ఏటా లక్షలాది మంది భారతీయులు ఎందుకు విదేశాలకు వెళ్లిపోతున్నారు? స్వదేశంలో కన్నా విదేశాల్లో స్థిరపడడానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? ఈ ప్రశ్నలు ఆశ్చర్యమే కాదు, ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. తాజా గణాంక వివరాల ప్రకారం, ప్రస్తుతం కోటీ 80 లక్షల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వలసలు పోవడమనేది ప్రపంచంలో ఒక అరుదైన విషయం. ఇటీవల ఇండోర్‌లో ముగిసిన వార్షిక భారతీయ ప్రవాసీ దివస్‌లో ప్రధానంగా ఈ ఆందోళనకర పరిణామంపైనే చర్చ జరిగింది. భారతీయుల్లో అత్యధిక సంఖ్యా కులు విదేశాల్లో తమ భవితవ్యాన్ని, తమ అదృష్టాన్ని వెతుక్కోవడానికి దారి తీస్తున్న కారణాలను ఈ సందర్భంగా ఏర్పాటైన సదస్సులో లోతుగా చర్చించారు. భారత్ తర్వాత అంత పెద్ద సంఖ్యలో వలసలు పోతున్న జనాభా కలిగిన దేశం మెక్సికో, అయితే, మెక్సికో నుంచి ఎక్కువగా వలసలు పోయేది అమెరికా దేశానికి మాత్రమే. కానీ, భారతీయులు మాత్రం ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ కనిపిస్తుండడం గమనించాల్సిన విషయం.
గల్ఫ్ దేశాల్లో సుమారు ఎనభై లక్షల మంది భారతీయులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటుంన్నారు. ఇక అమెరికా, ఇంగ్లండ్ ఆస్ట్రేలియా, కెనడా దేశా లకు వెళ్లిన లక్షలాది మంది భారతీయులు తమ స్వదేశీ పాస్‌పోర్టుల స్థానంలో విదేశీ పాస్‌పోర్టులను సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్ధంగా ఉన్నారు. తూర్పు ఆఫ్రికా, కరిబ్బియన్, మలేషియా, ఫిజి దేశాల్లో కూడా భారతీయులు స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం కనిపిస్తుంది. వీరంతా వలస పాలకుల కాలంలోనే భారతదేశం వదిలి ఇక్కడకు కార్మికులుగా చేరుకుని స్థిరపడినవారు. విదేశాలకు వలస వెళ్లి స్థిరపడిన భారతీయుల్లో కార్మికులూ ఉన్నారు. అధికారులు, యజమానులూ ఉన్నారు. సంపన్నులూ ఉన్నారు. పేదవారూ ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే వెళ్లినవారు న్నారు. ఇటీవలే వెళ్లినవారూ ఉన్నారు. అంతా మిశ్రమంగా ఉంటుంది. అయితే, వీళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నదే పెద్ద ప్రశ్న. ఈ దేశాల్లో ఏవైనా సమస్యలు ఉత్పన్న మైతే, స్థానికుల చూపుపడేది ప్రధానంగా ప్రవాసులపైనే. ఆఫ్రికన్ దేశాల్లో పరవాలేదు కానీ, అమెరికా, ఐరోపా దేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది.
సానుకూల వాతావరణం
విశేషమేమిటంటే, చాలా దేశాల్లో భారతీయులు ఘన విజయాలు సాధిస్తున్నారు. ఇక అమెరికాలో అయితే, ఇతర దేశాల సంతతికి చెందినవారిలో భారతీయులే అతి సంపన్న వర్గంగా రికార్డులకెక్కింది. ఇంగ్లండ్ పోర్చుగల్, ఐర్లాండ మారిషస్ ప్రధాన మంత్రులు, గుయానా, సూరినామ్, ఇండొనీషియా అ ధ్యక్షులు భారతీయ సంతతికి చెందినవారే. మొత్తం మీద నాలుగు ఖండాల్లోని దేశాలలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. అనేక దేశాల్లో అత్యంత పట్టు, పలుకుబడి కలిగిన వర్గంగా రూపాంతరం చెందిన భారతీయులు భారత్‌కు, ఇతర దేశాలకు మధ్య భౌగోళికంగానే కాక, రాజ కీయంగా, ఆర్థికంగా కూడా ఓ బలమైన వారధిగా పనిచేయడం జరుగుతోంది. ఉదా హరణకు, 2008లో భారత, అమెరికా దేశాల మధ్య అణు ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించింది ప్రవాస భారతీయులే.
ఈ మధ్య కాలంలో ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల పెరుగుతున్న ఆదరణ, అభిమానం కారణంగా అమెరికాలో పాలకులు, అధికారులు భారత్ పట్ల సామరస్యంగా, సానుకూ లంగా వ్యవహరించడానికి వీలు కలుగుతోంది. ఈ సానుకూల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, కొన్ని ఆందోళనకర విషయాలను విస్మ రించలేం. ప్రతి ఏటా కనీసం లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2022లో మొదటి పది నెలల కాలంలోనే ఈ సంఖ్య లక్షా 83 వేలు దాటిందంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ప్రసిద్ధ కన్సల్టెన్సీ సంస్థ అందజేసిన వివరాల ప్రకారం, గత ఏడాది సుమారు 8,000 మంది భారతీయ కుబేరులు భారతదేశ పౌరస త్వానికి స్వస్తి పలికారు. అంతేకాదు, సంపన్న భారతీయుల్లో ఎక్కువ మంది విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మీద తమకు నమ్మకం లేదని వారు ఇందుకు కారణంగా చెబు తున్నారు. ముఖ్యంగా పన్నుల వ్యవస్థ ఇబ్బందులకు గురిచేస్తోందని కూడా వారు పేర్కొన్నారు. తాము ఎక్కడున్నా తమ దేశానికి ఉపయోగపడతామని, నిస్వార్థంగా సేవ చేస్తామని వారు చెబుతున్నా, అసలు ఈ దేశాన్ని వదిలిపోవడం ఎందుకు జరిగిందో మాత్రం తేలవలసి ఉంది.
– జి. రాజశుక