Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్First women's university: దేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం

First women’s university: దేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం

అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు

శ్రీమతి నతీబాయి దామోదర్‌ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయం దేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఒక పురుషుడు విద్యావంతుడైతే అభివృద్ధి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదే ఒక స్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉంటాయి. 19వ శతాబ్దంలో భారత దేశంలో మహిళా విద్య, సాధికారత-అభ్యుదయం కోసం రాజారామ్‌ మోహన్‌ రాయ్‌, స్వామీ వివేకానంద, ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌, బాల శాస్త్రి జంబేకర్‌, విట్టల్‌ రాంజీ షిండే, గోపాల్‌ హరి దేశముఖ్‌, అనీబీసెంట్‌, కందుకూరి వీరేశ లింగం, పెరియార్‌ ఇ వి రామస్వామి, దొండో కేశవ కార్వే లాంటి ఎందరో సంఘసంస్కర్తలు అవిరళ కృషి చేసారు. కాగా దొండో కేశవ కార్వే ప్రత్యేకించి మహిళల కోసం 1916 జూన్‌ 2న కేవలం ఐదుమంది విద్యార్థులతో భారత దేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం భారతీయ మహిళా విశ్వవిద్యాలయం స్థాపించి మహిళాభ్యుదయం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. 1920లో ఈ విశ్వవిద్యాలయం పేరును శ్రీమతి నతీబాయి దామోదర్‌ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయం లేదా ఎస్‌ఎన్‌డీటీ ఉమెన్స్‌ యూనివర్సిటీగా మార్చారు. 1931లో తన మొదటి కళాశాలను ముంబైలో స్థాపించిన ఎస్‌ఎన్‌డీటీ విశ్వ విద్యాలయం ఐదు సంవత్సరాల తర్వాత ప్రధాన కార్యాలయాన్ని ముంబైకి మార్చింది. 1949లో భారత ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని చట్టబద్ధమైన విశ్వవిద్యాలయంగా గుర్తించింది. ఎస్‌ఎన్‌డీటీ విశ్వవిద్యాలయం మరియు మహిళల కోసం కార్వే ప్రారంభించిన ఇతర విద్యా సంస్థలు ప్రస్తుతం ప్రీ-ప్రైమరీ పాఠశాలల నుండి హ్యుమానిటీస్‌, సైన్సెస్‌, ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ మరియు బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లోని కళాశాలలలో వివిధ అంశాలను బోధిస్తున్నాయి.
బాల్యం మరియు విద్యాభ్యాసం
దొండో కేశవ కార్వే 18 ఏప్రిల్‌, 1858 న మహారాష్ట్ర రత్నగిరి జిల్లా ఖేడ్‌ తాలూకాలోని షెరావలి అనే చిన్న కుగ్రామంలో దిగువ మధ్యతరగతి చిత్పవన్‌ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు కేశవ్‌ బాపున్నా కార్వే. 1884 లో ఆయన బొంబాయి (ముంబై) లోని ఎల్ఫిన్‌స్టోన్‌ కాలేజీ నుండి గణితంలో బ్యాచిలర్‌ డిగ్రీని అందుకున్నారు.
మహిళాభ్యుదయం కోసం ఎనలేని కృషి
ప్రాచీన కాలంలో హిందూ సాంఘిక ఆచారాలు, కట్టుబాట్లు బాలికల విద్య పట్ల విముఖంగా ఉండడంతో పాటు సాధారణంగా తల్లిదండ్రులు తమ కుమార్తెలకు యుక్తవయస్సు రాకముందే వారికంటే వయసులో స్వల్ప తేడా ఉండే బాలరతో బాల్య వివాహాలు చేయడమే కాక పలు సందర్భాలలో వారికంటే వయసులో ఎంతో పెద్ద వారు లేదా భార్యను కోల్పోయిన వ్యక్తులతో కూడా పునర్వివాహం జరిపించేవారు. అయితే నాటి సాంఘిక విధానాలు మాత్రం వితంతువుల పునర్వివాహాల పట్ల పూర్తి విముఖంగా ఉండేవి. ఈ నేపథ్యంలో ఒక భర్త (అన్నదాత) మరణిస్తే, అవిద్య మరియు ఆర్ధిక స్వాతంత్య్రం లేకపోవడంతో అతని వితంతువు శేష జీవితం అగమ్యగోచరంగా మారిపోయేది. గత్యంతరం లేని పరిస్థితులలో ఆ వితంతువు తన దివంగత భర్త కుటుంబానికి సేవ చేస్తూ దుర్భర జీవితాన్ని గడపవలసి వచ్చేది. ఆ రోజుల్లో వితంతువుల దయనీయమైన పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన ఆయన వారి అభ్యున్నతి కోసం పనిచేయడానికి కంకణ బద్ధుడయ్యాడు. ఆయన ప్రధానంగా మహిళా సంక్షేమం, ప్రత్యేకించి – విద్య, వ్యక్తిగత స్వేచ్ఛ, వితంతువుల పునర్వివాహం మరియు కులతత్వ నిర్మూలన కోసం ఎంతో పాటుపడ్డారు. అలనాటి సాంఘిక దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించే మహర్షి కార్వే అభ్యుదయ భావజాలం మరియు పట్టుదలతో స్త్రీ జాతికి వ్యతిరే కంగా పైన పేర్కొన్న కఠినమైన సామాజిక కట్టుబాట్లను ఛేదించడంలో భారతదేశంలోని సంఘసంస్కర్తలలో ఒకరిగా ఎదిగారు. అతను స్త్రీ విద్యను ప్రోత్సహించడంతో పాటు వితంతువులు పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి స్వేచ్ఛ, తోడ్పాటును అందించేవారు. భారత ప్రజానీకం ఆయనను మహర్షి (గొప్ప జ్ఞాని)గా సంబోధించడం ఆయన పట్ల వారికి గల గౌరవాన్ని సూచిస్తుంది. కార్వే సన్నిహితులు ఆయనను అన్నా కార్వే అని ఆప్యాయంగా పిలిచేవారు (మరాఠీలో తండ్రి లేదా అన్నయ్యను అన్నా అని సంబోధించడం పరిపాటి).
1936లో జిల్లా స్థానిక బోర్డులచే నిర్వహించబడే పాఠశాలలు లేని గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలనే లక్ష్యంతో కార్వే మహారాష్ట్ర విలేజ్‌ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ సొసైటీని ప్రారంభించారు. గ్రామా ల్లోని పెద్దల పఠన అలవాట్లను కొనసాగించడాన్ని కూడా ఆయన ప్రోత్సహించారు. 1944లో, అతను సమతా సంఘ్‌ (అసోసియేషన్‌ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఈక్వాలిటీ)ని స్థాపించాడు.
వివాహం-పునర్వివాహం
తన మొదటి వివాహం గురించి ప్రస్తావిస్తూ కార్వే ఆత్మకథలో ఇలా వివరించారు … నాకు పద్నాలుగు సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది. అప్పుడు నా భార్యకు ఎనిమిదేళ్లు. ఆమె కుటుంబం మా కుటుంబానికి చాలా సమీపంలో నివసించడంతో మేము కలిసి ఆడుకునే వాళ్ళం. అయితే, వివాహం తర్వాత, మేము ప్లేమేట్స్‌గా మా పాత సంబంధాన్ని మరచిపోయి, అపరిచితులలా ప్రవర్తించాల్సి వచ్చింది. ఒకరినొకరు కలుసుకున్నప్పటికీ ఎప్పుడూ మాట్లాడుకోలేదు…. మా సోదరి ద్వారా పరస్పరం సందేశాలు పంపుకోవలసి వచ్చింది….. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నా వైవాహిక జీవితం ఇరవై ఏళ్ళ వయసులో మురుద్‌ లో ప్రారంభం కాగా, 1891లో రాధాభాయ్‌ 27 సంవత్సరాల వయస్సులో కొడుకు రఘునాథ్‌ కార్వేకు జన్మనిచ్చి ప్రసవ సమయంలో మరణించింది.
వితంతు వివాహాలకు వ్యతిరేకంగా అప్పటికే ప్రబలంగా ఉన్న కఠినమైన సామాజిక విధానాలు రాధాబాయి మరణంతో కార్వే మనస్సును మరింత బలంగా కుదిపేసింది. ఒక సంఘసంస్కర్తగా ఆదర్శ భావాలను కేవలం ప్రవచించడమే కాక ఆచరణాత్మకంగా పాటించి చూపేం దుకు ఆయన అసాధారణ ధైర్యంతో రెండు సంవత్సరాల తర్వాత, నాటి సామాజిక ఆచారాల ప్రకారం అవివాహి తను పెళ్ళి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటికే వివాహం అయ్యి, మూడు నెలలకే 8 సంవత్సరాల వయస్సులో వితంతువుగా మారిన 23 ఏళ్ల గోధుబాయిని పునర్వివాహం చేసుకున్నాడు. కార్వేను వివాహం చేసుకునే నాటికే గోధుబాయి పండిత రమాబాయి మార్గదర్శనంలో నిర్వహింపబడుతున్న శారదా సదన్‌లో మొట్టమొదటి వితంతు విద్యార్థినిగా కొనసాగుతూ వితంతువుల పునర్వివాహాలకు వ్యతిరేకంగా సామాజిక ధర్మాలను ధిక్కరించడంలో కార్వే లాగా అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారు. మొదటి భార్య మరణానంతరం, ఒక వితంతువును పునర్వివాహం చేసుకోవడం ఛాందస భావాలు గల ఆయన కుటుంబసభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు సమర్ధించనప్పటికీ ఆయన దానిని ఖాతరు చేయలేదు.
ప్రేరణ
మహిళాభ్యుదయం పట్ల పండిత రమాబాయి, పండిట్‌ విష్ణుశాస్త్రి మరియు పండిట్‌ ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ ల ఆదర్శ భావాలు మరియు కృషి కార్వే తన జీవితాన్ని స్త్రీ విద్య కోసం అంకితం చేసేలా ప్రేరేపించాయి. హెర్బర్ట్‌ స్పెన్సర్‌ యొక్క రచనలు కూడా అతనిని బాగా ప్రభావితం చేశాయి. సామాజిక సంస్కరణల కృషిలో భాగంగా 1893 లో కార్వే విధావా-వివాహోత్తేజక్‌ మండలి ని స్థాపించి 1895లో దానిని విధవా-వివాహ-ప్రతిబంధ్‌-నివారక్‌ మండలి (వితంతువుల వివాహాలకు అడ్డంకులు తొలగించే సంఘం)గా పేరు మార్చారు. ఈ సంస్థ వితంతు వివాహాలను ప్రోత్సహించడమే కాకుండా, వారి పేద పిల్లలకు కూడా సహాయం చేసేది. నగరంలోని ఆధిపత్య సనాతన బ్రాహ్మణ సమాజం ఆయనను సంస్కరణ కార్యకలాపాల కారణంగా బహిష్కరించడంతో, 1896లో పూణే శివార్లలోని హింగానే అనే గ్రామంలో కార్వే హిందూ వితంతువుల గృహ సంఘం, వితంతువులతో సహా మహిళల కోసం ఒక మహిళాశ్రమం మరియు పాఠశాలను ప్రారంభించారు. 1907లో మహిళా విద్యాలయాన్ని, 1908 లో వితంతువుల గృహం మరియు మహిళా విద్యాలయ కార్మికులకు శిక్షణ ఇచ్చేందుకు నిష్కం కర్మ మఠ్‌ (సోషల్‌ సర్వీస్‌ సొసైటీ)ని ప్రారంభించారు. తరువాత వితంతువుల గృహం హింగానే స్త్రీ శిక్షణ సంస్థగా మరియు మహర్షి కార్వే స్త్రీ శిక్షణ సంస్థగా పేరు మార్చబడింది. తన కొద్దిపాటి వనరులతో, కార్వే చాలా సంవత్సరాలు హింగానే నుండి పూణేకు అనేక మైళ్ల దూరం కాలినడకన ప్రయాణించి ఫెర్గూసన్‌ కాలేజీలో గణితం బోధిస్తూ విరామ సమయంలో ప్రగతిశీల దాతల నుండి విరాళాలు సేకరించేవారు. కార్వే 20 ఏళ్ల వితంతు మరదలు, పార్వతిబాయి అథవాలే అతని పాఠశాలలో చేరిన మొదటి వితంతువు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆమె అప్పటి హిందూ వితంతువుల గృహ సంఘం ప్రథమ మహిళా సూపరింటెండెంట్‌గా సేవలందించింది. టోక్యోలోని జపాన్‌ మహిళా విశ్వవిద్యాలయం గురించి చదివిన కార్వే, 1916లో పూణేలో కేవలం ఐదుగురు విద్యార్థులతో భారతదేశంలో మహిళల కోసం మొట్ట మొదటి విశ్వవిద్యాలయం భారతీయ మహిళా విశ్వవిద్యాలయం స్థాపించడానికి ప్రేరణ పొందారు. ఈ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశాలు మహిళాభిరుచికి అనుగుణంగా రూపొందించబడడం విశేషం. 1920లో ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త మరియు పరోపకారి అయిన సర్‌ విఠల్‌ దాస్‌ థాకర్సే, ఈ విశ్వవిద్యాలయానికి 15 లక్షల రూపా యలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత విశ్వవిద్యాలయం పేరును శ్రీమతి నాతిబాయి దామోదర్‌ థాకర్సే ఇండియన్‌ ఉమెన్స్‌ యూనివర్శిటీ లేదా ఎస్‌ఎన్‌డీటీ ఉమెన్స్‌ యూనివర్శిటీగా మార్చారు. 1917-1918 లో, ఆయన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం ఒక శిక్షణా కళా శాలను మరియు బాలికల కోసం మరొక పాఠశాలను స్థాపించి దానికి కన్యాశాల అని పేరు పెట్టారు. 1936లో మహారాష్ట్రలోని గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలనే లక్ష్యంతో మహారాష్ట్ర విలేజ్‌ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ సొసైటీని, 1944లో మానవ సమానత్వ ప్రచారం కోసం సమతా సంఘ్‌ ను ప్రారంభించారు. కుల వ్యవస్థ మరియు అంటరానితనం నిర్మూలన కోసం ఆయన రాజీ లేని పోరాటం చేసారు. సాంఘిక సంస్కరణ కార్యకలాపాలకు పూర్తి సమయం వెచ్చించక ముందు, 1891 నుండి 1914 వరకు అతను పూణే లోని ఫెర్గూసన్‌ కళాశాలలో గణితం బోధించేవారు.
అంతర్జాతీయ స్థలిపై ప్రసంగాలు
మార్చి 1929లో, కార్వే ఇంగ్లాండ పర్యటనలో భాగంగా మాల్వెర్న్‌లో జరిగిన ప్రైమరీ టీచర్స్‌ కాన్ఫరెన్స్‌, లండన్‌ లోని కాక్స్‌టన్‌ హాల్‌లో జరిగిన ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌ సమావేశంలో భారతదేశంలో మహిళల విద్య, 25 జూలై నుండి 4 ఆగస్ట్‌ 1929 వరకు జెనీవాలో జరిగిన విద్యా సదస్సులో మహిళలకు ఉన్నత విద్యలో భారతీయ ప్రయోగం అనే అంశాలపై ప్రసంగించడంతో పాటు ఆగష్టు 8 నుండి 21, 1929 వరకు ఎల్సినోర్‌లో న్యూ ఎడ్యుకేషన్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో విద్యావేత్తల అంతర్జాతీయ సమావేశానికి తదుపరి అమెరికా పర్యటనలో భారతదేశంలోని మహిళల విద్య మరియు సామాజిక సంస్కరణలు అనే అంశాలపై వివిధ ఫోరమ్‌లలో ఉపన్యాసాలు ఇచ్చారు. టోక్యోలోని మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా అందర్శించిన అనంతరం ఏప్రిల్‌ 1930లో స్వదేశానికి తిరిగి వచ్చి, మళ్ళీ అదే సంవత్సరం డిసెంబరులో భారతదేశంలో మహిళాభ్యుదయం కోసం తాను చేస్తున్న కృషిని విశ్వవ్యాప్తం చేయడానికి పదిహేను నెలల పాటు ఆఫ్రికా దేశాలైన మొంబాసా, కెన్యా, ఉగాండా, తంగనాయికా, జాంజిబార్‌, పోర్చుగీస్‌ తూర్పు ఆఫ్రికా మరియు దక్షిణాఫ్రికాలను సందర్శించారు.
పురస్కారాలు
మహిళాభ్యుదయం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1955లో భారత తొలి రాష్ట్రపతి డా బాబూ రాజేంద్ర ప్రసాద్‌ చేతుల మీదుగా పద్మవిభూషణ్‌ను, 1958లో ఆయన శతాబ్ది జన్మదిన సంవత్సరంలో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను భారత రెండవ రాష్ట్రపతి డా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేతులమీదుగా అందుకున్నారు. (2 జనవరి 1954 న అప్పటి రాష్ట్రపతి డా బాబూ రాజేంద్ర ప్రసాద్‌ భారత రత్న అవార్డును స్థాపించారు). 1958 వ సంవత్సరంలోనే ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం తపాళా బిళ్ళను విడుదల చేసింది. ముంబైలోని క్వీన్స్‌ రోడ్డు పేరును మహర్షి కర్వే రోడ్డుగా మార్చి మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన పట్ల తన గౌరవాన్ని చాటుకుంది. ఆయన 1942లో బనారస్‌ హిందూ యూని వర్సిటీ నుండి, 1951లో పూణే యూనివర్సిటీ నుండి 1954లో ఎస్‌ఎన్‌డీటీ యూనివర్సిటీ నుండి డీ. లిట్‌., ను 1957లో యూనివర్సిటీ ఆఫ్‌ బొంబాయి నుండి ఎల్‌ ఎల్‌ డి పురస్కారాలను అందుకున్నారు. ఎప్పుడు కూడా తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాకుండా తన ఆశయసిద్ధి కోసం శ్రమించిన ఆయన దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అందుకున్న నాలుగేళ్ల తరువాత నవంబర్‌ 9, 1962 న మరణించారు.
1928లో కార్వే మరాఠీలో ఆత్మవృత్త మరియు 1936లో ఆంగ్లంలో లుకింగ్‌ బ్యాక్‌ అనే పేరుతో తన ఆత్మకథను రచించారు. ఒక పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలో హాజరయ్యేందుకు తాను పడ్డ కష్టాన్ని తన ఆత్మకథలో ఆయన విపులంగా వివరించారు. ఆర్ధిక స్థోమత లేని కారణంగా కుండపోత వర్షంలో కాలినడకన అత్యంత కఠినమైన రహదారి గుండా 110 మైళ్ళు ఎంతో శ్రమకోర్చి నడిచి సమీపంలోని సతారా నగరానికి చేరుకోగా, నిర్దిష్టమైన వయసు కన్నా తక్కువ వయసున్న వాడిగా కనిపిస్తున్నాడన్న నెపంతో పరీక్షకు హాజరయ్యేందుకు అక్కడి అధికారులు అనుమతించ లేదని వాపోయారు. రెండవ పుస్తకం చివరలో నా జీవిత కథ ఇక్కడ ముగుస్తుంది. ఈ సరళమైన కథ కొంత ఉపయోగకరమైన ప్రయోజనం కోసం ఉపయోగ పడుతుందని నేను ఆశిస్తున్నాను అని రాయడం ఆయనపై గౌరవాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది.

- Advertisement -

యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ

  • 8885050822
    9866656907
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News