22 ఆగష్టు 1846 రోజున ‘విలియమ్స్ జాన్ థామ్స్’ ప్రయోగించిన ‘ఫోక్‌లోర్’ అనే పదం ‘జానపద సంప్రదాయ లోకజ్ఞానం’ అనే భావనతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ‘ఫోక్’ అనగా ‘జానపదం’ అని, ‘లోర్’ అనగా ‘సంప్రదాయ లోకజ్ఞానం’ అని అర్థం చేసుకోవాలి. విలియమ్స్ జాన్ థామ్స్ చేసిన కృషిని గుర్తించిన అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా మిలిటరీ లీడర్ ‘అలెంకర్ కాస్టెల్లో బ్రాంకో’ చొరవతో 1965 నుంచి ప్రతి ఏట 22 ఆగష్టున ‘ప్రపంచ జానపద సంప్రదాయ దినోత్సవాన్ని (వరల్డ్ ఫోక్‌లోర్ డే)’ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
ప్రపంచం వైవిధ్యభరతం
ప్రపంచవ్యాప్తంగా నవసమాజానికి దూరంగా గిరిపుత్రులు జీవనాన్ని గడుపు తున్న గిరిజనులు, జానపద వర్గాలు ఆచరించే సంప్రదాయాలు, వారసత్వ సంప దలు, భాషలు, సంస్కృతులు, విశ్వాసాలు, అలవాట్లు, ఆచార వ్యవహారాలు, పర్వదినాలు, నాట్య కళలు, దిన చర్యలు లాంటి అంశాలను కాపాడుకుంటూ, ప్రోత్సహిస్తూ, డిజిటల్ వెలుగుల్లో అంతరించకుండా చూసుకోవలసిన అవసరాలను చర్చించడం లాంటి అంశాలను ప్రపంచ జానపద సంప్రదాయ దినోత్సవ వేదికగా నిర్వహిస్తారు. గ్రామీణ గిరిజన కళా ప్రదర్శనలు, కళాకారులకు సన్మానాలు, పురస్కార ప్రదానాలు లాంటివి నిర్వహించడం సదాచారంగా కొనసాగుతున్నది. గిరిజన సంప్రదాయ జ్ఞానాన్ని, కథలను రాబోయే తరాలకు అందించడానికి ఈ సమావేశాలు సర్వదా దోహదపడతాయి.
జానపద సాంప్రదాయాలకు పుట్టిళ్లు భారతం
భిన్నత్వంలో ఏకత్వం భారత నినాదం. భారతంలో 75 శాతానికి పైగా విభిన్న వారసత్వ సంపదల సమ్మిళిత హిందూ సమాజం ఉన్నది. కులమతాలు, ఆవాస స్వభావాల ఆధారంగా ప్రజల జీవిత విధానాలు, సంప్రదాయాలు, కళలు ఆధారపడి ఉన్నాయి. తంజావూర్, మధుబని, నిర్మల్, వర్లీ, పట్టచిత్ర, రాజస్థానీ, కలమెజుత్తు లాంటి ప్రముఖ జానపద కళల(ఫోక్ ఆరట్స్)తో పాటు పబూజీ, భోపాస్, గర్బా, దాండియా, సంభల్‌పూర్, గంభీరా, బిహూ, గూమర్, భంగ్రా, ధంగర్, పంతీ, కోలాటం, యక్షగానం, తీరయట్టం, ఛాంగ్ లో, పంచతంత్ర, జటక, తెనాలి రామకృష్ణ, అక్బర్ బీర్బల్ లాంటి జానపద కథలు (ఫోక్‌టేల్స్) భారతీయ భిన్నత్వ మెరుపులకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. రామాయణ మహాభారత ఇతిహాసా ల్లోని శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు లాంటి నాయకుల పాత్రలను పోషిస్తూ భీర్ కేర్వాల్, బిదూ చందన్, చితల్ సింగ్ చ్ఛత్తీ లాంటి జానపదులు-గిరిజనులు ఫోక్ హీరోస్‌గా పేరు పొందిన వారు నేటికీ మనకు కనిపిస్తారు. జానపద సాంస్కృతిక సంపదలుగా భజన్, భక్తి, అముల్ గర్ల్, గోకుల, పూజ, వీధి ఆటలు, సాధు, యోగా, యక్షి లాంటి కళలు నవసమాజంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. చతురంగ, పచ్ఛీస్, మోక్ష పటము, కసాడీ, గంజీపా లాంటి అనేక జానపద ఆటలు కూడా ప్రస్తుతం ఆదరి స్తున్నాం. జానపద సాంప్రదాయ నాట్యాలు, సంగీతం కూడా మన సాంస్కృతిక వారసత్వాలను సుసంపన్నం చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల జానపద కళలు
మన తెలుగు రాష్ట్రాల జానపద సాంస్కృతిక కళలకు 5000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఒగ్గు కథ, మల్లన్న కథలు, బీరప్ప కథలు, యెల్లమ్మ కథలు తెలంగాణ ప్రాంతంలో బహుళ ప్రచారంలో ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెంచు బాగోతం, బుర్రకథలు, వీరనాట్యం, హరిదాసులు, సాతానీలు, జంగములు, బుట్ట బొమ్మలు, డప్పు, బోనాలు, బతుకమ్మ, కలంకారి, ముగ్గులు, తప్పెటగుళ్లు, ధింసా, కోలాటం లాంటివి ప్రముఖ జానపద గిరిజన సమాజ కలలుగా పేరొం దాయి. చెంచులు, యందాడీలు, కోయ, సవరలు లాంటి జానపదుల జీవనశైలిలో వైవిధ్యభరిత సాంప్రదాయాలు దాగి ఉన్నాయి. మన సంస్కృతిలో అంకమ్మ, మారెమ్మ, పోలేరమ్మ, పెద్దమ్మ, ఆటలమ్మ, ఎల్లమ్మ, నల్ల పోచమ్మ, కట్ట/గండి మైసమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ లాంటి గ్రామీణ దేవతలు నిత్యం పూజలు అందుకుంటున్నాయి. సమ్మక్క సారలమ్మ జానపద గిరిజన జాతరను తెలంగాణ కుంభమేళగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. రాజస్థానీ గిరిజన నేపథ్యం కలిగిన లంబాడీలు తెలంగాణ గ్రామీణ సమాజంలో ముఖ్య భాగంగా నిలుస్తు న్నారు. గుస్సాడీ, ధింసా, పేరిణి, డప్పు నృత్యాలు జానపద సాంప్రదాయాలను సుసంపన్నం చేస్తున్నాయి. అన్నమాచార్య కీర్తనలు మన జానపదుల గొంతుల్లో నిత్యం నాట్యం చేస్తేనే ఉన్నాయి.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జానపద సాంప్రదాయ వారసత్వా లను అన్వేషించడం, పరిశోధించడం, డిజిటల్ వెలుగుల్లోకి తీసుకురావడం, ప్రదర్శించడం, గుర్తించి పురస్కారాలు ఇవ్వడం లాంటి అంశాల్లో ఎందరో మహాను భావులు తమ జీవితాలను త్యాగం చేశారు. జానపద, గిరిజన వారసత్వ సంపదలు అంతరించకుండా, రానున్న తరానికి అందించే మహాయజ్ఞంలో తమ భుజాలను అందిస్తున్న జానపద పితామహులకు వేలవేలా వందనాలు అందజేద్దాం. జానపద గిరిజన సమాజానికి అభివృద్ధి ఫలాలు అందేలా అడుగులు వేద్దాం.
- డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037
(నేడు ప్రపంచ జానపద సంప్రదాయ దినోత్సవం)