Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Feminism literature: న్యాయం కోసం చేసే పోరాటమే 'సంఘటిత' స్త్రీవాద కవిత్వం

Feminism literature: న్యాయం కోసం చేసే పోరాటమే ‘సంఘటిత’ స్త్రీవాద కవిత్వం

విస్మరణను ఛేదించే ప్రయత్నం అంటూ…. అనాదిగా సకల వివక్షలకు గురి అవుతున్న స్త్రీ జాతికి, వాటి తరఫున బాధ్యతతో ఐక్యంగా అంకిత భావంతో 115 మంది కవయిత్రులతో పొందుపరచబడిన సంఘటిత సంకలనాన్ని సాహితీ లోకానికి అందించారు సంపాదకురాలు డాక్టర్ జ్వలిత. 2010 సంవత్సరం తర్వాత వచ్చిన స్త్రీవాద కవిత్వంను భద్రపరచడంలో భాగమే సంఘటిత ఉద్దేశమనీ, ఈ ప్రయాణంలో స్త్రీవాద కవిత్వం అంటే చర్విత చర్వణంగా భావించే విమర్శకులకు ఇందులో కొన్ని కవితలు ‘మేమున్నాం ఇక్కడ’ అని కొందరి తరపున సాక్ష్యం ఇస్తాయని సంపాదకురాలు జ్వలిత తన మాటగా తెలియజేసినది. సంకలనంలో….. ‘ఆ చిత్రం ఎప్పటినుండో అక్కడే ఉంది/ యుగయుగాలుగా తరతరాలుగా/ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు/ సాక్షిభూతమై” అంటూ కవయిత్రి అత్తలూరు విజయలక్ష్మి రాసిన ‘చిత్రం’ కవితతో మొదలుపెట్టిన ఈ కవితా సంకలనం “నేను స్వేచ్ఛని/ ఒక కాంక్షని/ ఒక కామనని/ చెలికాడా/ నీ అంతరాంతరాల్లో / దోబూచులాడే కోరికల రూపికను/ స్వేచ్ఛ ప్రణయ జీవనం మనది” అంటూ కవయిత్రి హిమజ రాసినటువంటి ‘లివింగ్ టుగెదర్’ కవితతో ముగిసింది. సంఘటిత పుస్తక సంకలన సంపాదకురాలు కవయిత్రి జ్వలిత రాసిన ‘తెగబడిన మాటల ఆడది’ కవితలో ‘అఖండ వ్యాకుల సంద్రాల నుండి జనించిన ప్రశ్నలు/ అజాతశత్రువు అంటే ఏమిటి?/ మనిషిలా పెళుసు వారిన మడి చీరలు/ మళ్ళీ మళ్ళీ పాత కంపుకొట్టే పట్టుచీరల పెళ్లి చూపులు/ నువ్వు నాకు నచ్చావ్/ నీ ఆస్తి మీ అక్కకు మరీ నచ్చిందనే సినిమాటిక్ బావలు/ ఈ రాజకీయ ఎత్తుగడైనా.. ఏ అణిచివేతల పన్ను గడలైనా/ ఏ ఆదివాసీలపై అక్రమమైన ఉగ్రవాదమో- ఉన్మాదమో/ మరేదైనా చెట్లను వదిలి/ ఎప్పుడూ పూలను మాత్రమే నడపడం ఎందుకు?” అంటూ సంఘంలో స్త్రీలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు గురించి ఆవేదనగా తన కవనంలో సంధించింది. తరతరాలుగా స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ ఒక పరిష్కారం మార్గాన్ని శాశ్వతంగా అందించాలని ప్రయత్నం చేసిన కవయిత్రి కవనంలో చివరగా “యుద్ధంలో లైన్ ఆఫ్ ఫైర్ లో నిలబడేది/ ఎప్పటికీ నిలబడుతున్నది/ నేను మాత్రమే కదా…?” అంటూ స్త్రీ యొక్క నడక నడత ఈరోజు సమాజంలో పెను సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి విషయాలను కూలంకుషంగా చెప్పగలిగింది. -డా. కొండపల్లి నిహారిణి రాసిన “దగ్ధ హృది” కవితలో “రాయని నిర్వచనాల మరణశాసనాల్ని లిఖిస్తూ/ చాపచుట్టలో వాడి పాపపు శవాన్ని ఊహిస్తాను/ నేను కాలాన్ని.. తిరిగిరాని జీవితాన్ని/ నిస్తేజాన్ని సహించని అమ్ముల పొదిని/ అందాల వెన్నలలు లేని అడవి దగ్ధహృదిని !” అంటూ మానవజాతి సిగ్గుపడేలా కొందరు మనుషులు మృగాలై అభం శుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ కవయిత్రి ఈ కవనంలో అత్యాచారానికి కారకులైన దుర్మార్గులను చాప చుట్టలో వాడి పాపపు శవాన్ని ఊహిస్తానంటూ ‘దగ్ధ హృది’ శీర్షికతో రాసిన కవనం ఈ సంఘటిత సంకలనంలో ప్రత్యేకంగా ఆవేదనను వ్యక్తం చేసింది, ప్రతి పాఠకుడిని, సాహితీ మూర్తులను ఆలోచింప జేసినది. అనిశెట్టి రజిత, నాంపెల్లి సుజాత, నస్రీన్ ఖాన్, శ్రీ భాష్యం అనురాధ, తోట నిర్మలా రాణి, సుష్మ, గొర్తి వాణి శ్రీనివాస్, రమాదేవి బాలబోయిన మొదలైన కవయిత్రులు విభిన్న అంశాలతో ప్రత్యేకంగా కవితలు రచించారు. మేకల స్వప్న రాసిన ‘విధి వంచిత’ కవితలో “ఆమె ఒక వెన్నెల శిల్పం-కరిగిపోయే కాంతి దీపం/ రంగుల కలలన్నీ మెరుపు కలలై/ జీవితమంతా సునామీ సుడిగుండమైంది/ కలల కాటు నుండి కన్నీటి బావిలోకి జారిపడితే/ మదన పడ్డ మనసుని పైకి లాగే వారే కరువు/ మనసుకి మసి పూసి బ్రతుకుకి వెన్నెల వర్ణాలద్దుకున్నారు..!!’ అంటారు. సన్నాయిల కృష్ణవేణి రాసిన ‘అమ్మనై అడుగుతున్నా..’ కవితలో “అమ్మనై అడుగుతున్నా/ అమ్మకొడుకా ఆలోచించు/ రాఖీగట్టిన చెల్లకు రక్షగా నిలబడతవ్/ మరి రోడ్డు మీద చెల్లినెందుకు రోతకూతలు కూస్తవ్” అంటూ నిలదీశారు. సిద్ధ గాని భాగ్యలక్ష్మి రాసిన ‘ఆమెకు ఏమి తెలియదా?’. కవిత లో “ఎన్ని చుక్కలు ఎన్ని వరసలు పెట్టాలో తెలిసిన ఆమెకి/ వచ్చిన డబ్బులు దేనికెంత ఖర్చుపెట్టాలో తెలీదా/ ఈ చుక్కను ఆ చుక్కకి కలిపి/ మదిలోనే మెలికతిప్పే ఆమెకి/ సమస్యల సుడిగుండాలకి వ్యూహాలు తెలీదా/ అద్భుతమైన వంటలతో ఇంటిల్లిపాదిని/ ఆనందపరచగలిగిన ఆమెకి/ రకరకాల మనుషులతీరుతో రాణించలేదా?” ఆలోచించమంటారు. సరిత నరేష్ రాసిన ‘ఆమె కోరిక’ కవితలో “అన్నీ తానై అవనికి వెలుగైన/ ఆమెకు కావాల్సింది/ అవార్డులూ, రివార్డులూ కాదు/ శాలువాలూ, ప్రశంసా పత్రాలూ కాదు/ సన్మానాలూ, సత్కారాలూ కాదు/ అందలం ఎక్కించే అపురూప సంపదలూ కాదు/ కేవలం.. కాసింత ప్రేమ/ కూసంత గౌరవం” అంటూ వివరిస్తారు. సంధ్యా గొల్లమూడి రాసిన కవిత ‘జగన్నాథ రథచక్రాలు’లో “జగన్నాధుని చక్రానికి శీల ఎప్పుడో వూడింది/ పతితులారా, భష్టులార../ దగాపడ్డ అమ్మలార ముడివీడని అక్కలార/ ఏడవకండని నే చెప్పను/ మరి ఎందుకు వెరుపునీకు ?/ రాదు రాదు రధచక్రం../ ఇరుసువిరిగి మూలపడిన రధచక్రం/ నిలబడు నీవే నిజమైన ఇరుసుగ../ నడపాలి వడివడిగ నీ జీవిత చక్రం/ ఎదురులేని బతుకు బండి చక్రం” అంటూ మార్గదర్శనం చేస్తుంది. పై కవితల్లో కవితలు రాసిన, ఎంచుకున్న కవితా వస్తువులు భావోద్వేగమైనటువంటి నిత్యం సమాజంలో అనేక సందర్భాలలో అందరికీ కళ్ళ ఎదుట కనిపించినవి, జరిగినవి, కొన్ని ఉమ్మడి కుటుంబాలలో, పేద తరగతి కుటుంబాలలో కూడా అనేక ఆర్థిక ఇబ్బందులను కవికోణంతో చూసి అక్షరబద్ధం చేయగలిగారు. శైలజ మిత్ర రాసిన ‘చీకటి దీపస్తంభం’ కవితలో “ఆమెను చూస్తుంటే / కూలిపోయిన కట్టడం లోంచి/ తొంగి చూస్తున్న మొక్క గుర్తుకొస్తోంది/ బహుశా – ఆ మొక్కకు భూసారం/ ఆమెకు బతుకు సారం/ ఒకేలా అందినట్లు అనిపిస్తోందేమో” భూసారం బతుకుసారం అంటూ కొత్తదనంతో ఈ కవనం తెలియజేస్తున్నది. పురిమల్ల సునంద రాసిన ‘ఒక్కసారి నీ మనో దర్పణం లోంచి’ కవితలో “ఏ తోటలో వికసించిన పుష్పమో/ నీ హృదయ సీమలో పరిమళాలు నింపడానికి వచ్చింది/ ఏ ఇంటి గారాల పల్లవో ఆమె/ నీ జీవన గీతానికి చరణమై చేరింది/ ఏనాటి బంధమో ఆమె/ నిను లతలా అల్లుకొని అనుబంధంతో/ పెనవేసుకున్నది/ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆమె/ నీ నిండు నూరేళ్ళ జీవితం కోసం..” అనే ఈ కవనంలో స్త్రీ యొక్క పాత్ర లో భాగమైన భార్య గురించి తెలియజేస్తున్నది. మానవ జీవితంలో ఒక సాంప్రదాయపద్ధమైన పెళ్లి అనే అనుబంధంతో ఏకమై పలు విభిన్న కోణాలలో తన మనుగడ కొనసాగుతుందని తెలుపుటకు సాక్షాత్కరమైనది. డాక్టర్ పసుపులేటి నాగమల్లిక రాసిన ‘ఆమె ఆశాజీవి’ కవితలో “ఆమె ఆశాజీవిగ తనకు తానే గురువై/నిరాశలోని ఆశకై బంగారు భవితకు/ మౌనంగా బాటలు వేసుకుంటోంది/ తన ఆత్మాభిమానాన్ని గెలుచుకుని/ అందరినీ తలెత్తుకునేలా మలుచుకుంటోంది/ తనకు సాయం చేయకపోయినా/ తన సాధనకు అడ్డొచ్చి సాధించకండి !/ తనకు చేయూత నివ్వకపోయినా/ తన బ్రతుకుని చిద్రం చేయకండి/ తనను ఆశాజీవిగా గెలవనివ్వండి” అంటూ అభ్యర్థిస్తారు. నామని సుజనా దేవి రాసిన ‘అచ్చంగా ఆమెకే తెల్సు’ కవితలో “ఆమెకే తెల్సు.. అచ్చంగా ఆమెకే తెల్పు/ ఆర్ధిక అనురాగ ఎగుడు దిగుడు గతుకుల రోడ్డుపై/ సంసారపు బండి సాఫీగా సాగాలన్నా/ ఆటు పోట్లతో అలజడి సృష్టించే సంసార సాగరాన్ని/ కళ్ళవెనక కల్లోల సాగారాలున్నా తడబడక, నిలకడగా ఈదాలన్నా/ ఆమెకే తెల్సు.. అచ్చంగా ఆమెకే తెల్సు” అంటూ చాలీచాలని విధంగా ఆర్థిక పరిస్థితులుండే మధ్య తరగతి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, ఒక విధంగా స్త్రీ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఎదుర్కొన్న ఎన్నో బాధ్యతలను సమస్యలను తెలియజేసిన కవనాలు పైవన్నీ.. నెల్లుట్ల రమాదేవి రాసిన ‘యుద్ధం మాకు కొత్త కాదు’ కవితలో “దుఃఖం మాకు కొత్త కాదు/ అనాది కాలం నుండి/ అనేక హింసలకు ఒళ్లప్పగించి మోసిన వాళ్ళం మేమే/ కళ్లప్పగించి చూసిన వాళ్ళమూ మేమే” అంటూ ఆనాటి నుండి నేటి వరకు స్త్రీ పడుతున్న బాధలను తెలియజేస్తూ పరిష్కార దిశగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి, కఠినమైనటువంటి శిక్షలు నయవంచితులపై అమలు కాని సందర్భాలను అంతర్గతంగా తెలియజేసింది. వకుళ వాసు రాసిన ‘బంగారం’ కవితలో “బడిలో చదువుకునేటప్పుడు/ నాన్నా! పక్కింటి మామయ్య/ ముట్టుకుంటున్నాడే/ బంగారం అని పిలుస్తున్నాడే’/ అని చెప్పాలనుకున్నది – కానీ భయం/ చెబితే నాన్న కోప్పడతాడేమోనని” అంటూ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న అంతరాన్ని అర్థం చేసుకోక పిల్లలను పెంచే క్రమంలో వారి యొక్క సమస్యలను తెలియజేసిన కవనం ఇది. వంజారి రోహిణి రాసిన ‘అవును నేను చెడ్డదాన్నే’ కవితలో “పరువంటూ కన్నబిడ్డ బొట్టు తుడిచేసే/ కర్కోటపు నాన్నల వినాశనాన్ని కోరే/నేను చెడ్డదాన్నే/ ప్రేమించిందని కన్నకూతురి/ కుత్తుక కోసిన కసాయి తండ్రిని తిట్టిన/ నేను చెడ్డదాన్నే/ ప్రేమించలేదని అమ్మాయి ముఖాన్ని/ యాసిడ్ తో వికృతం చేసిన అగంతకుడిని శపించిన/ నేను చెడ్డదాన్నే” అంటూ కొందరు తెలిసి తెలియక, తెలిసి కొందరు ప్రేమ అనే ఊబిలో చిక్కుకొని ఒడ్డుకు చేరని సమయంలో ఒకవైపు కుటుంబంలో ఈ సమస్యను చెప్పుకుంటే ఎలా…? చెప్పుకోకపోతే మరి ఎలా..? అని కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో బాధ్యతలు అంటూ తల్లిదండ్రులు కన్న కూతురి యొక్క ఆవేదనను అర్థం చేసుకోకుండా విపరీత పరిణామాలకు దారి తీసిన సందర్భాలను తెలియజేసింది. మణి వడ్లమాని రాసిన ‘గెలిచిన మందారం’ కవితలో “అందాలతోటలో విరిసింది/ ఓ కన్నె మందారం!/ కళ్ళనిండా మధుర స్వప్నాలు మదినిండా తీయటి తలపులు/ కొంగులు ముడివేసిన జీవనసహచరుడితో అడుగులో అడుగు వేసుకుంటూ/ కొత్త ఆశలతో కోటికోర్కేలతో ఆనందంగా మెట్టినింట అడుగుపెట్టింది!” అంటూ స్త్రీ జీవితంలో పెళ్లి ప్రధాన భూమిక పోషిస్తుంది. పుట్టినింటి నుండి మెట్టినింటికి పయనమవుతున్న సమయంలో కోటి ఆశలతో ఒకచోటి నుండి మరోచోటికి తన గమనాన్ని కొనసాగుతున్న అత్యంత బాగోద్వేగమైనటువంటి మరెన్నో ఆశలతో కూడుకున్న వాతావరణాన్ని తెలియజేసిన కవనం ఇది. సంఘటిత కవితా సంకలనం నందు మొత్తం 115 మంది కవయిత్రులు స్త్రీవాదాన్ని అద్భుతంగా అక్షరీకరించారు. స్త్రీలలో ఉన్న సహజత్వాన్ని, వివిధ లక్షణాలను, స్త్రీ కుటుంబ పరంగా, వృత్తిపరంగా, సామాజిక రాజకీయంగా నేటి ప్రపంచానికి అందిస్తున్న సేవలను, స్త్రీ చేస్తున్న సేవలను గుర్తించి మనం స్త్రీని ఒక శక్తి స్వరూపిణిగా భావిస్తాము. స్త్రీ లోని విశేష లక్షణం ఏమిటని ఒకసారి పరిశీలిస్తే భూదేవికున్నంత సహనం అని చెప్పక తప్పదు.. ఆ లక్షణం ఎక్కడనుండో తను తెచ్చిపెట్టుకున్నది కాదు సహజసిద్ధంగా వచ్చినది మాత్రమే. ఈ సామాజిక పరిస్థితులలో ప్రకృతి పరంగా తనలో ఉన్న లక్షణం. ఆ ఓపికతో కూడిన స్త్రీ సాధించ లేనిది లేదు. అది సంసారం, రాజకీయం, సంఘసంస్కరణ, చదువు లతోపాటు , ఆరోగ్యం, శాస్త్రం, చట్టం మొదలగు ప్రధానమైనటువంటి విషయాలతో పాటు మనిషి విజ్ఞాన పరంగా చదువు వల్ల వచ్చే సామర్థ్యతలతో సాధించే కార్యాలే కాకుండా అనుభవం, ధైర్యం, తెలివీ, త్యాగభావం వల్ల వచ్చే యొగ్యతలతో సాధించే కార్యాలు ఇలా అనేకమైనటువంటి సందర్భాలున్నాయని అందరికీ తెలిసినదే. నిత్య అన్వేషిగా స్త్రీ తనని తాను సంస్కరించుకుంటూ ఇంటినీ పిల్లల్నీ, తన బాధ్యతలనీ, బరువుల్నీ, ఇరుగుపొరుగుల్నీ అన్నీ తనపై భారంగా ఒక తాటిమీద నడిపే శక్తి గలది. ఆసక్తి ఒక రకంగా చెప్పాలంటే దైవసంకల్పమా తనకు మరి ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్నార్థకమైనటువంటి సందిగ్ధం ప్రతి ఒక్కరి జీవితంలో చూసే ఉంటాం… సహోదరిగా, భార్యగా, తల్లిగా బాధ్యతలను నిర్వర్తించే శక్తి గలది స్త్రీ. సామజబంధంలో పెళ్లి అనే అనుబంధంతో పురుషుడితో ఏకమై కుటుంబ పరంగా మరెన్నో సేవలను చేస్తున్న అద్భుత శక్తి కలిగినది. సహజసిద్ధంగా స్త్రీ పంచి ఇచ్చే గుణం అధికంగా ఉంటుంది అని మనం గమనించవచ్చు . ఆహారం, సేవ, సంస్కారం, మంచిచెడుల విచక్షణా జ్ఞానం కుటుంబ సభ్యులందరికీ పంచిపెడుతూ పిల్లలని క్రమశిక్షణలో ఉంచుతూ భావి పౌరులుగా తీర్చి దిద్దగల నేర్పరి. ఒకరకంగా యంత్రంగా తను అనునిత్యం పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీ గురించి మరెన్నో మనం చూసినదే ప్రతి తల్లి నుండి బిడ్డ పొందే ఆనందం ప్రత్యక్ష సాక్ష్యమే అని చెప్పవచ్చు. తన త్యాగశీలతను గురించి కళ్లకు కట్టినట్లుగా కూడా బాధ్యతలని పూర్తి చేస్తూ కూడా తనని తాను అబల కాదు సబల అని నిరూపించుకోగల సమర్థురాలు అని చెప్పడానికి మరెన్నో ఉదాహరణలున్నాయి. ఝాన్సీ లక్ష్మీబాయి, మథర్ థెరీసా, ఎనీ బిసెంట్, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఇలా మరెందరో ఎటువంటి విషమ పరిస్థితులను ఎదుర్కొంటూ తమని తాము సబలలుగా నిరూపించుకున్నారో మనం వారి యొక్క వృత్తి,బాధ్యతలు, ఇతర పదవులు కానివ్వండి వారు నిర్వహించిన పరిపాలనలను కానివ్వండి చూసి తెలుసుకోవచ్చు. కిరణ్ బేడీ , జయలలిత, మాయావతి, మమతా బెనర్జీలు, అలాంటి వారు కూడా ఉదాహరణలే కదా. ప్రతి పరిపక్వత చెందిన పరిపూర్ణమైన పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని తెలిసనదే. ఆ స్త్రీ వెనకాల దాగి ఉన్న ఓర్పూ, నేర్పూ, బాధ్యతా, త్యాగం అనేవి దాగి ఉన్నందున పురుషుడు ఒక సాధకుడవుతున్నాడని చెప్పవచ్చు. ఈ ఆధునిక ప్రపంచంలో ఎన్నో ఆటుపోట్లను ఎదురుకోంటూ తమని తాము రక్షించుకుంటూ తను ఇంటినీ తన పిల్లలనీ మాత్రమే కాకుండా తన లోని సంస్కారాన్ని సంప్రదాయాలనీ కూడా రక్షించు కుంటూ ముందుకు పోతున్న ప్రతి స్త్రీ మూర్తి కి నమస్సులు తెలియజేస్తూ ఇలాంటి కనువిప్పు కలిగించే రచనలైన సంఘటిత కవితా సంకలనం నందు నేటి సమాజంలో కుల,మత,వర్గ,ప్రాంతీయ విభేదాలను ప్రతి ఒక్కరూ వదిలిపెట్టాలని, ప్రజాస్వామిక నైతికత దృక్పథంగా సంఘటిత సంకలనం నందు భాగస్వాములైన నేటి కవయిత్రులైన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ…. సంపాదకురాలైన కవయిత్రి జ్వలిత ఆధ్వర్యంలో మరిన్ని కావ్యాలు వెలుపడాలని ఆశిస్తూ అక్షరాభినందనలు తెలియజేస్తున్నాను.

- Advertisement -

డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్, ప్రముఖ రచయిత,

విమర్శకులు సభ్యులు, ఐ. బి. ఆర్. ఎఫ్

సెల్ 9 4 9 0 8 4 1 2 8 4

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News