తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే రాజకీయంగా జన్మనిచ్చిన అచ్చంపేట ప్రాంతానికి నిరంతరం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం శ్రమిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం లోని అమ్రాబాద్ మండల పరిధిలోని ప్రశాంత్ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతనంగా గ్రామపంచాయతీ భవనానికి నాయకులు, గ్రామస్థులతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడి ఉన్న ప్రతిపక్ష నాయకులు వారి హయాంలో అభివృద్ది, సంక్షేమం చేయక కాలం గడిపారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయని పేర్కొన్నారు.
అచ్చంపేట ప్రాంతాన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి శశ్యామలం చేయాలనే తపన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రశాంత్ కాలనీలో మరిన్ని పనులు చేపడుతామని తెలిపారు. నాపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి నల్లమల్ల ప్రజలను ఆందోళనకు గురిచేయడం మంచిది కాదని హితవు పలికారు. ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తుంటే కలిసి రావాలని, కావాలని కుట్రలు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సైదులు, నాయకులు శ్రీరామ్ నాయక్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.