మనదేశంలో మరుగుదొడ్ల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇప్పటికీ చాలామంది సిగ్గుపడతారు. అదేదో తమ గౌరవానికి భంగం కలిగించే అంశమన్నట్లు భావిస్తారు.అలాంటి భారతదేశంలో ఐదు దశాబ్దాలుగా పారిశుద్ధ్య ఉద్యమాన్ని నడుపుతోన్న ప్రజారోగ్య ఉద్యమ సేనాని డాక్టర్ బిందేశ్వర్ పాఠక్. ఇవాళ ప్రజా మరుగుదొడ్లకు పర్యాయపదంగా సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ నిలిచిందంటే దాని వెనుక డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ ఎనలేని కృషి ఉంది. జీవితాంతం సఫాయి కర్మచారీల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్.
డాక్టర్ బిందేశ్వర్ పాఠక్, ఓ సామాజిక సేనాని. మనదేశంలో పారిశుద్ధ్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన విప్లవకారుడు ఆయన. టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా బిందేశ్వర్ పాఠక్ పాపులర్. భారతదేశంలో పబ్లిక్ టాయిలెట్స్ ప్రస్తావన రాగానే వెంటనే గుర్తుకువచ్చే పేరు ..బిందేశ్వర్ పాఠక్. ప్రజారోగ్యంలో ఓ సరికొత్త విప్లవం సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థ. బీహార్ వైశాలీ జిల్లా రాంపూర్ బఘేల్ గ్రామంలో 1943 ఏప్రిల్ రెండున ఒక ఉన్నత కులంలో బిందేశ్వర్ పాఠక్ జన్మించారు.బాల్యం నుంచే ఆయనకు సామాజిక సోయ ఎక్కువ. ఇంట్లోని పొడి మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి వచ్చిన అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలతో తన అమ్మమ్మ వివక్షతో వ్యవహరించడాన్ని బాల్యంలోనే బిందేశ్వర్ గమనించారు. సదరు మహిళలు వెనుక తలుపుల నుంచి ఇంట్లోకి ప్రవేశించడం అలాగే వాళ్లు వెళ్లిపోయిన తరువాత ఇంటిని శుద్ధి చేయడానికి గంగా జలాన్ని నేలపై చల్లడాన్ని కూడా ఆయన గమనించారు. ఇలాంటి పరిస్థితుల్లో మాన్యువల్ స్కావెంజర్స్ విషయంలో పెద్దయ్యాక ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. పుట్టి పెరిగిన రాంపూర్ బఘేల్ గ్రామంలో ప్రాథమిక చదువు పూర్తి చేశారు. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం రాజధానీ నగరమైన పాట్నా చేరుకున్నారు. పాట్నాలోని బీఎన్ కాలేజీలో చదువుకుని సోషల్ సైన్సెస్‌లో డిగ్రీ తీసుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక 1968 ప్రాంతంలో పాట్నాలోని గాంధీ శత జయంతి కమిటీలో కొంతకాలం వాలంటీర్‌గా చేరారు. అనాగరికమైన బకెట్ మరుగుదొడ్ల వ్యవస్థ నుంచి సఫాయి కర్మచారీలను విముక్తి చేసే విభాగంలో ఆయన పనిచేశారు. ఇందులో భాగంగా అనేక ప్రాంతాల్లో బిందేశ్వర్ పర్యటించారు. సఫాయి కర్మచారీల సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. సఫాయి కర్మచారీలతో కలిసి తిరిగినందుకు బిందేశ్వర్‌పై ఆయన కుటుంబసభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుటుంబ గౌరవాన్ని మంట గలుతున్నాడని నిప్పులు చెరిగారు. అయితే వీటిని బిందేశ్వర్ పట్టించుకోలేదు. తన మానాన తాను పనిచేసుకుంటూ వెళ్లిపోయారు. గాంధీ శత జయంతి కమిటీలోవాలంటీర్‌గా పనిచేస్తున్నప్పుడు బిందేశ్వర్‌పై మహాత్మాగాంధీ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో బెటియా పట్టణంలో పనిచేయడానికి బిందేశ్వర్‌ను పంపారు. అక్కడే పొడి మరుగుదొడ్లకు ప్రత్యామ్నాయంగా ఒక సాంకేతికను కనుగొన్నాడు. దీని పేరే….టూ -పిట్ పోర్ -ఫ్లష్ టాయిలెట్. ఆ అప్పటి ఈ టెక్నాలజీయే ఆ తరువాత సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌కు దారితీసింది.
1974లో తొలిసారి పాట్నాలో సులభ్ సౌచాలయ కాంప్లెక్స్
మనదేశంలోని పారిశుద్ధ్య ఉద్యమంలో 1974 ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. అదే ఏడాది తొలిసారి పాట్నాలో సులభ్ సౌచాలయ కాంప్లెక్స్ ఏర్పాటైంది. ఈ కాంప్లెక్స్‌లో మరుగుదొడ్డి, మూత్రవిసర్జన, స్నానం చేసే సదుపాయాలుంటాయి . అంతేకాదు 24 గంటలూ సౌచాలయ కాంప్లెక్స్ తెరిచే ఉంటుంది. నామమాత్రపు రుసుము చెల్లించి ఈ సేవలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. తొలి రోజుల్లో శౌచాలయాన్ని వాడటానికి ప్రజలు సంశయించారు. ఎవరూ వచ్చేవారు కాదు. అదేదో అట్టడుగు వర్గాలకు చెందిన వ్యవహారమన్నట్లు చూసేవారు. అయితే క్రమక్రమంగా శౌచాలయానికి ప్రజలు రావడం మొదలైంది. చాలా తక్కువ సమయంలోనే సులభ్ సౌచాలయ కాంప్లెక్స్‌లు జనాదరణ పొందాయి. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రస్తుతం 1,600 అర్బన్ ఏరియాల్లో ప్రజలకు సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 9,000కు పైగా సామాజిక మరుగుదొడ్ల కాంప్లెక్స్ లను నిర్వహిస్తోంది. రైల్వేవ్యవస్థలోకి కూడా సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎంటరయ్యింది. కొన్ని రైల్వే స్టేషన్లలోని మరుగుదొడ్లను సైతం సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహిస్తోంది. భారతీయ రైల్వేకు చెందిన స్వచ్చ రైల్ మిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా బిందేశ్వర్ పాఠక్ పనిచేశారు. సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటు దిశగా బిందేశ్వర్ పాఠక్ కృషి చేస్తున్నప్పుడు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. పిల్లనిచ్చిన మామ నుంచి కూడా ఆయన ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. తమ అల్లుడు ఏం చేస్తున్నాడో ఆయన బయటి ప్రపంచానికి చెప్పుకోలేకపోయారట. ఒక దశలో బిందేశ్వర్ పాఠక్‌కు తన బిడ్డనిచ్చి అన్యాయం చేశానని ఆయన మామ బాధపడ్డారట.
సఫాయి కర్మచారీల జీవితాల్లో వెలుగులు నింపిన సులభ్
సఫాయి కర్మచారీల కుటుంబాల అభ్యున్నతికి సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ కృషి చేస్తోంది. సఫాయి కర్మచారీల పిల్లలకు కంప్యూటర్ విద్య, టైపింగ్, షార్ట్ హ్యాండ్, ఎలక్ట్రికల్ ట్రేడ్, చెక్క పని, తోలు పని, డీజిల్, పెట్రోల్ ఇంజనీరింగ్, టైలరింగ్, కేన్ ఫర్నిచర్ తయారీ, మోటార్ డ్రైవింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించడానికి చొరవ చూపించింది. ఈ మహత్యార్యం కోసం ప్రత్యేకంగా కొన్ని
ఇతర సంస్థలను స్థాపించింది. అంతేకాదు…బృందావన్‌లో విడిచిపెట్టిన వితంతువులకు ఆర్థిక సాయం చేయడమూ మొదలెట్టింది. మానవ వ్యర్థాలను చేతులతో ఎత్తిపారబోయడాన్ని సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అనాగరికమైన ఈ వ్యవస్థను రద్దు చేసేంతవరకు ఉద్యమం నిర్వహించింది. ఈ క్రమంలో ఏళ్ల తరబడి సమాజంలో నాటుకుపోయిన ఈ విధానాన్ని రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకువచ్చింది.
బిందేశ్వర్ సేవలకు అంతర్జాతీయ గుర్తింపు
సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా సఫాయి కర్మచారీల జీవితాల్లో ఎనలేని మార్పు తీసుకువచ్చారు బిందేశ్వర్ ఠాకూర్. అలాగే పర్యావరణ పరిశుభ్రత, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగానికి ఆయన ఎనలేని కృషి చేశారు. ఈ నేపథ్యంలో 1971లో దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం.
అలాగే బిందేశ్వర్‌కు అంతర్జాతీయంగా అనేక ఇతర అవార్డులు దక్కాయి. వీటిలో ఎనర్జీ గ్లోబ్ అవార్డు, దుబాయ్ ఇంటర్నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ ప్రాక్టీసెస్, ది స్టాక్ హోం వాటర్ ప్రైజ్, ది లెజెండ్ ఆఫ్ ప్లానెట్ అవార్డు ముఖ్యమైనవి. పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సెయింట్ ఫ్రాన్సిస్ పారితోషికాన్ని పోప్ జాన్ పాల్ టూ 1992లో బిందేశ్వర్ కు అందించారు. సర్వోత్క్రుష్ట నాగరిక పద్ధతిగా సులభ్ శౌచాలయానికి అంతర్జాతీయంగా పేరు వచ్చింది. 1996లో ఇస్తాంబుల్‌లో జరిగిన హేబిటాట్ – 2 సదస్సు ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అలాగే సులభ్ ఇంటర్నేషనల్ సేవలకు ఐక్యరాజ్య సమితి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక, సామాజిక సంస్థ సులభ్ సేవలను కొనియాడింది.
-ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320