ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. ఐడిఓసిలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురుపూజోత్సవాన్ని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ లతో కలిసి కలెక్టర్ ఘనంగా నిర్వహించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలన్నారు. ప్రతి విద్యార్థి ఒక మట్టి ముద్ద లాంటివారని శిల్పంలా మార్చే బాధ్యత ఉపాధ్యాయునిదేనన్నారు.
మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే… జ్ఞాన జ్యోతిని వెలిగించేది మాత్రం…గురువులేనని మరచిపోరాదన్నారు. జిల్లాలో 4వేల ఉపాధ్యాయులు ఉన్నారని, వారి చేతులలో లక్ష మంది విద్యార్థుల భవిష్యత్తు ఉందన్నారు. సభ్య సమాజం కళ్ళు ఎత్తుకొని తిరిగేలా తరతరాలకు మూలాలుగా ఉపాధ్యాయులు నిలవాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలలో అక్షరాస్యత తక్కువగా ఉన్నందున నిరక్షరాస్యతను పారద్రోలేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్య ద్వారానే సమూలమైన మార్పు చూడగలుగుతామని అందుకు స్ఫూర్తి పొందిన వారి కథలు విద్యార్థులకు వివరించాలన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ..ఉపాధ్యాయుల పట్ల అపారమైన గౌరవం ఎల్లప్పడికి ఉంటుందన్నారు.నేను ఒక ఉపాధ్యాయుడు నేనని ఉద్యోగ ప్రాతిపదికగానే ఉపాధ్యాయ వృత్తి లోకి వస్తామని ఆ వృత్తిలో రాణించగలిగినప్పుడే చరితార్ధులమౌతామన్నారు. ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుని అనుసరిస్తాడని ఉపాధ్యాయుడు ఏ తీరుగా ఉంటే ఆ తీరుగా తాను కూడా ఉండాలని తపిస్తాడని ఇది ఉపాధ్యాయులు మరిచిపోరాదన్నారు. జన్మనిచ్చిన తల్లి ప్రేమనందిస్తే తండ్రి క్రమశిక్షణ అందిస్తాడని గురువు జ్ఞానాన్ని అందిస్తాడు అన్నారు. చదువు ద్వారానే విషయ పరిజ్ఞానం అలవడుతుందని శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ప్రతి విద్యార్థిని ప్రశ్నించే స్థాయికి తీసుకురావాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థి హృదయంలోని అంతర్మమదనాన్ని గుర్తించి సరిచేసినప్పుడే చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటాడని తెలియజేశారు.
మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని పిల్లలలోనే తనను చూసుకోవడం ఉపాధ్యాయుడు మొదలుపెడితే తల్లిదండ్రుల కన్నా మిన్నగా భావిస్తాడని అన్నారు. ఉపాధ్యాయుడు బోధనలో ఒక ఆశయం లక్ష్యంతో కూడిన శక్తిని విద్యార్థికి అందించగలిగినప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. విద్యార్థిని తనలో చూసుకుని మురిసిపోయే ఉపాధ్యాయులు నేటికీ ఉన్నారని అటువంటి ఉపాధ్యాయ వృత్తికి కళంకం తేరాదన్నారు. ఉపాధ్యాయుడు అంటే అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతూ, జ్ఞానమనే వెలుగులోకి తీసుకోవచ్చేవాడని అర్థం అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వింత పొంతలను తొక్కుతున్నదని విద్యార్థి ని సక్రమ మార్గంలో పెడుతూ, సన్మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయుల భుజస్కందాలపై ఉందన్నారు.
దొంగతనాలు చేసే వాల్మీకి సైతం మహర్షిగా మారాడని ఉపాధ్యాయులకు గుర్తు చేశారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను అతిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమాదేవి, విద్యాశాఖ అధికారి రామారావు, శ్రీరాములు, బుచ్చయ్య, సుధాకర్, ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.