Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Sharmila in Cong: షర్మిలతో కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందా?

Sharmila in Cong: షర్మిలతో కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందా?

షర్మిల చేరికతో పార్టీకొచ్చే పొలిటికల్ మైలేజ్ ఏమైనా ఉందా?

ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న తెలంగాణలో ఆయారాం, గయారాంల సీజన్ ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం టికెట్ల కోసం పోటీ ప్రారంభమైంది. పార్టీల నాయకులు టికెట్లు చేజిక్కించుకోవడానికి అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన వై.ఎస్. షర్మిల కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు కూడా అయిన షర్మిల ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలుసుకున్నప్పటి నుంచి ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే వదంతులు వ్యాపించాయి. సహజంగానే ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. సోనియా గాంధీ కుటుంబానికి, షర్మిల కుటుంబానికి మధ్య చాలాకాలంగా పచ్చగడ్డి వేస్తే మండుతున్నప్పటికీ, ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడమన్నది కాంగ్రెస్ నాయకత్వానికి, షర్మిల పార్టీకి లాభసాటి వ్యవహారంగానే కనిపిస్తోంది. షర్మిల రాజకీయాలకు కొత్తేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఆమె పాదయాత్ర చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా ఆమె ‘బై బై బాబు’ అనే నినాదంతో తన సోదరుడి విజయానికి కృషిచేసి విజయం సాధించారు. అయితే, కుటుంబ కలహాల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసిన షర్మిల 2021 జూలైలో సొంతగా పార్టీ ప్రారంభించారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఆమె అనేక విధాలుగా శ్రమపడ్డారు. పోరాటాలు సాగించారు. పోరాటాల్లో విజయాలు సాధించినా, సాధించకపోయినా ఆమె రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోవడమే కాకుండా సుస్థిర స్థానం కూడా సంపాదించుకున్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో ఆమె రాజకీయాల్లో తానేమిటో నిరూపించుకోగలిగారు. నిజానికి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడమన్నది భవిష్యత్తులో ఆమెకు ఉపకరించే విషయమే. ఇప్పుడామెకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. కార్యకర్తల శ్రేణి కూడా ఏర్పడింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకూ వై.ఎస్. ఆర్ కుటుంబంతో ఆ పార్టీకి సాన్నిహిత్యం ఏర్పడడం వల్ల పార్టీ బలం పెరిగే అవకాశం ఉంది. ఏదైనా సాధించాలన్న ఆమె పట్టుదల పార్టీకి ఉపకరిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన అసాధారణ రాజకీయ నాయకుడు. ఇది ఎవరూ మరచిపోలేని విషయం. ఆయనకు ఈ రెండు రాష్ట్రాలలోనూ ఇప్పటికీ పలుకుబడి ఉంది. ప్రత్యేక గౌరవమర్యాదలున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడ మన్నది వై.ఎస్.ఆర్ విధేయ గణానికి నిజంగా శుభవార్తే. ప్రస్తుతం పి.సి.సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరోధులు సైతం దీన్ని స్వాగతిస్తారు. పార్టీలోని కొత్త నాయకులకు పోటీగా ఆమె వై.ఎస్.ఆర్ విధేయులకు ఒక బలమైన ప్రతినిధిగా మారే అవకాశం ఉంది. ఇది పార్టీలో రెండు అధికార కేంద్రాలను సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం ఐక్యత కోసం పాటుబడుతున్న కారణంగా షర్మిల పార్టీలోని రెండు వర్గాల మధ్య బ్యాలెన్స్ ను పాటించే ఉద్దేశంలో ఉన్నారు. అయితే, ఇక్కడ ఓ సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి కేంద్రీకరించాలని అధిష్ఠానం కోరే పక్షంలో ఆమె ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఆమె తన సోదరుడిపై విమర్శలు, ఆరోపణలు సాగించడానికి బహుశా అంగీకరించకపోవచ్చు. అంతేకాక, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నందువల్ల అక్కడ పార్టీని పునరుద్ధరించడానికి అవకాశాల ఉండక పోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి దాదాపు భూస్థాపితం చేసేశారు. సోదరుడిని ఢీకొనడానికి ఆమె ఎటువంటి ప్రయత్నం చేసినా ఆమె విశ్వసనీయతే దెబ్బతింటుంది. తన సోదరుడిని జైలుకు పంపిన పార్టీతో ఆమె అంటకాగడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నచ్చకపోవచ్చు. అంతేకాక, ఆమె ఏ ప్రయత్నం చేసినా తన సోదరుడి ఓట్లే చీలిపోతాయి. దీనివల్ల అక్కడి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ లాభపడుతుంది. దీని పరిణామాలు దీర్ఘకాలంలో ఆమెను దెబ్బ తీయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News