Saturday, September 28, 2024
Homeఓపన్ పేజ్Police Commemoration day: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం

Police Commemoration day: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

దేశ భద్రతకు, ప్రజల కోసం విధి నిర్వహణలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడే బాధ్యతగా ధైర్యంతో శత్రువులను తిప్పికొట్టడం పోలీసుల త్యాగాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే సరిహద్దుల్లో పోలీసులు మేల్కొని ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణపై కాపలా కాస్తుంటారు. ఎండా, వాన, చలి మరియు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రజల కోసం జీవిస్తూ, ప్రజల ప్రాణాల భద్రత కోసం పోలీసులు చేస్తున్న త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ జరుపుకుంటారు.
1959 అక్టోబర్‌ 21న భారత్‌, చైనా సరిహద్దు ప్రాంతంలో డిఎస్పీ కరమ్‌ సింగ్‌ నేతృత్వంలో పంజాబ్‌కు చెందిన 21 మంది పోలీసుల బృందం సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్‌ భూ భాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సిఆర్‌పిఎఫ్‌ దళం హాట్‌ స్ప్రింగ్‌ ప్రాంతంలో వారిని దీటుగా ఎదుర్కొని పోరాటం చేసినారు. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలకు గుర్తుగా పోలీస్‌ అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. భారత జవాన్లు సుమారు 2500 మైళ్ల పొడవైన సరిహద్దును టిబెట్‌ ప్రాంతంలో పోలీస్‌ సిబ్బంది బాధ్యతతో కాపలా కాస్తున్నారు. భారత్‌-చైనా సరిహద్దులోని ఆక్సయ్‌ చిన్‌ ప్రాంతాన్ని హాట్‌ స్ప్రింగ్‌ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతం 16 వేల అడుగుల ఎత్తులో, రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్య ఉంటుంది. దీనిని వేడి నీటి బుగ్గ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం అమరవీరుల జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచింది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి యేటా ఈ ప్రాంతం వద్ద పోలీస్‌ అమర వీరులకు నివాళులర్పించడం ఆనవాయితీ. ప్రతియేటా వివిధ రాష్ట్రాల పోలీసుల బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులర్పిస్తారు.
దేశాన్ని కాపాడే వారు సైనిక జవాన్లు అయితే, అంతర్గత శక్తుల నుండి ప్రజలను కాపాడి, వారి భద్రతకు భరోసా ఇస్తూ, సామాజిక ఆస్తులు రక్షించేది మన పోలీసులు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయి. నిత్యం అప్రమత్తంగా ఉండాలి. పని గంటలలో తేడా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడికి లోనై అనారోగ్య సమస్యలు సైతం ఎదుర్కొంటారు. బందోబస్తు డ్యూటీలో పాల్గొనేవారు, డ్యూటీకి వచ్చింది మొదలుకొని ఇంటికి వెల్లే వరకు విరామం లేకుండా పనిచేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో సిబ్బంది కొరత కారణంగా, అత్యవసర పరిస్థితులలో సెలవులు మంజూరు కాకుండా విధినిర్వహణలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. పోలీసులలో సిఆర్‌పిఎఫ్‌, రిజర్వు, బిఎస్‌ఎఫ్‌, సిఐఎస్‌ఎఫ్‌, ట్రాఫిక్‌ వంటి పోలీస్‌ వర్గాలు తమ విధి నిర్వహణలో తమ ప్రాణాలు ఫణంగా పెట్టి, ప్రజల ఆస్తులను, దేశ సమగ్రతను, శాంతి భద్రతలను కాపాడుతున్నారు. అందుకే భారత ప్రభుత్వం వారి స్మారకార్థం అమరుల కుటుంబాలకు ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ నిధి కేంద్రాలు ఏర్పాటు చేశాయి. ఈ సంక్షేమ నిధి ద్వారా అమరులైన కుటుంబాల పిల్లలకు స్కాలర్‌ షిప్‌ లు, ఉచిత విద్యను అందిస్తున్నాయి. అనారోగ్య పరిస్థితులలో మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పోలీసులకు భద్రత స్కీమ్‌/కార్డు ద్వారా ఉచిత వైద్య సదుపాయం అందుతున్నది.
‘ఫ్లాగ్‌ ఫండ్‌ పేరుతో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రతి యేటా నిధిని వసూలు చేసి వారి సంక్షేమం నిధిలో జమ చేయడం జరుగుతుంది. 1975 సంవత్సరంలో కూడా భారత్‌, చైనాల మధ్య యుద్ధ వాతావరణం ఉండేది. అప్పుడు కూడా పోలీసులు అమరులైనారు. ఆ తర్వాత ఈ సంవత్సరం జూన్‌ 15 తూర్పు లడక్‌ యొక్క గాల్వాన్‌ వ్యాలీలో భారత్‌ కి చెందిన బీహార్‌ రెజిమెంట్‌ 16 వ బెటాలియన్‌ కు చెందిన కల్నాల్‌ సంతోష్‌ బాబుతో కూడిన 20 మంది బృందం వీరమరణం చెందడం చరిత్రలో మర్చిపోలేని సంఘటన. తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో భారత రహదారి నిర్మాణంపై చైనా దళాలు అభ్యంతరం వ్యక్తం చేయడం, లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ (ఎల్‌ ఓ సి) వద్ద దొంగ దెబ్బ కొట్టి ఉద్రిక్తత దారితీసిన క్రమంలో మన జవాన్లు జరిపిన పోరాటం అజరామం. వారి పోరాట స్ఫూర్తికి జోహార్లు అర్పిద్దాం. ఈ సంవత్సరం పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాల సంస్మరణలో భాగంగా ఈ నెల 21 నుండి 31 వరకు ‘ఫ్లాగ్‌ డే’ వేడుకలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ సంస్మరణ కార్యక్రమం అక్టోబర్‌ 21 ఫ్లాగ్‌ డేతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు వారం పాటు నిర్వహిస్తారు.. ఈ ఫ్లాగ్‌ డే వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం, పోలీసుల విధులు, రక్త దాన శిబిరాలు నిర్వహించి ప్రజలు, యువత నుండి రక్తం సేకరించి ఆయా బ్ల్‌డ బ్యాంక్‌ లకు ఇవ్వడం, నేరాల అదుపునకు ఎలా చర్యలు తీసు కోవాలి అనే విషయాల మీద విధ్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థ,సైబర్‌ క్రైమ్‌, సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల త్యాగాలు మొదలైన అంశాలపై ప్రజలకు విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర పోలీసుల పాత్ర, వారి సేవలు అనే అంశంపై విద్యార్థులకు పద్ధతిలో వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు, ర్యాలీలు, స్మారక పరుగు, వైద్య శిబిరాలు సైతం నిర్వహిస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో, వారి భాగస్వామ్యంతో నిర్వహించడం ద్వారా యువతలో దేశభక్తి, జాతీయ భావం, దేశ భద్రతపై అవగాహన కలుగుతుందని చెప్పవచ్చును. వారిని స్మరించడం ద్వారా పోలీసు అమరుల కుటుంబాలలో మనోధైర్యం కలుగుతుందని చెప్పవచ్చును. ముఖ్యంగా యువత, విద్యా ర్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నప్పుడే వారికి నిజమైన నివాళి.

- Advertisement -
  • కామిడి సతీశ్‌ రెడ్డి,

తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
9848445134.

(నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News