పాత్రికేయుడుగా, పరిశోధకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, రచయితగా, న్యాయవాదిగా, సంఘసంస్కర్తగా, శాసనసభ్యుడిగా ఇలా ఎన్నో పాత్రలు తక్కువ సమయంలో పోషించారు సురవరం ప్రతాపరెడ్డి. అనేక రకాల దక్షతలను ఏకకాలంలో కలిగిన వ్యక్తి సురవరం అంటూ కార్యక్రమంలో పాల్గొన్నవారు సురవరంకు ఘన నివాళి అర్పించారు. సురవరంకు సమానమైన వారు తెలుగునేలపై మరొకరు లేరని, 58 ఏళ్లకే వారు మరణించడం దురదృష్టకరమన్నారు వక్తలు. సురవరం దృష్టికోణంపై రెండు సంకలనాలు తీసుకువచ్చాం .. మూడో సంకలనంలో మలిదశ తెలంగాణ ఉద్యమం, సాంఘీక, రాజకీయ చైతన్యాన్ని ఇందులో పొందుపరచామని సర్కారు తెలిపింది. వారి విద్వత్తు, తలపెట్టిన కార్యక్రమాలు తర్వాత తరానికి తెలిసేలా చేయడంలో అప్పటి వారు విఫలమయ్యారని, 12 మంది కవులు, సాహిత్యకారులతో కలిసి సురవరం సమాచారం సేకరించి సంకలనాలలో పొందుపరిచినట్టు.. భవిష్యత్ లో పీహెచ్ డీ చేసే వారికి ఇవి ఉపయోగపడతాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఇనుపగుండెతో పనిచేసిన గొప్పమనిషి సురవరం, జర్నలిజంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిజం వృత్తిగా ఎంచుకుని యాజమాన్యాల కింద పనిచేస్తున్నారని, ఇక్కడ యాజమాన్యాలది వ్యాపారాత్మక ధోరణి .. భవిష్యత్ లో ఈ విధానం మరింత పెరిగే అవకాశం ఉన్నదన్నారు మంత్రి. ప్రపంచంలో అనేక భాషల్లో ఏర్పడిన పత్రికలు ఆయా దేశాలు, ఆయా ప్రాంతాల్లో అక్కడి ప్రజా సమూహాల్లోని చైతన్యాన్ని పెంచడానికి ఒక కర్తవ్య దీక్ష తీసుకుని ముందుచూపు కలిగిన వాళ్లు ప్రజలను నడిపించడానికి జర్నలిజాన్ని ఒక ఆయుధంగా వాడారని, రష్యా విప్లవంలో లెనిన్ ప్రారంభించిన పత్రిక, చైనా విప్లవంలో మావో ప్రారంభించిన పత్రిక, మనదేశంలో మహాత్మాగాంధీ ప్రారంభించిన పత్రిక గానీ, మహారాష్ట్రలో బాల్ థాకరే నడిపిన సామ్నా పత్రికగానీ వాటి లక్ష్యమే ప్రజలలో చైతన్యం, వ్యవస్థలో మార్పు, ప్రజలను ఒక దారిలో నడిపించడమన్నారు మంత్రి.
ప్రస్తుత పరిస్థితులలో పత్రికల యాజమాన్యాలు ప్రజాచైతన్యం కోసం కట్టుబడి ఉన్నారనుకోవడం భ్రమ అని, ప్రజలను నడిపించడానికి రాత మొదలయింది .. తదనంతర కాలంలో ఘటనలు, సంఘటనలు, సమాజంలో జరిగే వివిధ రకాల కార్యకలాపాలు వాటిని ప్రజలకు తెలియపరిచే సాధనాలుగా మార్పు చెందాయన్నారు. ఆ తర్వాత ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ప్రజాభిప్రాయాలుగా చూపే ప్రయత్నం కూడా నడుస్తున్నదని, ఈ సంక్లిష్టమయిన పరిస్థితులలో జర్నలిస్ట్ ల యొక్క భవితవ్యం, వారి కర్తవ్య నిర్వహణ కత్తి మీద సాములాంటిదన్నారు. భావప్రకటనా స్వేచ్చకు, భావజాల వ్యాప్తికి ఉపయోగపడిన కేంద్రం ఇదన్నారు.
బషీర్ బాగ్ లో పునర్నిర్మించిన టీయూ డబ్లూజే కార్యాలయం, సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియం ప్రారంభించి, ప్రసంగించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీపీఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత దేవులపల్లి అమర్, ఐ&పీఆర్ కమీషనర్ అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ విరాహత్ అలీ , సురవరం కుటుంబ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, కపిల్ తదితరులు పాల్గొన్నారు.