Weather Update: తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణుకుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో చలికి తోడు ఈదురు గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కమాటలో చెప్పాలంటే చలిపులి తెలంగాణపై పంజా విసురుతోంది.
మంగళవారం తెల్లవారుజామున ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు(యూ) మండలంలో 9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది రాష్ట్రంలోనే అత్యల్పం కావడం గమనార్హం కాగా.. పడిపోయిన ఉష్ణోగ్రతలకు తోడు ఈదురుగాలులు వీస్తుండడం ప్రజలను వణికిస్తుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత మరింత పెరగడంతో హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
నగరంలో మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని తెలిపింది. మరోవైపు, పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తుండడమే రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడానికి కారణమని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.