నంద్యాల జిల్లాలో పీఎస్ సి & కెవిఎస్ సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా… కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి-జిల్లా ఇంఛార్జి మంత్రి అంజాద్ బాషా ముఖ్య అతిధిగా జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ వేడుకల్లో పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్దర్, మార్క్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, ఏఎస్పీ వెంకట రాముడు, డిఆర్ఓ పుల్లయ్య పట్టణానికి చెందిన ప్రముఖులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సదర్భంగా జిల్లా కలెక్టరు డా.మనజిర్ జిలాని సమూన్, ఏఎస్పీ వెంకట రాముడులతో కలిసి పెరేడ్ మైదానాన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి పరిశీలించారు. అనంతరం వివిధ ప్లాటూన్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి అంజాద్ బాషా సందేశమిస్తూ ఈ జిల్లాలో పుట్టి పెరిగి ఈ ప్రాంత ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కలిగించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గోసాయి వెంకన్న, వడ్డే ఓబన్న, నంద్యాల కాదర్ బాద్ నర్సింగరావు, ఆంధ్రతిలక్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, యాళ్ళూరి స్వామిరెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్య, బివి సబ్బారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, గామాగో వంటి మహనీయులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించాలన్నారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల నుండి వచ్చిన 6 వేల 288 అర్జీలలో 4 వేల 851 సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించామని,మిగిలిన వాటిని కూడా కాల పరిమితిలోపు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రజల వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అర్హులందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘జగనన్నకు చెబుదాం – జగనన్న సురక్ష కార్యక్రమం కింద 2 లక్షల 92 వేల 595 సర్వీసు రిక్వెస్ట్ లను స్వీకరించి 2 లక్షల 91 వేల 954 సర్టిఫికేట్లను సురక్ష క్యాంపుల ద్వారా పంపిణీ చేసి 99.78 శాతంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు.
డిఆర్డిఏ, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్ , వ్యవసాయం, సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, ఉద్యాన, రవాణా, సూక్ష్మ సేద్యం, సివిల్ సప్లైస్ అగ్నిమాపక శాఖలు ప్రదర్శించిన శకటాలను ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే సంబంధిత శాఖలు ప్రదర్శించిన ఎక్సిబిషన్ స్టాళ్లను అతిధులు సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించిన పాఠశాల విద్యార్థులకు, శకటాల ప్రదర్శనకు బహుమతులు అందచేశారు.