మరో పది పన్నెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీల మధ్యే పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క బి.ఎస్.పి తప్ప మిగిలిన చిన్నా చితకా పార్టీలన్నీ పోటీ నుంచి తప్పుకోవడమో, ప్రధాన పార్టీలకు అనుకూలంగా మారిపోవడమో జరిగింది. బీజేపీ ఇంకా తన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకునే పరిస్థితిలోనే ఉంది. ఏతావతా, ప్రధాన పోటీ పాలక భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్), కాంగ్రెస్ పార్టీల మధ్యే నెలకొని ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, పలుకుతున్న ప్రగల్భాలను పక్కన ఉంచితే, ఈసారి ఎన్నికల్లో రెండు ఆసక్తికర పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014, 2018 ఎన్నికల మాదిరిగా కాకుండా, ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి అనేది ప్రధానాంశంగా మారిపోయింది. ఇక తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ తెర మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం జరిగింది కానీ, అది అంతంత మాత్రంగానే కనిపించి మాయమైపోయింది. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ఈ అంశాన్ని ఉపయోగించడం లేదు.
ఈ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నందువల్ల ఈ పార్టీలు తెలంగాణ సెంటిమెంట్ ను పక్కన పెడితేనే మంచిదనిపిస్తోంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీద చర్చ జరగడమే మంచిది. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయడం చాలా అవసరం. తమ రెండు పర్యాయాల పరిపాలనా కాలంలో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని పాలక పక్ష నాయకులు వరుస క్రమంలో వివరిస్తున్నారు. తమ ప్రభుత్వ సాఫల్యాలను, ఘనతలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరా, సాగు నీరు, రైతు బంధు, దళిత బంధు తదితర పథకాలను తాము ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేయడమేమ కాకుండా, వాటివల్ల లక్షలాది మంది లబ్ధి పొందిన తీరును తెలంగాణ మంత్రులు, నాయకులు వివరిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని తాము అభివృద్ధి చేసిన తీరు గురించి కూడా వారు గణాంకాలతో సహా వివరించడం జరుగుతోంది.
ఇక అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం ఏమాత్రం వెనుకబడి లేదు. కొత్త కొత్త పద్ధతుల్లో, చిత్ర విచిత్రమైన రీతుల్లో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి బాగోతా లను అది వివరిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. మహిళలకు ప్రతి నెలా నగదు బదిలీ, విద్యార్థులకు నగదు ఆసరా, రైతులకు ఆర్థిక సహాయం వంటి ఆరు హామీలను కూడా అది ప్రకటిస్తోంది. మొత్తం మీద అది పాలక పక్షానికి గట్టి పోటీ ఇస్తోందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న ఈ ఆరు హామీల వల్ల ప్రయోజనం ఉండవచ్చు కానీ, కర్ణాటకను ఆదర్శంగా చేసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదమే ఉంది తప్ప, లాభపడే అవకాశం లేదు. బి.ఆర్.ఎస్ మాత్రం విద్యుత్ సరఫరా, సాగునీరు, మహిళా మపథకాలు వగైరా విషయాల్లో తెలంగాణలో తాము సాధించిన విజయాలను, కర్ణాటకలో చోటు చేసుకుం టున్న వైఫల్యాలను పదే పదే ఎత్తి చూపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ భారీగా నష్టపోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే తెలంగాణ మంత్రులు కర్ణాటకలో కాంగ్రెస్ పాలనను ఉదాహరణగా చూపించడం జరుగుతోంది. రాష్ట్రంలో మార్పు జరగాల్సిన సమయం అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుండగా, మార్పు జరగడమన్నది చాలా ప్రమాదకర వ్యవహారం అని పాలక పక్షం ప్రచారం చేస్తోంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంపై ఈ రెండు పార్టీలు స్పందిస్తున్న తీరు కూడా ఆసక్తి కలిగిస్తోంది. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా విమర్శలు సాగించిన బి.ఆర్.ఎస్ ఈసారి సీమాంధ్ర ఓటర్ల ఓట్లు కోల్పోతామన్న భయంతో చంద్రబాబు నాయుడుపై సానుభూతి వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈసారి తెలంగాణలో తమ తెలుగుదేశం పార్టీ పోటీ చేయదని చంద్రబాబు ప్రకటించినప్పటికీ, ఇక్కడ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చే మపక్షంలో ఆయన బాగా లబ్ధి పొందడం మజరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రేవంత్ మరెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడు కావడమే అందుకు కారణం. అంటే, తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే ఆంధ్రప్రదేశ్ మీద తప్పకుండా ఉంటుంది.
Telangana Assembly Elections: తెలంగాణలో ఇక ద్విముఖ పోటీ
BRS Vs Cong, KTR Vs Rahul