శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన బీ.ఆర్.ఎస్ పార్టీ యువ గర్జనతో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ప్రభంజనం సృష్టించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీ.వి. రామకృష్ణా రావులు హాజరయ్యారు. శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు, యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చి తాడికల్ గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీతో కేశవపట్నంలోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హల్ కు చేరుకున్నారు.
ఎమ్మెల్యే రసమయి మూడవసారి మానకొండూర్ ఎమ్మెల్యే టిక్కెట్టు సాధించిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో యువ గర్జన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్, రసమయి బాలకిషన్ లు మాట్లాడుతూ.. 1969 లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 360 మందిని కాల్చి చంపిన ఘటనలు ఉన్నాయన్నారు.
తెలంగాణ ఉద్యమం కోసం 2001లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం మొదలుపెట్టి, 2009 లో తెలంగాణ వచ్చుడో.. కే.సి.అర్. సచ్చుడో.. అని కే.సి.అర్. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని, ఆ పోరాట ఫలితంగా 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడి కే.సి.అర్. ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలనే కాకుండా, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిధులు విడుదల చేయడం జరిగిందని వివరించారు. రైతులకు రైతుబంధు, రైతుభీమా, దళితబంధు, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, బీసీ రుణాలు, గొల్ల కురుమలకు ఉచితంగా గొర్రెలు అందిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా నాడు ఉన్న 200 గురుకులాలను నేడు వెయ్యి గురుకులాలుగా తీర్చిదిద్ది గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్యను ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం విజయోత్సవాలకు అడ్డా అన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని 2014లో ఎమ్మెల్యేగా అయిన నాటి నుండి నేటి వరకు ఎంతో అభివృద్ధి పరిచామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రస్తుత కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జే.పి. ప్రభుత్వం నుండి నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి నిధులు తీసుకరాలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.