Tuesday, October 1, 2024
Homeఓపన్ పేజ్Kaloji Jayanthi: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కాళోజీ

Kaloji Jayanthi: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కాళోజీ

అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు: కళోజి

‘కాళోజీ’గా ప్రసిద్ధిగాంచిన కాళోజీ నారాయణరావు అసలు పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి – అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. వీరి పూర్వీకులు మహారాష్ట్ర నుండి వచ్చి వరంగల్‌ జిల్లాలోని మడికొండలో స్థిరపడ్డారు. రంగారావు, రామబాయమ్మ దంపతులకు కాళోజి 1914 సెప్టెంబర్‌ 9న జన్మించారు. కాళోజీపై తన తల్లి ప్రభావం ఎక్కువగా పడింది. ఆమెకు కులాల పట్టింపు లేదు. అందరిని ఒకే విధంగా చూసేది. ఆ సంస్కారమే కాళోజీకి అబ్బింది. చిన్నపుడు విన్న పురాణాలు, రామాయణం మరియు ఇతర సాహిత్య, సాంస్కృ తిక కార్యక్రమాలు కాళోజీ వ్యక్తిత్వం పైన బలమైన ముద్ర వేశాయి. 1939లో కాళోజీ ’లా’ విద్యను పూర్తి చేశాడు. విద్యార్థిగా ఉన్నపుడే అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాలనే బలమైన కాంక్షతో వందేమాతర ఉద్యమం, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా అనుభవించాడు. గాంధీజీ ఆలోచన విధానాలను ఆకళింపు చేసుకున్న కాళోజీ చట్ట వ్యతిరేకంగా ఏం జరిగినా ప్రశ్నించేవాడు.
అన్యాయాన్ని ఎదిరించి, ప్రజల పక్షం నిరంతరం పోరాటం చేస్తూ తన రచనల ద్వారా ’ప్రజాకవి’గా వెలుగొందాడు. తెలంగాణ భాష కోసం, యాస కోసం అవిశ్రాంత పోరాటం చేసిన తెలంగాణ తొలి పొద్దు కాళోజీ. నిర్మొహమాటం, ఆత్మీయత, ప్రశ్నించే స్వభావం కాళోజీ సహజ లక్షణాలు. కులం, మతం, పార్టీలు ప్రధానమైనవి కావని బతుకు మాత్రమే ప్రధానమైనదని బలీయంగా విశ్వసించిన మహోన్నత వ్యక్తిత్వం కాళోజీది. అవినీతిపై తన అక్షర తూటాలను ఎక్కుపెట్టిన ఆయుధం కాళోజీ. ప్రజల గొడవే తన గొడవని భావించి ’నా గొడవ’ అనే కవితా ఖండికను రచించి వర్గ వ్యవస్థలోని వైరుధ్యా లను కళ్ళకు కట్టినట్లు చూపిన గొప్ప మానవతావాది కాళోజీ. తెలం గాణ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాళోజీ ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్‌ సభ్యుడిగా కూడా ఎన్నికైనాడు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అరెస్టు కాబడినాడు. తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనిగా నిలిచిన కాళోజీ తెలంగాణ ఇస్తే నష్టం ఏంటని గొంతెత్తి ప్రశ్నించాడు. తెలంగాణ భాషను, యాసను గౌరవించాలని అన్నాడు. పలుకుబడుల భాష ఉండాలని ఎలుగెత్తి చాటాడు. ప్రజా నాయకుడిగా ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం కలిగిన ప్రజాస్వామ్య వాది కాళోజీ. ప్రజాకవిగా ఎనలేని కీర్తి గడించిన కాళోజీని భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. తన బతుకునంత తెలంగాణకు ధారపోసి అక్షరమనే ఆయుధాలతో ప్రజలలో చైతన్యం కలిగింపడానికి మానవతావాదంతో కూడిన కవి త్వం రాసి ప్రజాకవిగా గుర్తింపు పొందిన మహోన్నత వ్యక్తి కాళోజీ. సమైక్య రాష్ట్రంలో మరుగున పడిపోయిన మహనీయుడు కాళోజీ. ఆంధ్ర రాష్ట్ర కవులకు ఇచ్చినంత గుర్తింపును కాళోజీకి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కాళోజీ జయంతిని ‘తెలంగాణ భాషా దినోత్సవం‘గా ప్రకటించడమే కాకుండా కాళోజీ పేరు మీదుగా పురస్కారాలను అందజేయడం ఆయనకు ఘనమైన నివాళిగా చెప్పవచ్చు. 2002 నవంబర్‌ 13న ఆయన మరణించిన ప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణ రావు.
– కందుకూరి భాస్కర్‌
9703487088
(నేడు కాళోజీ జయంతి)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News