Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Do India really needs Governor system? గవర్నర్ల వ్యవస్థ అవసరమా ?

Do India really needs Governor system? గవర్నర్ల వ్యవస్థ అవసరమా ?

ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలుండగా గవర్నర్లెందుకు ?

గవర్నర్ల పనితీరు చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. గవర్నర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కీలకమైన బిల్లులను ఆమోదించకుండా వాయిదా వేస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్ర గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అనేక బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రతినిత్యం ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి, కేంద్రం నియమించిన గవర్నర్లకు మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉండటంతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు రెచ్చిపోతున్నారు. ఢిల్లీలో అయితే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రికి లెఫ్టినెంట్ గవర్నర్ కనీస మర్యాద కూడా ఇవ్వని పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈనేపథ్యంలో బ్రిటిషర్ల నుంచి అరువు తెచ్చుకున్న గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.

- Advertisement -

గవర్నర్ల వ్యవస్థ మరోసారి తెరమీదకు వచ్చింది.కీలకమైన బిల్లులను ఆమోదించకుండా వాయిదా వేస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్ర గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఇటీవల అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో గవర్నర్లు కొంచెమైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కీలకమైన బిల్లుల ఆమోదానికి సంబంధించి బీజేపీయేతర రాష్ట్రాలైన పంజాబ్‌, తమిళనాడు, కేరళ, తెలంగాణలు న్యాయపరమైన జోక్యం కోరుతూ ఆశ్రయించిన నేపథ్యంలో గవర్నర్లకు సర్వోన్నత న్యాయస్థానం హితవు పలికింది. గవర్నర్ల పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించాల్సిన సమయం వచ్చింది.గవర్నర్లు, తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కాదన్న విషయాన్ని గ్రహించాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ప్రస్తుత గవర్నర్ల తీరుకు అద్దం పడుతోంది. అలాగే గవర్నర్లు, రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదంటూ ఘాటు ఆరోపణలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం.ఆర్థిక, రాష్ట్ర అనుబంధ కళాశాలలు సహా ఏడు కీలక బిల్లులను ఆమోదించడంలో జాప్యంపై పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా గవర్నర్ల పనితీరుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యవాదులకు, ఆలోచనాపరులకు ఊరట ఇచ్చాయి. ఇందుకు కారణం మనదేశంలో కొంతకాలంగా గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం కావడమే.రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా ఉంటే, గవర్నర్ రాష్ట్ర అధినేతగా ఉంటారు. రాజ్యాంగంలో గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉన్న మాట వాస్తవమే. అయితే, ఈ విచక్షణాధికారాలు ఉన్నాయి కదా అని రెచ్చిపోతామంటే రాజ్యాంగం అందుకు అంగీకరించదు. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే విచక్షణాధికారాలను గవర్నర్లు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగ నిపుణులు చాలా సార్లు ఈ విషయం స్పష్టం చేశారు. అంతేతప్ప విచక్షణాధికారాల ముసుగులో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే అధికారం గవర్నర్లకు రాజ్యాంగం ఇవ్వలేదు. అయితే బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లోని గవర్నర్లు రాజ్యాంగ విలువలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారిని సంతృప్తిపరచడానికే తమ విచక్షణాధికారాలను వినియోగిస్తున్నారు. విచక్షణాధికారాల పేరిట రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు.

తెలంగాణలో సీఎం వర్సెస్ గవర్నర్!
మనదేశంలో కొంతకాలంగా గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదంగా మారింది. అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపేయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, గవర్నర్‌కు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఈ జాబితాలో నిన్నమొన్నటివరకు తెలంగాణ, కేరళ,తమిళనాడు, ఢిల్లీ ఉండేవి. దాదాపు రెండు సంవత్సరాల కిందట పంజాబ్‌ కూడా ఈ జాబితాలో చేరింది. తెలంగాణలో అయితే గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ప్రజా దర్బార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి గవర్నర్ తమిళిసై ప్రయత్నించడం అందరికీ తెలిసిందే. కిందటేడాది జులై నెలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలను వరదలు ముంచెత్తినప్పుడు కూడా గవర్నర్, ముఖ్యమంత్రి వేర్వేరుగా పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను వేర్వేరుగా పరామర్శించారు. వరద నష్టం పై ఇద్దరూ వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు.ఇదిలా ఉంటే గవర్నర్‌ హోదాలో ఉన్న తన పట్ల అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కేసీఆర్ సర్కార్‌పై ప్రత్యారోపణలు చేశారు తమిళిసై.

తమిళనాడు గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణ ఒక్కటే కాదు బీజేపీయేతర ప్రభుత్వాలున్న అనేక రాష్ట్రాల్లో గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య యుద్ధాలు నడుస్తున్నాయి. రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులో కూడా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. దాదాపు ఎనిమిది నెలల కిందట తమిళనాడు పేరు మార్చడానికి సంబంధించి గవర్నర్ రవీంద్ర నారాయణ రవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని సహజంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. మంత్రిమండలి రూపొందించిన ప్రసంగ ప్రతిని గవర్నర్ చదువుతారు. అంతేకానీ క్యాబినెట్ రూపొందించిన ప్రసంగ ప్రతిని పక్కన పడేసి స్వంత అభిప్రాయాలను వెల్లడించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయితే కొన్ని నెలల కిందట శాసనసభలో తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్ తనకు తోచినట్లు మాట్లాడటంతో గొడవ మొదలైంది. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ద్రవిడియన్‌ మోడల్‌ అనే అంశాలను ప్రస్తావించకుండా గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో గవర్నర్ రవి ప్రవర్తనపై డీఎంకే తీవ్రస్థాయిలో మండిపడింది. చెన్నై నగరంలోని అనేక ప్రాంతాల్లో గెట్ అవుట్ రవి ….అంటూ పోస్టర్లు కూడా వేసింది. ఒకదశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును డీఎంకే ఎంపీలు కలిసి గవర్నర్ రవిని రీకాల్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. కేరళలోనూ పరిస్థితి భిన్నంగా ఏమీలేదు. అక్కడి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు ప్రతిరోజూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో లడాయే.

పంజాబ్‌ సమావేశాల నిర్వహణపై తొలగిన సందిగ్థత
కొన్ని నెలల కిందట పంజాబ్‌ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సందిగ్థత నెలకొంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ మధ్య మార్చి నెలలో లేఖల యుద్ధం నడిచింది. ఈ విషయం చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య నెలకొన్ని వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. వివాదం సుఖాంతం సంగతి ఎలాగున్నా గవర్నర్‌, ముఖ్యమంత్రి గొడవలు పడుతున్న రాష్ట్రాల జాబితాలో పంజాబ్‌ కూడా చేరింది. తాజాగా కొన్ని కీలక బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ వైపు నుంచి జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు కెళ్లారు ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌. కాగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య ప్రతిరోజూ గొడవలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి కి కనీస మర్యాదు కూడా ఇవ్వడం లేదన్నది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఉన్న ప్రధాన ఫిర్యాదు. ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ ఏ నిర్ణయం తీసుకున్నా అది అమలుకాకుండా లెఫ్టినెంట్ గవర్నర్‌ అడ్డుపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. వీరే కాదు, ఎనభైల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూడా గవర్నర్ల వ్యవస్థ బాధితులే. ఒకదశలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే రీతిలో అప్పటి గవర్నర్ కుముద్ బెన్ జోషి చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో కుముద్ బెన్ జోషి ప్రసంగాన్ని ఖండిస్తూ ఎన్టీఆర్ క్యాబినెట్ ఏకంగా ఒక తీర్మానాన్నే చేసింది.

కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా గవర్నర్లు ?
సహజంగా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే గవర్నర్ల పనితీరుపై ఎలాంటి విమర్శలు రావు. ముఖ్యమంత్రి, గవర్నర్ ఇద్దరూ ఎవరి పని వారు చేసుకుంటూ పోతుంటారు. ఎవరి పరిమితుల్లో వారుంటారు.కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ ఉన్నప్పుడే పేచీ వస్తోంది. రాజ్ భవన్, సమాంతర అధికార కేంద్రంగా మారిపోతుంది. విచక్షణాధికారాల పేరిట ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, మంత్రివర్గ నిర్ణయాలను బేఖాతరు చేయడం వంటి అప్రాజాస్వామిక పనులకు గవర్నర్లు పాల్పడుతున్నట్లు ఆరోపణలొస్తుంటాయి. వీరికి వెన్నుదన్నుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉంటున్నారని బీజేపీయేతర పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న గవర్నర్లు !
బ్రిటిష్ పాలననాటి అవశేషమే గవర్నర్ల వ్యవస్థ. మౌలికంగా మనది సమాఖ్య వ్యవస్థ. ఫెడరలిజమే స్ఫూర్తి కావాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశించారు. అయితే, సమాఖ్య వ్యవస్థకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తూట్లు పొడుస్తున్నాయి .దీని ఫలితంగానే, గవర్నర్ల వ్యవస్థ చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించాల్సిన గవర్నర్, కేంద్రంలోని అధికార పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఫలితంగా మొత్తంగా గవర్నర్ల వ్యవస్థే వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ముఖ్యమంత్రులతో గొడవల నేపథ్యంలో అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా ? అనే ప్రశ్న కూడా తెరమీదకు వస్తోంది. తెల్లదొరల నుంచి అరువు తెచ్చుకున్న గవర్నర్ల వ్యవస్థకు చరమగీతం పాడాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఉండగా, అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరం ఏమిటి ? అని మేధావులు, రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ల వ్యవస్థ కొనసాగింపు అంశంపై జాతీయస్థాయిలో విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

-ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్‌, 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News