హుస్నాబాద్ పట్టణంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ… హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయం..ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాలి అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల సందర్బంగా రేపు 6వ తేదీ బుధవారం రోజు ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నట్లు తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయనుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పకుండా ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.రోజు రోజుకు శ్రుతి మించుతున్న ప్రతిపక్ష పార్టీల దుర్మార్గ చర్యలను ఎండ గట్టి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సిద్దం కావాలని,ఎప్పటికప్పుడు ప్రజలతో మమైకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కేజీ నుండి పీజీ ఉచిత విద్య, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. శరవేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని తెలిపారు. గ్రామస్థాయి నుండి ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేసి మూడోసారి హ్యాట్రిక్ విజయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.