Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్విలక్షణ కథనాల సమాహారం విశ్వపుత్రిక కలం అంతరంగం

విలక్షణ కథనాల సమాహారం విశ్వపుత్రిక కలం అంతరంగం

కథను నడిపించే తీరులో ప్రత్యేకమైన శైలి, సృజనాత్మకత హైలైట్

రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పలు మార్పులకు చోటు చేసుకొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు మనుషులను బానిసలుగా మార్చుకొని ప్రాచీన కాలంలో రాజులు ఎన్నో రాజ్యాలను ఆదిపత్యంలో ఉంచుకొని శాసించిన సందర్భాలు చరిత్రలో మనం వినే ఉన్నాం. తదుపరి అనేక పాలన విధానాల మార్పుల దిశగా స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం సాధించుకొన్న తరువాత నేడు మనిషి యాంత్రిక యుగంలో సామాజిక మాధ్యమాల ప్రభావం ఒకవైపు అయితే మర మనుషు (రోబో)ల ప్రభావం నేటి నుండి భవిష్యత్తు తరాలకు విస్తరిస్తూ పోయిన కొలది జరిగే అనర్ధాలను వివరిస్తూ కథలుగా విశ్వపుత్రిక కలంతో సమాజ మార్పు కోసం పరితపిస్తున్న హైదరాబాద్‌ వాస్తవ్యురాలు, విశ్రాంత ప్రభుత్వ అధ్యాపకురాలు డాక్టర్‌ పి.విజయలక్ష్మి పండిట్‌ చేస్తున్న కృషి చెప్పుకోదగినది.
చరిత్రలో, పురాణాలలో, వర్తమానంలో మానవ జీవితాలను పరిశీలించడం, పరిశోధించడం, అనుభవాలను, అనంత ఆవేశాలను కవితలు, కథలు, వ్యాసాలుగా తెలుగులో అక్షరీకరించడం రచయిత్రిగా తన ప్రత్యేకత. 1978 లో ప్రారంభమైన సాహితీ ప్రయాణం మరెన్నో కావ్యాలను సాహితీ ప్రపంచానికి, పాఠక లోకానికి అందించింది. ఊహలకందని కథనాలలో, భవిష్యత్తులో పిల్లల నుండి మొదలుకొని మురుసలి వరకు సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తన కథల ద్వారా తెలియజేస్తూ మనిషి మానవత్వాన్ని, బాధ్యతలను సాంప్రదాయాలని మరువద్దని హితువు చెబుతూ విజయలక్ష్మి తన కథలను ప్రత్యేకంగా నడిపించిన తీరు ‘రమ్య ద రోబో’లో అక్షరీకరించింది. నేటి ప్రపంచంలో ఒక గ్రహం నుండి మరో గ్రహంపైకి మనిషి పయనిస్తున్న తరుణంలో నాలుగు కూడలి మధ్యన ఉన్న నిమ్మకాయలను మాత్రం దాటడం లేదు. ఏ స్థాయిలో అయితే విజ్ఞానం క్షేత్రస్థాయిలో శిఖరాలను చేరుకుంటుందో అంతలో కొంత స్థానం ఇంకా మూఢనమ్మకాలపై కూడా మనిషి నమ్మకాన్ని ఇంకా వదులుకోనటువంటి సందర్భాలు మనం కళ్ళ ఎదుట చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా కొందరు మూఢ నమ్మకాలను నమ్మినట్లుగా పొరపాటున ఈ యాంత్రిక జీవితంలో మనిషి పడిపోయి రోబోలకు బానిసైతే ఎలా? ఒకసారి ఊహించుకుంటే… మనిషిలో బద్ధకం, అలసత్వం, మని షిపై మనిషికి నమ్మకం లేకపోవడం, త్వరితగతిన పనులను చేయాలనే ఉద్దేశం అయినా కావచ్చు! ఊహ ప్రపంచాన్ని నిజం చేసుకోవాలని కావచ్చు! కారణం ఏమి అయినప్పటికీ మనిషి యాంత్రికమై యంత్రాల నడుమ జీవితాన్ని గడిపితే ఏ విధంగా వైఫల్యాలను ఎదుర్కోగలుగు తామో ఆ భవిష్యత్తు చిత్రాన్ని మన కళ్ళ ముందు కనపరిచింది విజయలక్ష్మి.
‘రమ్య ద రోబో’ నందు కథ వస్తువులను ఎంచుకున్న తీరు ఒక వైవిధ్యంగా ఉన్నవి. అందులోని కథలు రక్తి కట్టిస్తూ పాఠకులకు మరెన్నో విషయాలను తెలియ జేయటంలో రచయిత్రికి అనేక విషయాలలో నిర్మాణాత్మక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న తత్వం, స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. అందరినీ ఆలోచింపజేస్తుంది. కథలో.. (రోబో చేసే పనులను పాత్రలతో చెప్పించడంలో భాగంగా)…..
కథలో ‘నా ఆఫీసులో బుక్స్‌, ఫైల్స్ను వాటి స్థలాలలో పెట్టడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, లెటర్లు, డ్రాఫ్టులు టైప్‌ చేయడం మొదలయిన పనులు చేస్తుంది. నీవు అమెరికా వెళ్లినపుడు అమ్మ నాన్నకు, నాకు సహాయం చేయడం‘ అని టేబుల్‌ మీద ఏదో వెతుకుతున్న రాముని ‘నేను లేనప్పుడు మీకెలాంటి సాయం అంది లక్ష్మి నీవు లేనప్పుడు అప్పుడప్పుడు నా తలంటడం, వీపు రుద్దడం, స్నానమపుడు టవలు మరిచిపోతే అందివ్వడం, తలనెప్పయితే తల మర్దన చేయడం, భోజనం …. అంటూ అప్పచెపుతూ పోతున్నాడు రామ్‌.
‘అంతేనా ఇంకా ఏమయినా వున్నాయా మీకు రమ్య రోబో చేయవలసిన పనులు‘ అని లక్ష్మి ఘాటుగా అడ గ్గానే.., కోపంతో ఎర్రపడిన లక్ష్మి ముఖంలోకి చూసి టక్కు న ఆపేశాడు. రామ్‌ నవ్వుతూ…
ఇంకేమున్నాయి.. నాకిష్టమైన మిగతావన్ని.. నీవు లేనిదే నాకు లేవు లక్ష్మీ‘ అని లక్ష్మి చుబుకం పట్టుకుని, ‘నిన్ను ఉడికించాలని అలా అన్నాను లేవోయ్‌’ అన్నాడు రామ్‌.
ఈ మాటలు సందిగ్ధ వాతావరణంలోకి పాఠకుడిని ఆలోచింపజేస్తూ కొనసాగుతున్న కథ తీరులో చివరకు ఇదంతా కల అని తెలిసిపోతుంది. ఒకరకంగా నిజాన్ని తలపిస్తున్నట్టుగా మనిషి అంతరంగ భావాలను మరో విధంగా తెలియజేస్తూనే నిజ జీవితంలో రోబో ప్రభావం కలలో జరిగిందా నిజమై నిలిచిందా అలా కళ్ళ ముందు కదలాడిన సంభాషణలు.
2035… లో కథలో కథగా….. జయ్‌ స్కూల్లో తను వివరిస్తున్న భవిష్యత్తులో జరిగే ( ఫైవ్‌ జి ) ఇంటర్నెట్‌ స్పీడ భవిష్యత్తులో రూపాంతరాలు చెంది అత్యంత వేగంగా డేటా ఒకచోటి నుండి మరోచోటికి ట్రాన్స్రేఫరేషన్‌ జరు గుతుందని రోబోల వినియోగం అధికంగా ఉండడం వల్ల ఆ తరుణంలో మరిన్ని వాహనాలు కూడా అవసరం ఉపయోగం ఉండదని హోం సర్వీసెస్‌ అధికంగా అవడం జరుగుతుందని ఇంటర్నెట్‌, రోబోల వినియోగం అధికమవడం వలన భవిష్యత్తులో జరిగే అనేక పరిస్థితులను తెలియ జేసింది. ఈ కథలో కథగా అమ్మమ్మ పాత్ర ద్వారా చెప్పిన దానిలో చాలా ఏళ్ల క్రితమే ఊహించి చెప్పిన మార్పులు కొన్ని వస్తాయనటంలో సందేహించనవసరం లేదు. వాతా వరణ మార్పులు పెరిగి ఉష్ణోగ్రత పెరిగిపోవడం, నీరు లేక జనన నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పడం, నివాసాలన్నీ అండర్‌ గ్రౌండ్‌లో ఏర్పడటం, అంతేకాక కొన్ని మరో గ్రహం పైకి జనావాసాలు ఏర్పడటం ప్రయోగాలు జరుగుతాయని వివరించిన తీరు ఉత్తమంగా ఉంది.
విశ్వం పిలిచింది కథలో….
అది ? నా జీవిత కల శశి. నేను చిన్నప్పుడు మా అమ్మ ఒడిలో కూర్చోపెట్టుకుని చంద్రున్ని చూపిస్తూ ‘ ఆ.. చల్లని చంద్రుడు నీ స్నేహితుడు నాన్నా.. నీవు కూడా వెళతావా చంద్రుని పైకి’ అని చంద్రుని తలంపై అడుగిడిన వ్యోమ గాముల గురించి చెప్పేది. ఆ మాటలు నాలో అన్నంతో పాటు జీర్ణమయి నా శరీర ధాతువుల్లో కలిసిపోయి నా జీవన ధ్యేయంగా మిగిలిపోయాయి చంద్రుని పైకి వెళ్ళా లనే కోరిక బలంగా ఉండిపోయింది. నా కోరికను, దృఢ సంకల్పాన్ని ఈ విశ్వం గ్రహించి నాకు తోడయి చంద్రుడి తో ఆ అపురూప అద్భుత అనుభావాన్నిచ్చింది. ఆ నా బాల్యపు స్మృతులు చంద్రునితో కలలాంటి అనభవంతో నా వెన్నంటి నడిపించింది శశి’ అన్నాడు కొడుకుతో అభిదీప్‌.
చంద్రమండలంపై జరిగే ఆసక్తికరమైన సంఘటన లతో కూడుకున్న ఈ కథ అక్కడి పరిస్థితులను తెలియ జేస్తూ అభిదీప్‌ చంద్రుడితో మమేకమై ఒక కొత్త అను భూతిని తెలియజేస్తూ ఊహాజనితమైన కథను కళ్లకు కట్టి నట్లుగా రచయిత్రి తెలియజేసింది.
రమ్య ద రోబో ( విశ్వపుత్రిక కథలు)లో ఒక్కో కథకు ఒక్కో ప్రత్యేకతతో రచయిత్రి 12 కథలను పొందుపరచ బడినది. ఇట్టి కథా సంపుటిలో రచయిత్రి విజయలక్ష్మికి పరిజ్ఞానం, విద్యతో కూడిన అపారమైన జ్ఞానంతో అనేక కొత్త కొత్త కథా వస్తువులను ఎంపిక చేసుకుని కథను నడిపించే తీరులో ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకొని రచన కొనసాగించడం తన సృజనాత్మకతకు నిదర్శనంగా రమ్య ద రోబో కథా సంపుటి నిలిచింది. ఇలాంటి ఆలోచనాత్మక కథా సంపుటాలు తన కలం నుండి మరిన్ని వెలుబడాలని కోరుకుంటున్నాను.
డా.చిటికెన కిరణ్‌ కుమార్‌
ప్రముఖ రచయిత, విమర్శకులు
9490841284

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News