Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Tamil Politics: తమిళనాట సరికొత్త రాజకీయ బంధాలు

Tamil Politics: తమిళనాట సరికొత్త రాజకీయ బంధాలు

బీజేపీ మద్దతు వల్లే అవినీతి కేసుల్లో అన్నా డీఎంకే మంత్రులు చిక్కుకోలేదు

చాలాకాలంగా బీజేపీతో సన్నిహితంగా, సామరస్యంగా ఉంటూ వస్తున్న అన్నాడి.ఎం.కె అకస్మాత్తుగా బీజేపీతోనూ, ఆ పార్టీ సారథ్యంలో ఉన్న నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌.డి.ఏ)తోనూ తెగతెంపులు చేసుకుంది. ఎన్‌.డి.ఏలో జనతాదళ్‌ (సెక్యులర్‌) చేరిన కొద్ది రోజులకే ఈ పార్టీ ఈ కూటమి నుంచి నిష్క్రమించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమకు బీజేపీ మిత్రపక్షమేమీ కాదనే సూచనను ఈ పార్టీ కొద్ది రోజుల క్రితమే అన్యాపదేశంగా చెప్పింది. అయితే, లోక్‌ సభ ఎన్నికల ముందు పొత్తు కుదర్చుకునే అవకాశం ఉందని కూడా సూచించింది. ఢిల్లీలో కొందరు సీనియర్‌ బీజేపీ నాయకులను కలుసుకోవడానికి అన్నాడిఎంకె ప్రతినిధి వర్గం ఒకటి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. 2016లో అన్నాడిఎంకె అధినేత జయలలిత మరణం తర్వాత ఈ రెండు పార్టీల మధ్య దాదాపు ఒక విడదీయ రాని బంధం ఏర్పడింది. అనేక కీలక సందర్భాలలో ఈ ప్రాంతీయ పార్టీ కేంద్రంలో బీజేపీకి గట్టి మద్దతు ఇస్తూ వచ్చింది. 2018 జూలైలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి అండగా నిలబడింది. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో మద్దతునిచ్చింది. పౌరసత్వ బిల్లు విషయంలో కూడా మద్దతు ప్రకటించింది.
అంతేకాదు, అన్నాడిఎంకె ముఖ్యమంత్రి ఎళప్పాడి పళనిస్వామి 2020లో కేంద్రం చేపట్టిన మూడు వ్యవసాయ బిల్లులకు కూడా సహాయ సహకారాలు అందజేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న నినాదానికి కూడా తమ మద్దతు ప్రకటించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వ మద్దతే లేకుండా ఉంటే పలువరు అన్నాడిఎంకె మాజీ మంత్రులు అవినీతి కేసుల్లో జైల్లో ఊచలు లెక్కబెడుతూ ఉండేవారనే అభిప్రాయం తమిళనాడులో నెలకొని ఉంది. బీజేపీకి ఈ అన్నాడిఎంకె పార్టీ ఒక నమ్మినబంటుగా మారిందనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఈ అభిప్రాయం నుంచి బయటపడాలనే ఉద్దేశంలో అన్నాడిఎంకె ఉందని అర్థమవుతోంది.
అయితే, ఈ రెండు పార్టీల మధ్యా మళ్లీ సయోధ్య కుదిరే అవకాశం లేకపోలేదు. గత 25వ తేదీన అన్నాడిఎంకె అగ్రనాయకత్వం జరిపిన ఒక కీలక సమావేశంలో, వక్తలంతా రాష్ట్ర బీజేపీ మీద మాత్రమే తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అణ్ణామలై పేరును ఈ సమావేశంలో ఎవరూ ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు కానీ, ‘జరిగింది చాలు’ అన్న అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర బీజేపీ తమ పార్టీ సీనియర్‌ నాయకులను సైతం చిన్నచూపు చూస్తోందని పలువురు అన్నాడిఎంకె నాయకులు భావిస్తున్నారు. అన్నాడిఎంకెను పక్కన పెట్టి చిన్నా చితకా పార్టీలకు ప్రాధాన్యం ఇస్తోందని పార్టీ నాయకులు బీజేపీ మీద విమర్శలు గుప్పించడం జరిగింది. ఈ ఎడబాటు ప్రభావం ఎన్నికల మీద ఎలా ఉండబోతోందో ఇప్పుడే చెప్పలేం కానీ, త్రిముఖ పోటీ ఏర్పడితే మాత్రం డిఎంకె కూటమి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
తమిళనాడులో ఈ పరిణామాల దృష్ట్యా డి.ఎం.కె కూటమికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధిక వాటా కోసం డిఎంకెపై ఒత్తిడి తీసుకు వస్తున్న కొన్ని భాగస్వామ్య పక్షాలు ఇప్పుడిక అన్నాడిఎంకె కూటమి వైపు మొగ్గు చూపించే సూచనలున్నాయి. ఇప్పుడిక పాలక డిఎంకె కూటమి తమ భాగస్వామ్య పక్షాలను కాపాడుకునే ప్రయ త్నంలో పడింది. ఈ డిఎంకె పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్న యు.పి.ఎ అధికారం నుంచి తప్పు కుని పదేళ్లు పూర్తయింది. బీజేపీ సారథ్యంలోని ఎన్‌.డి.ఎ కూటమి ఈసారి అధికారం లోకి వచ్చే పక్షంలో యూపీఏ పరిస్థితి మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ అన్నాడిఎంకె మాత్రం కేంద్రంలో అధికారానికి వచ్చే బీజేపీ కూటమితో చెట్టపట్టాల్‌ వేసే అవకాశమే ఎక్కువగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News