ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో మీ ఆశీర్వాదం తీసుకుంటూ మీ ముందుకు వచ్చానని ఒక అవకాశం ఇచ్చి, ఆశీర్వదించండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, పార్టీ వార్డు అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.