిత్రములో రాసిన విషయాలన్నీ కొత్తవేనని దీని రెండవ ప్రచురణ తర్వాత వీరేశలింగం స్వయంగా వెల్లడించారు. ఈ పుస్తకాన్ని ఆ తర్వాత ఆంగ్లం, కన్నడం, తమిళ భాషల్లోకి అనువదించారు. ఇది విశ్వవిద్యాలయం స్థాయిలో పాఠ్యపుస్తకంగా కూడా కొనసాగింది.
నిజానికి, ఈ నవల తెలుగులో మొట్టమొదటి నవల కాకపోయినప్పటికీ, ఈ పుస్తక ప్రభావం వల్ల, ఆ తర్వాత అనేక నవలలకు ఇదే మార్గదర్శకంగా ఉండడం వల్ల దీనిని మొదటి నవలగా పరిగణించడం జరుగుతోందని ప్రసిద్ధ విమర్శకుడు, పరిశోధకుడు డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు వివరించారు. ఆయన ఈ నవలపై విమర్శనాత్మక గ్రంథం కూడా రాశారు. అప్పట్లో సామాజికంగా ఉన్న దురాచారాలను, మూఢ నమ్మకాలను వీరేశలింగం పంతులు తమ నవలలో చీల్చి చెండాడారు. కాగా, నవలా ప్రక్రియను తాను రాజశేఖర చరిత్రము ద్వారానే నేర్చుకున్నానని ప్రసిద్ధ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం కూడా పేర్కొనడం జరిగింది.
ఈ నవలలోని కథానాయకుడు రాజశేఖరుడు అమాయకత్వంతోనూ, అవివేకంతోనూ, అజ్ఞానంతోనూ బతికేస్తుంటాడు. అనేక ఏళ్లపాటు అంధ విశ్వాసాలతో కాలం గడుపుతాడు. అనేక కష్ట నష్టాలకు లోనవుతాడు. కల్లాకపటం తెలియని రాజశేఖరుడు కపటం, మోసం, టక్కరి వ్యవహారాలతో బతుకుతున్న పలువురి చేతుల్లో మోసపోతాడు. అతను ఊరిపెద్ద అయినప్పటికీ, తన డబ్బునంతా దైవ కార్యాలకు, బంధుమిత్రుల కపట కష్టనష్టాలను తీర్చడానికి ఖర్చు చేస్తాడు. అంధ విశ్వాసాలకు లోనై, బంగారాన్ని చేసి ఇస్తాననే వ్యక్తి మాటలు నమ్మి డబ్బంతా పోగొట్టుకుంటాడు. చివరికి అప్పులు కూడా చేసి, వాటిని తీర్చలేక కారాగారవాసం పాలవుతాడు. అనేక అనుభవాల తర్వాత ఈ మూఢ నమ్మకాల నుంచి బయటపడి, వివేకవంతమైన జీవితాన్ని సాగిస్తాడు.
వీరేశలింగం పంతులు ఈ నవలలో అంధవిశ్వాసాలను, మోసాలను, కపటాలను తీవ్రంగా ఖండించడంతో పాటు, అంతరించిపోతున్న రాజరిక లక్షణాలను కూడా ఎత్తిపొడిచారు. వివిధ సంఘటనలు, సన్నివేశాల ద్వారా అశాస్త్రీయ విషయాలను కూడా ప్రస్తావించి, ఖండించారు. కొన్ని పాత్రల ద్వారా మూఢ విశ్వాసాలను కల్పించి, వాటివల్ల జరుగుతున్న మోసాలను వివరించారు. అంతేకాక, ఈ నవల నిండా తెలుగు వాళ్ల జీవితం, వాళ్ల జీవితాల చుట్టూ అల్లుకున్న పరిస్థితులు, పరిసరాలు ఇందులో కళ్లకు కడతాయి. ఆయన నవల నిండా ఆధునిక సంస్కరణ భావాలు నిండి ఉన్నాయి. ఇందులోని పరిస్థితులు అనేకం ఇప్పటికీ కొనసాగుతున్నందువల్ల ఈ పుస్తకాన్ని ఇప్పుడు కూడా ప్రతివారూ చదవడం చాలా అవసరం.
Telugu literature: అపురూప నవల రాజశేఖర చరిత్రము
నవల నిండా ఆధునిక సంస్కరణ భావాలు నిండి