Vishal-CM Jagan: తమిళ స్టార్ హీరో విశాల్ డబ్బింగ్ సినిమాల ద్వారా తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అయ్యి ఒకటీ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలయ్యాయి. అయితే, హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే విశాల్.. త్వరలోనే లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతోనే విశాల్ బిజీగా ఉన్నాడు.
ఆదివారం చెన్నైలో జరిగిన ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న విశాల్ ఏపీ రాజకీయాల రంగప్రవేశంపై క్లారిటీ ఇచ్చాడు. నేను కుప్పంలో పోటీ చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేసిన విశాల్.. అక్కడినుంచి పోటీ చేస్తానన్న వార్తల్లో నిజం లేదన్నాడు. అయితే కుప్పంతో తనకు మంచి అనుబంధం ఉందని.. కుప్పంలో మా నాన్న గ్రానైట్ వ్యాపారం చేసేవారని.. ఆ సమయంలో మూడేళ్ల పాటు అక్కడే ఉండడంతో కుప్పంలో వీధి వీధి తెలుసన్నాడు.
కాగా, ఇవాళ ఏపీ సీఎం జగన్‌ను కలవనున్నట్లు హీరో విశాల్ చెప్పాడు. జగన్ అంటే తనకు చాలా ఇష్టం అని ఆయన అన్నారు. జగన్ సీఎం అవుతారని తాను పాదయాత్ర సమయంలోనే చెప్పానన్నారు. లాఠీ సినిమా ప్రమోషన్‌లో తిరుపతికి వచ్చిన విశాల్.. ఇవాళ సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. అయితే ఈ మీటింగ్‌కి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. తాను వైసీపీ నుంచి ఎలాంటి సీటు ఆశించడం లేదని క్లారిటీ ఇచ్చాడు.
ఒకవైపు ఏపీ రాజకీయాలకు తాను రానంటూనే.. మరోవైపు సీఎం జగన్ తో భేటీ కావడంతో రాజకీయాలలో ఆసక్తిగా మారింది. వైసీపీ ఎప్పటి నుండో కుప్పం నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి ఉంది. ఇక్కడ దెబ్బకొట్టి టీడీపీ అధినేత చంద్రబాబును కోలుకోకుండా చేయాలనీ చూస్తున్నారు. అందుకోసం విశాల్ ను అక్కడ నుండి పోటీకి దింపాలని చూస్తుంది. ఈ క్రమంలో భేటీ ప్రాధాన్యత లేదని విశాల్ చెప్పినా అందరి దృష్టి ఇప్పుడు ఈ భేటీపైనే ఉంది.