చిన్నారులు తొందరగా నిద్రపోరు. వారిని నిద్రపుచ్చడానికి తల్లి పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అందులో కొత్తగా తల్లలులైన యువతులకు చిన్నారులను నిద్రపుచ్చడం తెలియక వారికేమైపోతుందనోనన్న భయంతో ఉంటారు. ఇలాంటి యంగ్ అమ్మలు కింద టిప్స్ పాటించి పాపాయిని నిద్రపుచ్చొచ్చు. అవేమిటంటే…పసి పిల్లలు వేగంగా నిద్రపోవాలంటే పాసిఫైయర్స్ బాగా పనిచేస్తాయి. బేబీ ప్రశాంతంగా నిద్రపోయేలా పేసిఫైయర్స్ ఎంతగానో సహకరిస్తాయని ఒక స్టడీలో కూడా వెల్లడైంది. పేసిఫైయర్స్ తో బేబీ హాయిగా నిద్రపోవడమే కాదు‘ సిడ్స్’ అంటే ‘సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రమ్’ పాలబడరు. ఇది కాకుండా పాపాయిని పడుకోబెట్టడానికి ఇంకొన్ని టిప్స్ కూడా ఉన్నాయి.
జోలపాటలు చిన్నారులను తొందరగా నిద్రపుచ్చుతాయి. పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు ఇంట్లోని చిన్నపిల్లలను లాలిపాటలతో నిద్రపుచ్చేవారు. మీకు లాలిపాటలు రాకపోయినా ఫరవాలేదు. గదిలో తక్కువ సౌండులో మంచి మ్యూజిక్ ని పెడితే చిన్నారులు హాయిగా నిద్రపోతారు. మ్యూజిక్ వల్ల బ్రెయిన్ ప్రశాంతంగా ఉండి పాపాయిలకు మంచి నిద్ర పడుతుంది. లాలిపాటలు వచ్చిన అమ్మలయితే తమ మధురమైన కంఠంతో చిన్నారులను ఇట్టే పడుకోబెట్టేయవచ్చు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతుంటే కూడా పాపాయిలు తొందరగా పడుకుంటారు. ముఖ్యంగా నెలల పిల్లలు తమకు తాము నిద్రపోలేరు. ఈ చిన్నారులను రాత్రుళ్లు ఉయ్యాల్లో వేసి మెల్లగా ఊపుతుంటే ఇట్టే పడుకుంటారు.
చిన్నారులను చేతుల్లో పడుకోబెట్టుకుని అటు ఇటు మెల్లగా ఊపుతూ కూడా పడుకోబెట్టవచ్చు. గదిలో లైట్లు ఆఫ్ చేసి పాలు ఇస్తూ పడుకోబెడితే కూడా పాపాయిలు తొందరగా పడుకుంటారు. నిశ్శబ్దంగా ఉన్న గదిలో పాపాయిలకు తొందరగా నిద్ర పడుతుంది. డిమ్ లైటు వెలుగులో పడుకోబట్టినా కూడా పాపాయిలు తొందరగా పడుకుంటారు. చిన్నారులు పగలంతా కాళ్లు, చేతులు ఊపుతూ ఒకటే తీరున ఆటలాడుతుంటారు. సరిగా నిద్రపోరు. అందుకే చిన్నారులకు రాత్రుళ్లు కాళ్లకు మసాజ్ చేస్తే కాళ్లు, పాదాలు రిలాక్సయి తొందరగా నిద్రపోతారు. చిన్నారులు రోజులో పది పన్నెండు గంటల పాటు తప్పనిసరిగా పడుకోవాలి. అలా కనుక మీ పాపాయి పడుకోకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మరవొద్దు.