పోలీస్ శాఖలోని ప్రతి స్థాయి పోలీస్ అధికారులకు నిర్దేశించిన ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరును సాంకేతికంగా విశ్లేషించి, గణాంకాలలోకి మార్చి గ్రేడింగ్ ఇచ్చి.. ప్రోత్సహించడం ద్వారా మొత్తం పోలీసు వ్యవస్థ పనితీరు మరింత సమర్ధవంతంగా పనిచేసే విషయంపై డీజీపీ అంజనీ కుమార్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, తెలంగాణా పోలీస్ శాఖలో అమలులో ఉన్న సంస్థాగత నిర్మాణం, ఫంక్షనల్ వర్టికల్స్ అంశాలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం అధికారులతో సవివరంగా సమీక్షించారు. పోలీస్ శాఖలో ముఖ్యంగా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే ప్రతీ స్థాయి అధికారులు తమకు ప్రత్యేకంగా కేయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించే అంశంలో డీజీపీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సమీక్షించాలని అంజనీ కుమార్ సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రతీ ఒక్క పోలీస్ అధికారి పనిచేసేలా, ముఖ్యంగా పోలీస్ శాఖపై ప్రతి ఒక్కరిలో నమ్మకం కుదిరేలా మరింత అంకిత భావంతో పనిచేసేలా విశ్లేషించాలని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులను డీజీపీ కోరారు.