Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Kavitha: బీఆర్ఎస్ ది బీసీల ప్రభుత్వం

Kavitha: బీఆర్ఎస్ ది బీసీల ప్రభుత్వం

60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ బీసీ కులగణన ఎందుకు చేయలేదు ?

దేశాన్ని 60 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎందుకు బీసీ కులగణన చేపట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు బీసీ కులగణన నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారని, బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారని చెప్పారు.

- Advertisement -

మంగళవారం రోజున నిజామాబాద్ లో జరిగిన నాయిబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ…

గత ఐదారు రోజుల నుంచి బీసీ కుల గణనపై రాహుల్ గాంధీ కొత్తగా మాట్లాడుతున్నారని, కానీ సీఎం కేసీఆర్ 2014లో సీఎం కాగానే బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని స్పష్టం చేశారు. బీసీల కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసిన తొలి పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. తాము డిమాండ్ చేయడంతో 2015-16లో బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిందని అన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడడం లేదని విమర్శించారు. 60 ఏళ్లు దేశాన్ని ఏలినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 60 ఏళ్లలో ఏమి చేయకుండా ఇప్పుడడేమో చేస్తామని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతీ ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే పేరిట ప్రజల వివరాలను సేకరించామని, అందువల్లనే అన్ని వర్గాలకు సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించగలేగుతోందన్నారు. కాబట్టి దేశంలో ఉన్న బీసీలందరికీ న్యాయం జరగాలని, అందు కోసం బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కోటా ఉండాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తామని అంటున్నారని, ఎన్నికలు రాగాలనే వాళ్లు ఆగమాగం చేస్తారని విమర్శించారు.

సమాజంలో నాయిబ్రాహ్మణుల పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. నాయిబ్రాహ్మణుల కుల వృత్తిని కాపాడడానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. చిన్న సెలున్లుకు 250 యూనిట్ల విద్యుత్తు వరకు సబ్సిడీ అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 37 వేల సెలున్లకు సబ్సిడీ వర్తిస్తోందన్నారు. 60 ఏళ్ల ఇతర పార్టీల పాలనలో నాయిబ్రహ్మణులకు ఏ ప్రభుత్వం అండగా నిలవలేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో బీసీలను చిన్నచూపు చూశాయని విమర్శించారు. బీసీలకు కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. బీసీల్లోనూ అత్యంత వెనుకబడిన వర్గాలను గతంలో ఏ పార్టీ అయినా పట్టించుకుందా అన్నది ఆలోచించాలని కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కన్నతల్లి వంటి కులవృత్తులను పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేశారని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో కుల వృత్తులకు పునర్ వైభవం వచ్చిందని. నిజామాబాద్ లో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో పాలకులకు గౌడ కులస్తులకు అన్యాయం చేశారని విమర్శించారు. మద్యం ద్వారా ఆదాయం కోసం గౌడ కులస్తుల కల్లు వ్యాపారాన్ని హీనంగా చేసి చూపించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కల్లు అమ్మకుండా చేశారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌడలకు మంచి రోజులు వస్తయని, కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో హామీ ఇచ్చారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. 70 వేల కుటుంబాలకు నేరుగా ఉపాధి కలుగుతోందని చెప్పారు. కుల వృత్తి అంటే కన్న తల్లి వంటిదని స్పష్టం చేశారు. కుల వృత్తి బాగుంటే ఆ కులం, కుటుంబం, వ్యవస్థ బాగుంటుందని తెలిపారు. అటువంటి కుల వృత్తులను పునరుద్ధరించడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తాటిచెట్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగితే గతంలో రూ. 2 లక్షలుగా ఉన్న బీమాను సీఎం కేసీఆర్ సర్కారు రూ. 5 లక్షలకు పెంచిందని గుర్తు చేశారు. ఈ మొత్తాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సహజ మరణానికి కూడా నష్టపరిహారం చెల్లించాలని వినతులు వస్తున్నాయని, దాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2014 సెప్టెంబరులో కల్లు కాంపోండ్ లు పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశామని తెలిపారు.

హరిత హారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ కాలువపై తాటి, ఈత చెట్లు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని, తాటి, ఈత వనాల పెంపకానికి జిల్లాకు రూ. 5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, కొన్ని చోట్ల కొంత మంది వనాలను పెంచి గౌడ కుల వృత్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. మద్యం వ్యాపారం ఒకప్పుడు గౌడన్నల చేతుల్లో ఉండేదని, కాలక్రమంలో వారి చేతుల నుంచి వెళ్లిపోయిందని, కాబట్టి మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘతన కేసీఆర్ కు దక్కుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఈ తరహా రిజర్వేషన్ల ఎక్కడ లేవని చెప్పారు. ప్రభుత్వం పథకాలతో పాటు ఆత్మగౌరవం ఇస్తున్నదని, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ పాపన్న జయంతిని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించలేదని గుర్తు చేశారు. ఒక పక్క అభివృద్ధి మరోవైపు ఆత్మభిమానంతో ప్రతీ కులాన్ని కూడా హైదరాబాద్ లో 5 ఎకరాల భూమి ఇచ్చి రూ. 5 కోట్లు ఇచ్చామని, అందులో భాగంగా గౌడ కులస్తుల కోసం గీత భవన్ ను నిర్మించుకోడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ప్రజల దయతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరో రూ. కోటి ఖర్చు చేస్తే నిజామాబాద్ లో గౌడ కులస్తుల భవన నిర్మాణం పూర్తవుతుందని, ఎన్నికలు పూర్తయ్యి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను రూ. 50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. 2014 వరకు అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అప్పుడు నిజామాబాద్ జిల్లా నుంచి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నా బీసీ హాస్టళ్లు జిల్లాలో కేవలం ఒకటే ఉండేదన, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 14 బీసీ హాస్టళ్లు నిర్మించిందని చెప్పారు. ఈ 15 బీసీ హాస్టళ్లలో మొత్తం దాదాపు 9 వేల మంది బీసీ బిడ్డలు చదువుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేకంగా బీసీల కోసం జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ వసతితో కూడిన డిగ్రీ కాలేజీలను నిర్మించిందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ చేస్తున్నామని, అందులో నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల మంది బీసీ బిడ్డలకు రియింబర్స్ మెంట్ ఇచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 14 వేల కోట్లు మే కళ్యాణ లక్ష్మి నిధులు అందిస్తే అందులో 7 లక్షల మంది బీసీ ఆడబిడ్డలు లబ్దీదారులు ఉండడం సంతృప్తిని ఇచ్చే విషయమన్నారు. తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పట్ల అదే ఆశీర్వాదాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తాను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గణేష్ గుప్తాకు వేసే ప్రతీ ఓటు కేసీఆర్ కు వేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అభ్యర్థించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇతర పార్టీల నాయకులు వచ్చి చాలా మాటలు చెబుతారని, ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ఇతర పార్టీల వాళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News