బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మూడు రోజుల లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ కు పయనమయ్యారు.
బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం మేరకు లండన్ వెళ్లిన కవిత పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్లు – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల పాత్ర అనే అంశంపై ఆ సంస్థ నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు.
లండన్ లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. అదే విధంగా నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని – యుకే ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం, రాజకీయాల్లో మహిళల పాత్ర, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ ప్రయాణం వంటి వాటిపై ఆమె తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు.
తన లండన్ పర్యటనను ముగించుకొని సోమవారం నాడు హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. లండన్ విమానాశ్రయంలో బీఆర్ఎస్, భారత్ జాగృతి కార్యకర్తలు మరియు ప్రవాస భారతీయులు ఆమెకు వీడ్కోలు తెలిపారు.