వరంగల్ పట్టణానికి చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గురించి తెలియని వ్యక్తి తెలుగు నాట ఉండకపోవచ్చు. సాహిత్యాభిమానులు, సాహితీవేత్తలకే కాదు, అది సామాన్య వ్యక్తికి కూడా ఆయన చిరపరిచితుడు. తెలంగాణ ఉద్యమం పుట్టకముందు నుంచే ఆయన తెలంగాణ ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. తెలంగాణ ప్రజల కష్టనష్టాలపై అనేక పోరాటాలు, ఉద్యమాలు సాగించిన కాళోజీ నారాయణ రావు (కాళోజీ, కాళన్నగా సుపరిచితులు) ఏనాడూ ఉద్యమ నాయకుడన్న ముద్రను వేసుకోలేదు. ఉద్యమ కార్యకర్తగానే తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. ఒక సాహితీవేత్తగా కలం ఝళిపిస్తూనే, ఒక పోరాటవాదిగా కత్తి కూడా అంతే సమర్థవంతంగా ఝళిపించారు. 1914 సెప్టెంబర్ 9న జన్మించి 2002 నవంబర్ 13న కన్నుమూసిన కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాం రాజా కాళోజీ ‘నా గొడవ’ పేరుతో వెలువరించిన కవితా సంకలనం తెలంగాణ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిందనడంలో సందేహం లేదు.
ఈ అపూర్వ, అద్వితీయ, అపురూప కవితా సంకలనం తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమానికి ప్రతిధ్వని అని చెప్పవచ్చు. అది రాజకీయ, సామాజిక చైతన్యాల సమాహారమని పలువురు సాహితీవేత్తలు ‘నా గొడవ’ను సమీక్షించడం జరిగింది. ప్రజల హక్కుల కోసం జీవితాంతం తపన పడిన ఈ ప్రజాకవి మొదటి నుంచి వరంగల్ పట్టణంలో నిరాడంబరంగా, సామాన్య ప్రజానీకంలో ఒక వ్యక్తిగా జీవించి, తాను ప్రవచించిన ప్రతి సిద్ధాంతాన్ని ఆచరించి చూపారు. ఆయన ఏ ఉద్యమం నడిపినా, ఏ కవిత రాసినా, ఏ సాహితీ ప్రసంగం చేసినా తెలంగాణ ప్రజల హక్కులను ప్రతిబింబించడానికే అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తనను తాను ప్రజావాదిగా అభివర్ణించుకున్నారు. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ.
మొదటిసారిగా ఆయన నిజాం దమననీతికి, అరాచకానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం, గళం ఎత్తారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్న కాళోజీ తెలంగాణకు సంబంధించిన ఉద్యమాల్లో విరివిగా పాల్గొనడం జరిగింది. ఆయన 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ను పొందడం జరిగింది. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది. వరంగల్ పట్టణంలో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. హన్మకొండ పట్టణంలో ఆయన పేరు మీద కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
కాళోజీ నారాయణ రావును సాటి సాహితీవేత్తలు, ఉద్యమకారులు తెలంగాణ తొలి పొద్దుగా సంభావిస్తుంటారు. ఆయన రాసిన ‘నా గొడవ’కు ప్రజాదరణ పెరగడం చూసిన కాళోజీ తెలంగాణకు సంబంధించి తన మనసులో ఉన్న లక్ష్యాన్నిఆయన ప్రజలకు తేటతెల్లం చేశారు. ‘అన్యాయాన్ని ఎదిరిస్తే ‘నా గొడవ’కు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయంపై పోరాడినవాడే నాకు ఆరాధ్యుడు’ అని ఆయన చెప్పేవారు. తెలంగాణ ప్రజల తరఫున ఉద్యమం సాగించడమే ఊపిరిగా జీవించిన అసలు సిసలు ప్రజాకవి కాళోజీ నారాయణ రావు.
Kaloji ‘Na Godava’: కాళోజీ ‘నా గొడవ’ అజరామర కవిత్వం
నిజాం దమననీతికి, అరాచకానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం, గళం